సారొచ్చారు.. పేదల్లో భరోసా.. భూకాసురుల్లో దడ

Kapra Mandal Tahsildar Gautham Kumar Dare And Dashing Works - Sakshi

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ప్రభుత్వ భూములపై పట్టున్న తహసీల్దార్‌గా అతనికి పేరుంది. ముచ్చటగా మూడోసారి తమ ప్రాంత తహసీల్దార్‌గా రావడంతో నిరుపేదల నుంచి హర్షం వ్యక్తం అవుతుంటే... కజ్జాదారుల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెడుతున్నాయి. గతంలో ప్రభుత్వ భూమిని కాపాడటంలో కీలక పాత్ర పోషించి జిల్లా అధికారులతో శభాష్‌ అనిపించుకున్నారు. అతనే గౌతమ్‌కుమార్‌. 

సాక్షి, హైదరాబాద్‌: కాప్రా మండలం కొత్తగా ఏర్పాటైన తర్వాత అక్టోబర్‌ 11, 2016న మొదటిసారిగా బాధ్యతలు చేపట్టిన గౌతమ్‌కుమార్‌ మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడి ప్రజా అవసరాల కోసం వినియోగించేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత 2020 ఫిబ్రవరి 25న రెండోసారి తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టి డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల స్థలాలతో పాటు కస్టోడియన్‌ భూములు, కార్పొరేషన్‌లో వందల ఎకరాలను కజ్జాదారుల చెర నుంచి కాపాడి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అధికారిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఉప్పల్‌ మండల తహసీల్దార్‌గా కొనసాగుతున్న గౌతమ్‌కుమార్‌ను ప్రభుత్వం కాప్రా మండల ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌గా బుధవారం అదనపు బాధ్యతలను 
అప్పగించింది. 

అక్రమార్కుల గుండెల్లో గుబులు... 
ప్రభుత్వ భూములపై పట్టున్న అధికారిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్‌కుమార్‌ మూడోసారి అదనపు బాధ్యతలు చేపట్టడడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. వాస్తవ రికార్డులకు అనుకూలంగా వ్యవహరించి పేదలకు న్యాయం చేకూర్చుతూనే... ప్రభుత్వ భూములను కబ్జాల చెర నుంచి కాపాడి ఉత్తమ తహసీల్దార్‌గా అవార్డు స్వీకరించి అధికారుల ప్రశంసలు అందుకున్నారు. 

►గతంలో ప్రభుత్వ భూములను రక్షించి సఫలీకృతమయ్యారు. గౌతమ్‌కుమార్‌ అదన పు బాధ్యతలు స్వీకరించడంతో తమకు న్యాయం జరుగుతుందని నిరుపేదలు గట్టిగా నమ్ముతున్నారు. కాని అక్రమార్కుల్లో మా త్రం అప్పుడే ఆందోళన మొదలైంది. 


అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్తున్న తహసీల్దార్‌ (ఫైల్‌) 

గతంలో సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట.. 
జవహర్‌నగర్‌లోని మల్కారం గుట్టల్లో అక్రమంగా రాత్రి వేళల్లో నడిపిస్తున్న మట్టి దందాపై గతంలో తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ ఉక్కుపాదం మోపారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ గుంతలు తవ్వుతూ సహజ వనరులను దొచుకెళ్తున్న వారిపై కొరడా ఝులిపించారు. 

ఒంటరిగా గుట్టల్లోకి 
తానే ద్విచక్రవాహనం నడుపుకుంటూ వెళ్లి సహజ వనరుల దోపిడీని నివారించడంలో సఫలీకృతుడయ్యారు. మరోమారు ఈ ప్రాంతాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.

సమగ్ర విచారణ, బాధ్యులపై చర్యలు 
ప్రభుత్వ భూములను కాపాడి భవిష్యత్‌ తరాలకు ఉపయోగడేలా చర్యలు తీసుకోవడమే నా భాధ్యత. గతంలో రెండు పర్యాయాలు ఇక్కడ విధులు నిర్వర్తించా. నిజమైన నిరుపేదలకు న్యాయం చేసి కజ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. రోడ్ల కజ్జాలు, మున్సిపాలిటీకి (ప్రజల అవసరాల కోసం) కేటాయించిన స్థలాలపై సమగ్ర విచారణ చేసి వాటి పరిస్థితులపై కలెక్టర్‌కు నివేదిక అందజేస్తా. సిబ్బంది తప్పులు చేస్తే వారిపై తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
 – గౌతమ్‌కుమార్, కాప్రా ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top