
కేంద్ర విద్యాశాఖకు రాష్ట్రాల సూచన
ప్రస్తుత విధానం విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని ఆందోళన
అడ్వాన్స్‌డ్ మరీ కఠినంగా ఉంటోందని వెల్లడి
ప్రశ్నలు సరళంగా ఉండాలని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) సిలబస్‌లో మార్పులు తేవాలని కేంద్ర విద్యా శాఖకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏటా చేపట్టే ఈ పరీక్ష విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నాయి. పరీక్షా విధానం విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీకి దారితీస్తోందని తెలిపాయి. అనేక మంది కుంగు బాటుకు లోనవుతున్నారని స్పష్టం చేశాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఇంటర్ వరకూ బట్టీ విధానంలో బోధన జరుగుతోందని, విద్యార్థులకు 90% పైగానే మార్కులు వస్తున్నాయని పలు రాష్ట్రాలు తెలిపాయి.
అయినప్పటికీ జేఈ ఈలో చాలామంది అర్హత సాధించలేని పరిస్థితి ఏర్పడిందని కేంద్రం దృష్టికి తెచ్చాయి. ఎన్‌టీఏ పరీక్షకు, అకడమిక్ విద్యకు పొంతన లేని విధంగా ఉందని తెలిపాయి. ఇది పూర్తిగా కార్పొరేట్ విద్యా సంస్థల ఆధిపత్యానికి, ఫీజులు దండుకోవడానికి దారితీస్తోందనే అభిప్రాయం వ్యక్తం చేశాయి. జేఈఈ నిర్వహణపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మార్పులకు అవసరమైన సూచనలు ఇవ్వాలని కేంద్రం కోరిన నేపథ్యంలో.. రాష్ట్రాల నుంచి తాజాగా ప్రతిపాదనలు వచ్చాయి.
ఇలా అయితే కష్టం: ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థుల్లో చాలా మంది జేఈఈ ర్యాంకుల్లో వెనుకబడుతున్నారు. సరైన అధ్యాపకులు లేకపోవడం, మౌలిక వసతులు ఉండని పరిస్థితి కాలేజీల్లో నెలకొంది. దీంతో ప్రైవేటు కాలేజీలకు వెళ్తేనే ర్యాంకులొస్తాయనే ఆలోచనల్లోకి విద్యార్థులు వెళ్తున్నారు. ఫలితంగా గత కొన్నేళ్ళుగా జేఈఈ పరీక్షను సీరియస్‌గా రాసే వారి సంఖ్య తగ్గుతోంది. గతంలో 16 లక్షల మంది దరఖాస్తు చేస్తే, 15.9 లక్షల మంది పరీక్ష రాసేవారు. మూడేళ్ళుగా 12 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నా, పరీక్ష రాసేవారి సంఖ్య 11 లక్షలకు మించడం లేదు. ప్రశ్నలు తికమకగా ఉంటున్నాయని, సుదీర్ఘంగా ఇస్తున్నారనే అభిప్రాయం విద్యార్థుల నుంచి వ్యక్తమవుతోంది. అడ్వాన్స్‌డ్ సాధించాలంటే తీవ్ర స్థాయిలో కసరత్తు చేయాల్సి వస్తోంది. ఈ దిశగా కాలేజీలు విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయని, ఐఐటీల్లో సీట్లు వచ్చినా విద్యార్థులు కుంగుబాటుకు గురవుతున్నారని రాష్ట్రాలు తెలిపాయి.
సబ్జెక్టుల ప్రశ్నల్లో మార్పులు చేయాలి
ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్‌లో కొన్ని చాప్టర్ల నుంచి ఇచ్చే ప్రశ్నలను సరళతరం చేయాలని రాష్ట్రాలు కేంద్రానికి సూచించాయి. కేంద్ర, రాష్ట్ర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు తేలికగా అర్థం చేసుకుని, సులభంగా జవాబు ఇచ్చేలా ప్రశ్నలు ఉండాలని తెలిపాయి. మోడ్రన్ ఫిజిక్స్‌లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, డీ బ్రోగ్లై వేవ్‌లెంత్, అటమిక్ మోడల్స్‌ను మార్చాలని సూచించాయి. ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమెట్స్‌ను సరళతరం చేయాలని పేర్కొన్నాయి.
ఫిజికల్ కెమెస్ట్రీలో ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ నైటిక్స్, థర్మోడైనమిక్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కో–ఆర్డినేషన్ కాంపౌండ్స్, పిరియాడిక్ ప్రాపర్టీస్ నుంచి సరళంగా ప్రశ్నలివ్వాలని సూచించాయి. ఆర్గానిక్ కెమెస్ట్రీలో రియాక్షన్ మెకానిజం, నేమ్ రియాక్షన్, స్టీరియో కెమిస్ట్రీ చాప్టర్లలో ప్రశ్నలను పరిశీలించాలని తెలిపాయి. మేథ్స్‌కు సంబంధించి కూడా ప్రశ్నలు విద్యార్థులు తేలికగా రాయగలిగేలా ఉండాలని రాష్ట్రాలు కోరాయి.