ఎనిమిది నెలల ఇన్‌స్టా పరిచయం.. కుమార్తె రాసిన మరణ శాసనం! | Jeedimetla 10th Class Anjali Ends Her Mother Life Case Related Full Details Inside | Sakshi
Sakshi News home page

ఎనిమిది నెలల ఇన్‌స్టా పరిచయం.. కుమార్తె రాసిన మరణ శాసనం!

Jun 25 2025 9:34 AM | Updated on Jun 25 2025 10:36 AM

jeedimetla anjali Related Full Details

తమ ప్రేమకు అడ్డుగా ఉందని ఘాతుకం

ఇన్‌స్టాలో పరిచయమైన యువకుడితో కలిసి దారుణం     
    
జీడిమెట్ల పరిధిలో కలకలం రేపిన ఘటన

సాక్షి, జీడిమెట్ల: ‘నువ్వు వచ్చి మా అమ్మను చంపు.. లేదంటే నీ పేరు రాసి నేను ఆత్మహత్య చేసుకుంటా’ నంటూ ప్రియుడిని బెదిరించిన పదో తరగతి బాలిక.. కన్నతల్లినే హత్య చేయించిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం కలకలం రేపింది.

ఇన్‌స్పెక్టర్‌ గడ్డం మల్లేష్‌, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తికి చెందిన సట్ల అంజలి (39)కి 16 ఏళ్ల క్రితం దమ్మన్నపేటకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి కూతురు (15) ఉంది. 13 సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో అంజలి కుప్పంకు చెందిన రవి అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. మనస్విని (12) అనే కూతురు జన్మించింది. రవి సైతం గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అంజలి కొన్నేళ్లుగా తెలంగాణ సాంస్కృతిక సారథి విభాగంలో కళాకారిణిగా పని చేస్తూ.. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మూడు నెలలుగా షాపూర్‌నగర్‌ హెచ్‌ఎంటీ సొసైటీలోని ఓ ఇంట్లో కిరాయికి ఉంటోంది. షాపూర్‌నగర్‌ జెడ్‌పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో పెద్ద కుమార్తె 10వ తరగతి, చిన్న కూతురు 8వ తరగతి చదువుతున్నారు.  

ఇన్‌స్టాలో పరిచయంతో..  
అంజలి పెద్ద కుమార్తె (15)కు నల్లగొండ జిల్లా కట్టంగూర్‌కు చెందిన శివ (18)కు ఇన్‌స్ట్రాగాంలో పరిచయం ప్రేమకు దారితీసింది. 8 నెలలుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పింది. ఇద్దరి సామాజిక వర్గం ఒకటే కావడంతో అంజలి తొలుత అంగీకరించి.. ఆ తర్వాత వద్దని వారించింది. తమ ప్రేమకు తల్లి ఒప్పుకోకపోవడంతో బాలిక ఈ నెల 19న శివతో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. అదేరోజు అంజలి తన కూతురు కనిపించడం లేదంటూ శివపై అనుమానం వ్యక్తం చేస్తూ జీడిమెట్ల పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పోలీసులు అమ్మాయిని తీసుకుని స్టేషన్‌కు రావాలని చెప్పడంతో ఈ నెల 21న శివతో పాటు బాలిక పీఎస్‌కు వచ్చారు. బాలికను తల్లితో ఇంటికి పంపించారు. 

ప్రేమను నిరాకరించిందని.. 
ఇంటికి వెళ్లిన తర్వాత శివను వదిలేసి చదువుపై దృష్టి పెట్టాలని కూతురును అంజలి బెదిరించింది. శివపై కేసు పెట్టించి జైలుకు పంపిస్తానంటూ కొట్టింది.  తమ ప్రేమకు అడ్డొస్తోందనే కసితో తల్లిపై కోపం పెంచుకున్న బాలిక ఆమెను చంపాలని గట్టిగా నిర్ణయించుకుంది. తాను అనుకున్నట్లుగానే తన తల్లిని హైదరాబాద్‌ వచ్చి చంపాలని శివను కోరింది. చంపకపోతే నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని శివను బెదిరించింది. దీంతో యువకుడు ఒప్పుకోవడంతో.. బాలిక తన చెల్లెలిని మరో ఇంటికి పంపించింది.

సోమవారం  సాయంత్రం 5 గంటలకు శివ, తన తమ్ముడిని (16) తీసుకుని షాపూర్‌నగర్‌ వచ్చాడు. వచ్చీ రావడంతోనే కురీ్చలో కూర్చున్న అంజలిని ఒక్కసారిగా తోయడంతో ఆమె ముందుకు పడి తలకు గాయమైంది. వెంటనే అంజలి మెడకు గట్టిగా చున్నీ బిగించడంతో ఆమె కొట్టుకోసాగింది. శివ సోదరుడు అంజలి చేతులు పట్టుకోగా శివ చున్నీతో మెడకు గట్టిగా అదిమి పట్టుకున్నాడు. అంజలి ముక్కులోంచి తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయిందని నిర్ధారించుకున్నారు. తన తల్లి కిందపడి తలకు దెబ్బతగలంతో చనిపోయిందని అందరినీ నమ్మించాలని బాలిక పథకం పన్ని, శివను, అతని సోదరుడిని పంపించేసింది.   



బతికే ఉందని.. మళ్లీ రప్పించి..  
కొద్దిసేపటి తర్వాత అంజలి మెల్లగా కదలసాగింది. అప్పటికే చిన్న కుమార్తె మనస్విని ఇంటికి రాగా.. అమ్మ ఇంట్లోకి రావొద్దని చెప్పిందంటూ సోదరిని బాలిక బయటే కూర్చోబెట్టింది. 108కు కాల్‌ చేసినట్లు నటిస్తూ విషయాన్ని ప్రియుడు శివతో మాట్లాడింది. తన తల్లి ఇంకా బతికే ఉందని చెప్పింది.  నల్లగొండ వెళ్లేందుకు ఎల్‌బీనగర్‌లో ఉన్న శివ మళ్లీ తన సోదరుడిని తీసుకుని రాత్రి 7.30 గంటలకు షాపూర్‌నగర్‌ వచ్చాడు. ‘ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. నిన్ను కాపాడతాను ఆంటీ’ బాలిక మనస్విని ముందు నటించాడు. వేరే ఆంటీని పిలుచుకు రావాలంటూ ఆమెను ఇంట్లోంచి పంపించారు. తిరిగి అంజలి మెడకు చున్నీ బిగించారు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.

రాత్రి 10 గంటలకు తన తల్లి చనిపోయిందని పెద్ద కుమార్తె బంధువులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించింది. రాత్రి 11 గంటల తర్వాత జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్‌కు విషయం తెలిసింది. ఈ నెల 19న బాలిక అదృశ్యమైన కేసు జీడిమెట్లలో నమోదు కావడంతో ఇది కచి్చతంగా హత్యేనని నిర్ధారణకు వచ్చారు. వెంటనే రెండు బృందాలను రంగంలోకి దింపి శివను కట్టంగూరులో అదుపులోకి తీసుకున్నారు. అతడి సోదరుడి(15)ని హైదరాబాద్‌ సంతోష్‌ నగర్‌లోని ఓ చికెన్‌ సెంటర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులను విచారణ చేయగా.. అంజలిని తామే చంపివేశామని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. తన తల్లిని పూర్తిగా చంపే వరకు ఇంటి బయటే కాపలా కాసిందని, తల్లి మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా ‘క్షమించు మమీ’ అంటూ నిందితురాలు బాలిక రోదించిందని స్థానికులు తెలిపారు. అంజలి మృతదేహాన్ని స్వగ్రామమైన మహబూబాబాద్‌ జిల్లాలోని ఇనుగుర్తికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.

అంజలి చాకలి ఐలమ్మ మునిమనవరాలు కాదు.. 
మృతురాలు అంజలి చాకలి ఐలమ్మకు దూరపు బంధువే తప్పా మునిమనవరాలు కాదని కుటుంబ సబ్యులు తెలిపారు. దీనిపై మీడియాలో వార్తలు నిజం కావన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement