బాన్సువాడలో ‘డబుల్‌’ ధమాకా !

Kamareddy: Speaker Pocharam Srinivas Reddy Distributed 500 Double Bedroom Houses - Sakshi

ఒకే రోజు 504 ఇళ్లు పంపిణీ చేసిన స్పీకర్‌

సాక్షి, కామారెడ్డి: బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చొరవతో నిరుపేదల సొంతింటి కల నెరవేరింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ పరిధిలోని తాడ్కోల్‌లో నిర్మించిన 504 డబుల్‌ బెడ్రూం ఇళ్లను శనివారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చిన తరువాత స్పీకర్‌ పోచారం నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి చర్యలు చేపట్టారు.

రాష్ట్రంలో ఏ నియోజక వర్గంలో లేని విధంగా బాన్సువాడకు 11 వేల ఇళ్లను మంజూరు చేయించారు. ఇప్పటివరకు ఏడు వేల పైచిలుకు ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాగా పట్టణ పరిధిలోని తాడ్కోల్‌ శివారులో మొదట ఐదు వందల ఇళ్లు నిర్మించారు. వాటిని ఇప్పటికే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అదే కాంపౌండ్‌లో నిర్మించిన 504 ఇళ్లను శనివారం లబ్ధిదారులకు అందించారు.

కేసీఆర్‌ నగర్‌గా ఈ కాంపౌండ్‌కు నామకరణం చేశారు. అక్కడే రూ.90 లక్షలతో కల్యాణ వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాలనీలో షాపింగ్‌ కోసం కాంప్లెక్సు నిర్మించారు. కాలనీలోని ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు పోచారం పేర్కొన్నారు. కాగా తమకూ ఇళ్లు కావాలంటూ మరికొందరు అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top