Jr NTR: మా కుటుంబంలో ఇద్దరిని కోల్పోయా

JR NTR Attended As Guest Of Honour For Cyberabad Traffic Police Annual Conference - Sakshi

బయటకు వెళ్లే ముందు కుటుంబసభ్యులను గుర్తు చేసుకోండి

తల్లిదండ్రుల తరహాలోనే పోలీసులనూ గౌరవించాలి

సినీ హీరో నందమూరి తారకరామారావు వెల్లడి

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ వార్షిక సదస్సులో పాల్గొన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : అత్యంత ప్రమాదకర కరోనాకు వ్యాక్సిన్‌ ఉంది.. కానీ, రోడ్డు ప్రమాదాలకు ఎలాంటి టీకా లేదని సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందు ఒకసారి మీ కోసం ఎదురుచూసే భార్య, తల్లిదండ్రులు, పిల్లలను గుర్తుంచుకోవాలని ఎన్టీఆర్‌ సూచించారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌–2021 వార్షిక సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌–బీజాపూర్‌ నేషనల్‌ హైవేపై పెట్రోలింగ్‌ వాహనాలను జెండా ఊపి జూనియర్‌ ఎన్టీఆర్, అదనపు డీజీపీ సందీప్‌ శాండిల్య, సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ప్రారంభించారు. అనంతరం జూనియర్‌ ఎన్టీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. దేవుడు అన్ని చోట్లా ఉండడని, అందుకే తల్లిదండ్రులు ఉన్నారని అన్నారు. అలాగే విద్యనేర్పిన గురువులను, దేశ సరిహద్దుల్లో పహారాకాసే సైనికులను, దేశం లోపల పహారా కాస్తున్న పోలీసుల సేవలను గుర్తించాలన్నారు.

పోలీసుల చేతిలో లాఠీ ఉండేది దండించడానికి కాదని, ప్రజల్ని సన్మార్గంలో పెట్టడానికేనని తెలిపారు. తాను ఈ కార్యక్రమానికి అతిథిగా, నటుడిగా కాకుండా ఇంట్లో ఇద్దరి(జానకిరామ్, హరికృష్ణ)ని కోల్పోయిన కుటుంబీకునిగా వచ్చానన్నారు. వాహనం నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతను గుర్తెరగాలని రాష్ట్ర అదనపు డీజీ(రైల్వేస్, రోడ్‌సేఫ్టీ) సందీప్‌ శాండిల్యా అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సైబరాబాద్‌ పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సైబరాబాద్‌ పరిధిలో రోడ్డు సేఫ్టీ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని సైబరాబాద్‌ సీపీ వి.సి.సజ్జనార్‌ తెలిపారు. ఏడు చోట్ల ఈ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. 10 వేల మందికి హెల్మెట్లు ఇప్పించామని వివరించారు. డీసీపీ విజయకుమార్‌ నాయకత్వంలోని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం పనితీరు ఎంతో బాగుందని ఆయన కితాబిచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ పుస్తకాన్ని, బుక్‌లెట్, లోగోను సందీప్‌శాండిల్యా, సజ్జనార్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సీఎస్‌సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఎదుల, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయకుమార్, విమెన్‌ వింగ్, మాదాపూర్, శంషాబాద్, బాలానగర్‌ డీసీపీలు తదితరులు పాల్గొన్నారు. కాగా, జబర్దస్త్‌ కళాకారులు చేసిన స్కిట్‌ విశేషంగా ఆకట్టుకుంది. 

విజేతలకు పురస్కారాలు.. 
సైబరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం ఇటీవల విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాçసం, చిత్రలేఖనం తదితర పో టీలు నిర్వహించగా విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, నగదు పురస్కారాలను జూనియర్‌ ఎన్టీఆర్, సజ్జనార్, సందీప్‌శాండిల్య అందజేశారు. జీవన్‌దాన్‌ కింద అవయవదానం చేసిన వారి కుటుంబçసభ్యులను ఘనంగా సత్కరించి వారు అందరికీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. 
చదవండి: బర్త్‌డే: మొక్క నాటిన సీఎం కేసీఆర్‌
ఏమ్మా.. ఎలా చదువుతున్నారు! 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top