నిర్మల్ జిల్లా: జంట నగరాలుగా పేరొందిన నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తిమ్మాపూర్(తిమ్మబోయి), ఖానాపూర్(ఖానాబోయి) వీడీసీల ఆధ్వ ర్యంలో జేష్టక్క పండుగను ఆదివారం నిర్వహించారు. జేష్టక్క పో.. లచ్చక్క రా.. అని నినదిస్తూ పురుషులు జేష్టాదేవి దిష్టిబొమ్మతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఇళ్లలోని పాత చీపుళ్లు, చేటలు, బూజు కర్రలు, చెప్పులు, పాత గంపలు, పాత దుస్తులతో జేష్టాదేవిని తరిమి కొడుతున్నట్లుగా ఊరేగింపులో పాల్గొన్నారు.
ఊరి పొలిమేర వరకు వెళ్లి దిష్టిబొమ్మలను అక్కడే వదిలేశారు. అనంతరం సమీపంలోని వాగులో స్నానాలు చేసి అక్కడే అందరూ దుస్తులు మార్చుకుని పూజలు చేశారు. లక్ష్మీదేవి తమ గ్రామంలోకి రావాలని ఆహా్వనించారు. అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని మొక్కుకుని ఇళ్లకు వచ్చారు. వీరికి గృహిణులు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ పండుగ అనాది నుంచి వస్తున్న ఆచారంలో భాగమని గ్రామస్తులు తెలిపారు. గతంలో ఐదేళ్లకోసారి నిర్వహించేవారమని, ఈసారి 12 ఏళ్ల తర్వాత నిర్వహించామని పేర్కొన్నారు.


