
చుట్టూ దారుణమైన ఆర్థిక పరిస్థితి..అయినా బాగా చదవాలన్న గట్టి లక్ష్యం. పోనీ ఇంత కష్టపడుతుంటే..వచ్చిపడే కష్టాల కెరటాలు వెరసీ విరుచకుపడ్డ అనారోగ్యం ఇవేమి ఆ వ్యక్తి విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. సాధించాలేవ్ అంటూ పదేపదే అతడి గమ్యాన్ని చేరనివ్వకుండా చేస్తున్న సమస్యలకు తన గెలుపుతో గట్టి సమాధానం చెప్పాడు. ల్యాప్‌టాప్ వంటి సకల సౌకర్యాలు గానీ, ఆర్థికంగా భరోసా వంటివి ఏమి లేకపోయినా..అజేయంగా విజయతీరాలకు చేరుకోవచ్చు అని చూపించి స్ఫూర్తిగా నిలిచాడు.
అతడే 19 ఏళ్ల హర్ష గుప్తా. మహారాష్ట్రలోని థానే జిల్లాకి నివాసి. అతడి తల్లిదండ్రుల జీవనాధారం పానీపూరీ బండి ఒక్కటే. వారే సంతోష్, రీతా దంపతులు. వారికి ముగ్గురు అబ్బాయిలు. ఆ ముగ్గురిలో పెద్దవాడే ఈ హర్ష్ గుప్లా. హర్ష తండ్రి పదికూడా పాసవ్వలేదు. అందువల్లే ఆయన తన పిల్లలు ఉన్నత విద్యావంతులు కావాలని చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివించాడు. అయితే వారికి వచ్చే ఆదాయానికి పిల్లల చదువుకి అయ్యే ఖర్చుకి పొంతన లేకపోవడంతో విపరీతమైన ఆర్థిక కష్టాలు మధ్య బతుకు సాగించేవారు.
అయితే హర్ష చిన్నప్పటి నుంచి ప్రతిభావంతుడు. పదిలో 90.8 శాతం మార్కలతో పాసయ్యాడు. అయితే ఇంటర్‌కి వచ్చేటప్పటికీ రెక్టల్ ప్రోలాప్స్ అనే అరుదైన అనారోగ్య సమస్య బారినపడ్డాడు. దాంతో తరగతులకు సరిగా హాజరుకాలేకపోయాడు. ఫలితంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిలయ్యాడు. పైగా చుట్టూ ఉన్న స్నేహితులు నీలాంటి వ్యక్తులు ఐఐటీ వంటి చదువులు అందుకోవడం కష్టం అని ముఖంపైనే చెప్పేసేవారు.
అయినా సరే ఎందుకో హర్షకి తనకిది సాధ్యమే అని గెలిచి చూపించాలనే కోరిక బలంగా ఉండేది. అయితే అది ఎలా అనేది అగమ్యగోచరంగా ఉండేది. ఎలాగైతేనేం ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పూర్తిచేసి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌కి సన్నద్ధమయ్యాడు. అందుకోసం నితిన్ విజయ్, మోషన్ ఎడ్యుకేషన్, కోట ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలనుకున్నాడు. అందుకు అవసరమయ్యే డబ్బులకు కొందరు దాతలు సాయం చేయడంతో ఆ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాడు.
అయితే ఎక్కడ ఉండాలన్నది మరో సమస్య. పోనీ పీజీ హాస్టల్ జాయిన్ అవుదామన్నా.. సరిపడా డబ్బులేదు. చివరికి హర్ష ఆ హాస్టల్ యజమానిని బతిమాలుకుని తక్కుడ డబ్బు చెల్లించేలా వసతి ఏర్పరుచుకున్నాడు. ఇన్ని కష్టాలు దాటుకుని జేఈఈకి సిద్ధమవుతుండగా..మరోవైపు అనారోగ్యం తిరగబెట్టింది. దాంతో హాస్టల్ ఖాళీ చేసి తిరిగి ఇంటికి వచ్చేసే పరిస్థితి ఎదురైంది. దాంతో చాలా క్లాస్‌లు మిస్సవ్వడం, మాక్‌టెస్ట్‌ల్లో వెనకబడటం జరిగింది.
ఇక లక్ష్యం తనకు చాలా దూరమైపోతోందని, ఆ ఇన్‌స్టిట్యూట్ హెడ్‌తో తన సమస్య వివరించగా..తన అనారోగ్యానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ ప్లాన్ చేయడం గురించి సూచనలిచ్చారు. అలా తొలి ప్రయత్నంలో జేఈఈ మెయిన్స్‌లో 98.59 శాతం సాధించాడు. అయితే అతడి అనారోగ్య దృష్ట్యా తగినంత విశ్రాంతి తప్పని పరిస్థితి దృష్ట్యా జేఈఈ అడ్వాన్స్‌కి పూర్తి స్థాయిలో దృష్టి సారించడం సాధ్యపడలేదు. ఫలితంగా జేఈఈ అడ్వాన్స్‌కి అర్హత సాధించలేకపోయాడు.
అయితే హర్షకి ఎన్‌ఐటీ వంటి వాటిల్లో ఆఫర్ వచ్చినా కాదనుకుని ఐఐటీ జాయిన్ అవ్వడమే తన ధ్యేయమని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యిపోయాడు. అందువల్లే ఓటమి నైరాస్యం కుంగదీస్తున్నా.. తగ్గేదే లే అంటూ.. మళ్లీ మరోసారి జేఈఈకి ప్రిపరయ్యేందుకు సిద్ధమయ్యాడు. అందుకు తల్లిదండ్రలు మద్దతు అందించారు. ఈసారి తన ఇంటర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా కోచింగ్ ఫీజ కవర్ అయ్యేలా స్కాలర్‌షిప్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించి మరి ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకున్నాడు.
బాగా ప్రిపేరయ్యేలా మంచి హాస్టల్‌లో జాయిన్ అయ్యాడు. అయితే ఈసారి ఓన్లీ ప్రిపరేషన్ కాకుండా మానస వికాసం పొందేలా పుస్తకాలు, మంచి సినిమాలు చూస్తూ ప్రిపరేషన్ సాగించాడు. అలా JEE మెయిన్స్ 2025లో 98.94 శాతం సాధించి టాప్ 10 ర్యాంకులో చోటు దక్కించుకున్నాడు. చివరికి తాను అనుకున్నట్లుగానే ఐఐటీ రూర్కీలో సీటు సంపాదించాడు.
నేర్చుకున్న జీవిత పాఠాలు..
చదువుకి అవసరమయ్యే నిధుల కోసం దాతలు ముందుకు వచ్చినప్పుడు కలిగిన సంతోషం తనలాంటి వాళ్ల కోసం ఏదైనా చేయాలనే ఆలోచన కలిగేలా ప్రేరేపించిందని అంటున్నాడు హర్ష్ గుప్తా
అనారోగ్యంతో హాస్టల్ వదిలి ఇంటికి బాధగా వస్తుండగా ఫోన్ స్క్రీన్ పగిలిపోయింది. దాంతో స్టేషన్ నుంచి ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతుంటే ఓ వృద్ధ దంపుతులు తన కోసం క్యాబ్ బుక్‌చేసి డ్రాప్ చేసిన ఘటన మరువలేనని చెబుతున్నాడు. నిజానికి ఆ దపంతులు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కానీ సాటి మనిషి పట్ల దయ చూపడం అంటే ఏంటో అప్పుడే తెలుసుకున్నానని చెబుతున్నాడు.
అలాగే నేనే ఎదుర్కొన్న ఓటములు, అడ్డంకులు..సమస్యలను ప్రతిబంధకంగా చూడకుండా పరిష్కారం అన్వేషించాలి. ఒకవేళ పరిష్కారం తెలియకపోతే ఒత్తిడికి గురికాకుడదు మార్గదర్శకులను అన్వేషించాలి. అంతే తప్ప ఇంతే అని ఆగిపోకూడదు అని తాను తెలుసుకున్న జీవిత సత్యం అని చెబుతున్నాడు.
అలాగే చుట్టూ ఉన్న సమాజం, మన స్నేహతులు మనల్ని తక్కువ అంచనా వేయొచ్చు, విమర్శించొచ్చు..కానీ అవేమి తీసుకోకుండా నీ లక్ష్యం వైపు సాగిపోవడం తెలిస్తే గెలుపుని అందుకోవడం చాలా ఈజీ అని చెబుతున్నాడు హర్ష్ గుప్తా.
(చదవండి: 'డిటెక్టివ్'.. బీ సెలెక్టివ్..!)