23 నుంచి జేఈఈ మెయిన్‌

JEE Main Exams Dates Changed Starts From June 23rd - Sakshi

పరీక్ష తేదీల్లో మార్పు.. 29 వరకు తొలివిడత

300 మార్కులకే ప్రశ్నపత్రం..15 ప్రశ్నలు చాయిస్‌

ఈసారి రెండు సెక్షన్లలోనూ నెగెటివ్‌ మార్కింగ్‌

మళ్ళీ తెరపైకి టై బ్రేకర్‌ విధానం

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి మొదటి దశలో నిర్వహించే జేఈఈ మెయిన్‌ పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 20 నుంచి మొదలవ్వాల్సిన పరీక్షను 23కు మార్చారు. తొలి విడత పరీక్షలు ఈ నెల 29 వరకూ జరుగుతాయి. ఆడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ ప్రక్రియను శనివారం నుంచే అనుమతించినట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తెలిపింది. పూర్తిగా ఆన్‌లైన్‌ మోడ్‌లో దేశవ్యాప్తంగా 501 ప్రాంతాల్లో మెయిన్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎవరెవరికి ఎక్కడ పరీక్ష అనే విషయాన్ని జేఈఈ మెయిన్‌ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని ఎన్‌టీఏ పేర్కొంది. పరీక్ష రాసే పట్టణం పేరు మాత్రమే వెబ్‌సైట్‌లో ఉంటుందని, పరీక్ష కేంద్రం ఎక్కడనేది హాల్‌ టిక్కెట్‌లో ఇస్తామని తెలిపింది. 

పరీక్షలోనూ మార్పులు
రెండేళ్ళ కోవిడ్‌ తర్వాత నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ ఈసారి కొంత కఠినంగా ఉండే అవకాశం కన్పిస్తోంది. పరీక్ష విధానంలో మార్పులే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. గత రెండేళ్ళుగా సెక్షన్‌–ఏలో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండేది. ఇప్పుడు దీన్ని సెక్షన్‌–బీలో కూడా పెడుతున్నారు. ఈ విభాగంలో ఇచ్చే న్యూమరికల్‌ ప్రశ్నలకు దీన్ని పెట్టడం వల్ల విద్యార్థులు ఆచితూచి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నపత్రం మొత్తం 20 మార్కులకు ఉంటుంది. ఇదిలా ఉండగా, గతంలో మొత్తం 90 (ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు) ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. దీంతో మొత్తం మార్కుల సంఖ్య 360గా ఉండేది. ఇప్పుడు 90 ప్రశ్నల్లో 75కే జవాబు ఇవ్వాలి. మిగతా 15 చాయిస్‌గా తీసుకోవచ్చు. దీంతో ప్రశ్నపత్రం 300 మార్కులకే ఉండనుంది.

సమాన మార్కులు వస్తే టై బ్రేకర్‌ విధానం
2021లో రద్దు చేసిన టై బ్రేకర్‌ విధానాన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ మళ్ళీ తెరమీదకు తెచ్చింది. ర్యాంకుల్లో సమానమైన స్కోర్‌ సాధించినప్పుడు వయసును కూడా ప్రామాణికంగా తీసుకోవడం ఈ విధానంలో ప్రత్యేకత. ఇద్దరు విద్యార్థులు పరీక్షలో సమానమైన మార్కులు సాధిస్తే ముందుగా గణితం, ఫిజిక్స్, కెమెస్ట్రీల మార్కులను పరిగణనలోనికి తీసుకుంటారు.

ఆ తర్వాత తప్పు సమాధానాల నిష్పత్తిని సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తారు. అప్పటికీ సమాన స్థాయిలో మార్కులు ఉంటే వయసును పరిగణనలోనికి తీసుకుంటారు. అప్పుడు కూడా ఇద్దరూ సమానంగా ఉంటే, ముందు ఎవరు దరఖాస్తు చేశారో చూసి ర్యాంకులు నిర్ధారిస్తారు. జేఈఈ మెయిన్స్‌ పరీక్ష మొదటి విడత ఈ నెల 23 నుంచి 29 వరకూ , ఆ తర్వాత జూలై 21 నుంచి 30 వరకూ రెండో విడత జరుగుతుంది. కోవిడ్‌ సమయంలో నాలుగు విడతల పరీక్ష విధానాన్ని రెండు విడతలుగా మార్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది ఈ పరీక్ష రాస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top