
ఎల్కతుర్తి సభపై ఫీడ్‌బ్యాక్ పేరిట పలు అంశాల ప్రస్తావన... సభ నిర్వహణ,కేసీఆర్ ప్రసంగాన్ని విశ్లేషిస్తూ సాగిన లేఖ
లేఖ కాదు.. సూచన అంటున్న సన్నిహితులు
సాక్షి, హైదరాబాద్: ఎల్కతుర్తిలో గత నెల 27న జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు వచ్చిన స్పందన, తన తండ్రి కేసీఆర్ ప్రసంగం తీరుతెన్నులను విశ్లేషిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లుగా చెప్తున్న లేఖ పార్టీలో కలకలం రేపుతోంది. అమెరికాలో తన కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లిన కవిత శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
కవిత హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాతే లేఖ అంశంపై స్పందించే అవకాశముంది. అయితే కవిత రాసింది లేఖ కాదని, తన అభిప్రాయాలతో రాసిన నోట్ మాత్రమేనని ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. రజతోత్సవ సభపై కేసీఆర్‌కు ఫీడ్‌బ్యాక్ ఇచ్చేందుకు తయారుచేసుకున్న నోట్స్ బయటకు ఎలా లీక్ అయిందనే కోణంలోనూ చర్చ జరుగుతోంది.
లేఖలో పేర్కొన్న అంశాలు
⇒ ఎల్కతుర్తి సభ పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అందరూ మీ (కేసీఆర్) ప్రసంగం చివరి వరకు ఆసక్తిగా విన్నారు. ఆపరేషన్ కగార్, రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలు, పహల్గామ్ అమరులకు నివాళి, ప్రసంగంలో రేవంత్ పేరును ప్రస్తావించకపోవడం అందరికీ నచ్చాయి.
⇒ తెలంగాణ అంటే బీఆర్‌ఎస్ అనే విషయాన్ని బలంగా చెప్తారని ఆశించారు. ప్రసంగంలో మరింత పంచ్ ఉండాలని నాయకులు, కార్యకర్తలు కోరుకున్నారు. పోలీసులను హెచ్చరించడంపై మంచి స్పందన వచ్చింది. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గీతం మార్చడంపై మీరు స్పందిస్తారని అనుకున్నారు.
⇒ వక్ఫ్ బిల్లు, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడితే బాగుండేది.
⇒ బీజేపీపై మీరు రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలకు తావు ఇచ్చినట్లు అయింది. బీజేపీతో ఇబ్బంది పడిన తాను కూడా ఇదే అంశాన్ని కోరుకున్నా. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌పై నమ్మకం కోల్పోయిన వారు బీజేపీ మనకు ప్రత్యామ్నాయమవుతుందని అనుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేయకపోవడంతో బీజేపీకి మనం సాయం చేశామనే కోణాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది.
⇒ జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా మిమ్మల్ని కలవడం సాధ్యం కావడం లేదనే అభిప్రాయంతో ఉన్నారు. దయచేసి అందరికీ చేరువకండి.