పెళ్లికి రాలేనే చెల్లీ.. క్షమించవే తల్లీ! | Jobs are being lost due to the extension of the visa stamping interview process | Sakshi
Sakshi News home page

పెళ్లికి రాలేనే చెల్లీ.. క్షమించవే తల్లీ!

Jan 26 2026 3:43 AM | Updated on Jan 26 2026 3:43 AM

Jobs are being lost due to the extension of the visa stamping interview process

కన్నీరుపెట్టిస్తున్న అమెరికా వీసాలు 

అపాయింట్‌మెంట్‌ పొడిగింపుతో అవస్థలు 

తారుమారైన తిరుగు ప్రయాణం వీసాలు 

భారత్‌కొస్తే అమెరికాకు వెళ్లడం కష్టమే... కుటుంబంలో ముఖ్యమైన కార్యాలకూ రాలేని దైన్యస్థితి 

ఆన్‌లైన్‌లో కల్యాణం చూస్తూ కంటతడి... అమ్మ ఆస్పత్రిపాలైనా అనుక్షణం టెన్షనే 

వీసా స్టాంపింగ్‌ ఇంటర్వ్యూ పొడిగింపుతో ఊడిపోతున్న ఉద్యోగాలు 

భారతీయ టెకీల్లో టెన్షన్‌.. విద్యార్థుల్లో వేదన 

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా వీసాలు అలజడి రేపుతున్నాయి. అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. కుటుంబ బాంధవ్యాలకు అడ్డుగోడలయ్యాయి. డిసెంబర్‌ 17 తర్వాత ఉన్న వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లన్నీ అమెరికా వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. అమెరికా వెళ్లే వారే కాదు, భారత్‌కు వచ్చే వారిపైనా ఇది ప్రభావం చూపుతోంది. భారత్‌కు వస్తే తిరిగి అమెరికా గడ్డ తొక్కుతామో? లేదో? అనే గుబులు. 

తిరిగి అమెరికా వెళ్లకపోతే ఉన్న ఉద్యోగం పోతుందనే దిగులు. చెల్లి పెళ్లయినా వచ్చే వీల్లేదు. అమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినా చూసే చాన్సేలేదు. అమెరికా వెళ్లిన ఎవరిని కదిపినా గుండె చెరువవుతోంది. ఒక్కరు కాదు... ఇద్దరు కాదు. దేశవ్యాప్తంగా ఏకంగా 1.8 లక్షల మందిలో ఈ వేదన కన్పిస్తోంది. అర్జెన్సీ ఉందన్నా వినడం లేదు. ఆపద వచ్చిందన్నా కాన్సులేట్‌ పట్టించుకోవట్లేదు.  

సోషల్‌ మీడియాలో తలరాత 
ఏటా దాదాపు 7 లక్షల మంది భారతీయులు విద్య, విజిటింగ్‌ కోసం అమెరికా వెళ్తున్నారు. ఇందులో చదువు కోసం వెళ్లే వారు 3 లక్షల మంది. వీరిలో ఎక్కువ మంది ఎంఎస్‌ పూర్తయిన తర్వాత ఉద్యోగంలో చేరతారు. ఏదో ఒక మార్గంలో హెచ్‌–1బీ వీసా పొందుతారు. డిసెంబర్‌లో అమెరికాకు కీలకం. గడ్డకట్టించే చలి. ఇల్లుదాటడం ఓ యజ్ఞం. ఈ కాలాన్ని అక్కడ వెకేషన్‌గా పరిగణిస్తారు. ఇప్పుడే మనవాళ్లు ఇండియాకు వస్తారు. తిరిగి ఫిబ్రవరిలో అమెరికాకు వెళ్తారు. ఈలోగా వీసా కోసం ప్రయత్నిస్తారు.

ఇన్నాళ్లూ ఇదంతా సాఫీగానే జరిగింది. అమెరికా ఈ మధ్య యూఎస్‌ వచ్చే వాళ్లను సత్యశోధన చేస్తోంది. సామాజిక ఖాతాలను పరిశీలిస్తోంది. అమెరికాకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారా? అమెరికా వ్యతిరేక శక్తులతో సంబంధాలున్నాయా? ఎలాంటి జీవన విధానం అనేది పరిశీలిస్తోంది. అమెరికాకు కొత్తగా వచ్చే వారి ఆర్థిక పరిస్థితినీ శోధిస్తోంది. ఆ తర్వాతే వీసా ఇవ్వాలని కాన్సులేట్‌ నిర్ణయించింది. ఈ కారణంగానే డిసెంబర్‌ 17 తర్వాత వీసా అపాయింట్‌మెంట్లన్నీ రద్దు చేసింది.  

కరుణిస్తే నయం... లేకుంటే అన్యాయం 
అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇండియాకొచ్చిన వారి పరిస్థితి దారుణంగా ఉంది. చెల్లి పెళ్లికో... అమ్మను చూద్దామనో... అయినవాళ్లతో గడుపుదామనో వచ్చిన వాళ్లే వీళ్లంతా. ఫిబ్రవరిలో వెళ్లేందుకు విమానం టికెట్టు కూడా బుక్‌ చేసుకున్నారు. వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ పొడిగించడంతో టెన్షన్‌ మొదలైంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇలాంటి వాళ్లు 38 వేల మంది ఉన్నారు. 

స్వదేశానికి వెళ్లిన టెక్‌ ఉద్యోగులకు కేవలం 40 రోజులపాటు వర్క్‌ ఫ్రం హోం అవకాశం ఇస్తారు. ఆ గడువు దాటితే ఉద్యోగం తీసేస్తున్నారు. ఎన్ని మెయిల్స్‌ పెట్టినా కంపెనీలు పట్టించుకోవడం లేదు. కొన్ని కంపెనీలు మాత్రం కనికరిస్తున్నాయి. తమకు ఉద్యోగితో అర్జెన్సీ వర్క్‌ ఉందని లెటర్లు ఇస్తున్నాయి. 

ఇలాంటి సందర్భాలను అమెరికన్‌ కాన్సులేట్‌ అంగీకరిస్తుంది. అయితే, ఇలాంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇదొక ఎత్తయితే ఉద్యోగుల పిల్లలది మరో సమస్య. ఫిబ్రవరి నుంచి అక్కడ క్లాసులు మొదలవుతాయి. ఆలోగా అమెరికా వెళ్లాలి. లేకుంటే స్కూళ్లల్లో అడ్మిషన్లు రద్దవుతాయి.  

భారత్‌కు వచ్చేదెలా? 
ఇండియాకు రావాలంటే  ముందే వీసా, ఫ్లయిట్‌ టికెట్‌ బుక్‌ చేసుకుంటారు. జనవరిలో రావాలనుకున్న వారు ఇలాగే చేశా రు. ఈలోగానే డిసెంబర్‌ 17 తర్వాత వీసాల అపాయింట్‌మెంట్లన్నీ వాయిదా వేశారు. ఇండియా వెళ్లడం తేలికే అయి నా... తిరిగి రావడానికి వీసా వచ్చే పరిస్థితి లేదు. రూ. లక్షలు అప్పు చేసి వచి్చన వారంతా ఇండియాకు వెళ్లి తిరిగి రాకపోతే ఆర్థికంగా దెబ్బతింటామని ఆందోళన చెందుతున్నారు. 

తమవారికి బాగోలేదని తెలిసినా బాధను దిగమింగుకుంటున్నారు. ఇండియాలో ఉన్న కుటుంబీకులు కూడా యూ ఎస్‌లో ఉన్న పిల్లలకు తమ అనారోగ్యాన్ని చెప్పేందుకు ఇష్టపడటం లేదు. చెల్లి పెళ్లి జరిగినా ఆన్‌లైన్‌లో చూస్తూ తృప్తి పడటం, గుండెలోనే బాధను దాచుకోవడం కన్పిస్తోంది.  

గుండె పిండే ఘటనలివీ.. 
» చైతన్యపురికి చెందిన శశాంక్‌ నాలుగేళ్ల కింద అమెరికా వెళ్లాడు. అక్కడ ఉద్యోగం వచ్చింది. సోదరి పెళ్లి కోసం ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. వీసా అపాయింట్‌మెంట్‌ వాయిదా వేయడంతో యూఎస్‌లో ఉద్యోగం తీసేశారు. ఎన్నిసార్లు లెటర్లు పెట్టినా స్పందించలేదు. దీంతో తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యాడు. అతను ఏమవుతాడోనని తల్లిదండ్రులు గుబులు చెందుతున్నారు. 

»   నల్లగొండకు చెందిన నీలేశ్‌ అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో ఉన్న తల్లిని అతి కష్టం మీద వీడియో కాల్‌లో చూస్తూ గుండెలవిసేలా ఏడ్చాడు. వస్తే అమెరికా తిరిగి వెళ్లడం కష్టం. రాకపోతే కన్నతల్లి రుణం తీర్చుకోలేడు. మిత్రుల సాయంతో డబ్బు పంపి ఆరోగ్య పరిస్థితిని రోజూ పరిశీలిస్తున్నాడు. 

» ఖమ్మంకు చెందిన వరుణ్‌ తనకు ఆరు నెలల క్రితం పుట్టిన చిన్నారిని బంధువులకు చూపిద్దామని వచ్చాడు. వీసా పొడిగింపు నిర్ణయంతో కుదేలయ్యాడు. అత్యవసరంగా కంపెనీకి విషయం చెప్పాడు. అక్కడ్నుంచీ అతని అవసరం ఉందని కంపెనీ లెటర్‌ పంపింది. ఆగమేఘాల మీద అమెరికాకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది.  

»  ఆదిలాబాద్‌కు చెందిన నీరజ్‌ తల్లి ఆఖరి చూపుకోసం కలవరిస్తూ కన్ను మూసింది. ఈ సమయంలో అర్జెంట్‌గా భారత్‌కు వచ్చాడు. తల్లి చివరి కార్యక్రమాలు ముగించుకుని అమెరికా వెళ్లాలనుకున్నాడు. ఈలోగా వీసా సమస్యలో చిక్కుకున్నాడు. సెలవులు ముగియడం, అనుకున్న సమయానికి వెళ్లకపోవడంతో అమెరికా కంపెనీ ఉద్యోగం తీసేస్తున్నట్టు లెటర్‌ ఇచ్చింది. తల్లి లేకపోవడం, ఉద్యోగం పోవడం, అప్పులు వెంటబడటంతో అతను మానసికంగా కుంగిపోయాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement