పనిమంతులకు ‘పండుగే’.. హైదరాబాద్‌, విజయవాడల్లో డిమాండ్‌

Job Opportunities Growing in backdrop of Festive season - Sakshi

వరుస పండుగల నేపథ్యంలో పెరుగుతున్న ‘స్టాఫ్‌’డిమాండ్‌ 

ఈ–కామర్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్స్‌ రంగాల్లో ప్రతి నెలా 5వేల కొత్త ఉద్యోగాలు లభిస్తాయనే అంచనాలు

ట్రైనీలు, ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్‌లు, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ అధికారులకు డిమాండ్‌ 

హైదరాబాద్‌ సహా బెంగళూరు, చెన్నై, ముంబై, మెట్రోనగరాల్లో జాబ్స్‌ జోరు 

ప్రముఖ బిజినెస్‌ సర్వీసెస్‌ ప్రొవైడర్‌ సంస్థ క్వెస్‌ తాజా అధ్యయనంలో వెల్లడి 

► పండుగల సీజన్‌ మొదలై క్రమంగా పుంజుకుంటున్న కొద్దీ వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా వినియోగదారులు ప్రత్యక్షంగా ప్రభావం చూపే ఈ–కామర్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్‌ తదితర రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. 
– లోహిత్‌ భాటియా, ప్రెసిడెంట్‌–వర్క్‌ఫోర్స్‌ మేనేజ్‌మెంట్, క్వెస్‌

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో ప్రారంభం కానున్న పండుగల సీజన్‌ వివిధ రంగాల్లో అవకాశాలకు తలుపులు తెరుస్తూ ఉద్యోగార్థుల్లో నయాజోష్ ను నింపుతోంది. ఈ నెలాఖరులో ‘రక్షాబంధన్‌’తో మొదలై కొత్త ఏడాది, ఆపై కాలం వరకు సుదీర్ఘ ఫెస్టివల్‌ సీజన్‌ జోరు కొనసాగనుంది. ఈ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని... వివిధ వర్గాల వినియోగదారుల పండుగ మూడ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ఇప్పటికే పలు కంపెనీలు, సంస్థలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో వివిధ రంగాల్లో సేవలందించే ఉద్యోగులకు కూడా ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగినట్టుగా పలు అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. 

ఇదీ అధ్యయనం..: రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని గడిచిన ఏప్రిల్‌ నుంచి ఈనెల ఆగస్టు వరకు స్టాఫ్‌ డిమాండ్‌ 23 శాతం పెరిగినట్టుగా ప్రముఖ బిజినెస్‌ సర్వీసెస్‌ ప్రొవైడర్‌ సంస్థ క్వెస్‌ తాజా పరిశీలనలో వెల్లడైంది. ఈ కాలంలోనే 32 వేల ఉద్యోగాలకు డిమాండ్‌ ఏర్పడడంతో పాటు ఏడాది చివర్లో పండుగల సీజన్‌ ముగిసే దాకా ఈ– కామర్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్స్‌ తదితరాల్లో ప్రతీనెల 5 వేల చొప్పున ఉద్యోగాలకు డిమాండ్‌ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, రిటైల్, టెలికం తదితర రంగాలు, విభాగాల్లో అవకాశాలు పెరిగినట్లు ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోంది.

గతేడాది ఏప్రిల్‌–ఆగస్టు మధ్యకాలంతో పోల్చితే ఈ ఏడాది అదే కాలంలో ‘మాన్యుఫాక్చరింగ్, ఇండస్ట్రియల్‌ సెగ్మెంట్‌’లో 245 శాతం మేర వృత్తినిపుణుల డిమాండ్‌ పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది. రిక్రూట్‌మెంట్‌ విషయానికొస్తే...దసరా, దీపావళి పండుగల సందర్భంగా అత్యధికంగా వాహనాల కొనుగోలుకు మొగ్గు నేపథ్యంలో ఆటోమొబైల్‌ పరిశ్రమ ముందంజలో (ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వాహనాల డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా) ఉంది. ఫెస్టివల్‌ సీజన్‌ దృష్ట్యా... బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇండస్ట్రీ (బీఎఫ్‌ఎస్‌ఐ)కి సంబంధించి మ్యాన్‌పవర్‌ కోసం 27 శాతం డిమాండ్, టెలికాం రంగంలో 14 శాతం డిమాండ్‌ పెరిగినట్టు తెలిపింది. 

హైదరాబాద్‌ సహా మెట్రోలు, విజయవాడల్లో డిమాండ్‌ 
ఈ పండుగల సీజన్‌ నేపథ్యంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన వివిధ రకాల సేవలు, నూతన రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునే విషయంలో, తదనుగుణంగా అవసరమైన ‘మ్యాన్‌పవర్‌’అందించడంలో హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నై, ముంబై మెట్రోనగరాలతో పాటు నోయిడా, పుణె నగరాలు అత్యధిక డిమాండ్‌ కలిగి ఉన్నట్టు క్వెస్‌ పరిశీలన వెల్లడించింది. వీటికి ఏమాత్రం వెనకబడకుండా విజయవాడ, కోయంబత్తూరు, జంషెడ్‌పూర్, రాంఛీ వంటి నగరాల్లోని వివిధరంగాలకు చెందిన వర్క్‌ఫోర్స్‌కు మంచి ఉద్యోగ అవకాశాలున్నట్టు తెలిపింది. 

ఏ ఉద్యోగాలకు డిమాండ్‌ అధికం అంటే..  
ప్రొడక్షన్‌ ట్రైనీ, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ ఆఫీసర్, బ్రాంచ్‌ రిలేషన్‌ ఎగ్జిక్యూటివ్, కలెక్షన్‌ ఆఫీసర్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్, బ్రాడ్‌ బ్యాండ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్, వేర్‌హౌస్‌ అసోసియేట్‌ తదితర ఉద్యోగాలకు అధిక డిమాండ్‌ ఏర్పడింది. ఈ–కామర్స్, లాజిస్టిక్స్‌ ఇండస్ట్రీలో దాదాపు మూడులక్షల దాకా ఉద్యోగులకు అవకాశాలు కల్పించే అంచనాలతో ముందువరసలో నిలుస్తోంది. ఇందులో భాగంగానే వేర్‌హౌస్, డెలివరీ ఆపరేషన్స్‌ వంటివి కూడా అంతర్భాగంగా ఉంటాయి. 

పండుగల సీజన్‌ మొదలై క్రమంగా పుంజుకుంటున్న కొద్దీ వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా వినియోగదారులు ప్రత్యక్షంగా ప్రభావం చూపే ఈ–కామర్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్, తదితర రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. 
 –లోహిత్‌ భాటియా, ప్రెసిడెంట్‌–వర్క్‌ఫోర్స్‌ మేనేజ్‌మెంట్, క్వెస్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top