ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

KCR birthday celebrations are grand - Sakshi

ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాలు, దివ్యాంగులకు వీల్‌చైర్ల పంపిణీ 

70 కిలోల భారీ కేక్‌తో సంబురాలు, కేసీఆర్‌ పై డాక్యుమెంటరీ ప్రదర్శన 

తెలంగాణ భవన్‌లో వేడుకలకు హాజరైన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఇతర ముఖ్య నేతలు

సాక్షి, హైదరాబాద్‌: భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 70వ జన్మదిన వేడుకలను శనివారం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

పార్టీ ముఖ్య నేతలతో పాటు కేటీఆర్‌ ఉదయమే తెలంగాణ భవన్‌కు చేరుకుని తెలంగాణ తల్లి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు లక్ష రూపాయల జీవిత బీమా కవరేజీతో కూడిన ఇన్సూరెన్స్‌ పత్రాలు, పది మంది దివ్యాంగులకు వీల్‌ చైర్లను కేటీఆర్‌ పంపిణీ చేశారు.

కేసీఆర్‌ 70వ పుట్టినరోజును గుర్తు చేసేలా 70 కిలోల భారీ కేక్‌ను ఎంపీ కె.కేశవరావు, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలసి కేటీఆర్‌ కట్‌ చేశారు. తర్వాత కేసీఆర్‌ రాజకీయ జీవితం, తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో రూ పొందించిన ‘అతనే ఒక చరిత్ర’ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అలాగే కేసీఆర్‌ ఉద్యమ ప్రస్తానాన్ని ప్రతిబింబించేలా ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. 

కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు 
బీఆర్‌ఎస్‌ సభ్యత్వం కలిగి.. ప్రమాదవశాత్తూ ప్రాణాలు కో ల్పోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు 70 మందికి రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. అసెంబ్లీ మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, నాయకులు సోమా భరత్‌కుమార్, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎంపీలు రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, నేతలు అనిల్‌ కుమార్‌ కూర్మాచలం, వాసుదేవ రెడ్డి, దూదిమెట్ల బాలరాజ్‌ యాదవ్, మేడే రాజీవ్‌ సాగర్, సతీశ్‌రెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
 
బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో వేడుకలు 
మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా అసెంబ్లీ లాబీల్లోని పార్టీ శాసనసభాపక్ష కార్యాల యంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేక్‌ కట్‌ చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షాన్ని సమర్థవంతగా ఎదుర్కొన్నారని హరీశ్‌రావును పార్టీ ఎమ్మె ల్యేలు అభినందించారు.

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top