
ఒకప్పుడు సినిమాల్లో చాలా బాగా, బలంగా కనిపించిన డిటెక్టివ్ పాత్రలు.. ప్రస్తుతం తెరపై పెద్దగా కనిపించకపోవచ్చు.. కానీ ఆధునికుల నిజ జీవితంలో మాత్రం కీలకంగా మారాయి. వివాహ పూర్వపు దర్యాప్తుల నుంచి కార్పొరేట్ ఫ్రాడ్స్ వరకూ.. ఎన్నో రంగాల్లో వీరి కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ప్రేమ, పెళ్లి, లివిన్ మొదలు ప్రతిదానికీ వీరిపై ఆధారపడుతున్నారు కొందరు.. అయితే అలాంటి ఏజెన్సీలను ఎన్నుకునే క్రమంలో తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు..
దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఆర్థిక సంస్కరణల ఫలితంగా పలు ప్రైవేటు రంగాలు పుంజుకున్నాయి. దీంతోపాటు వ్యక్తిగత గోప్యత, భద్రత, సత్వర న్యాయం కోసం స్వతంత్ర విచారణలు అవసరమయ్యాయి. అయితే అప్పటికే ముంబయి వంటి నగరాల్లో ఉన్నప్పటికీ.. ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఒక్కసారిగా డిటెక్టివ్ ఏజెన్సీలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం మన నగరంలోనే దాదాపు 30కి పైగా ప్రైవేటు విచారణ సంస్థలు సేవలందిస్తున్నాయి.
పెళ్లికి ముందు.. పరిశోధన..
ఇటీవలి కాలంలో పెళ్లిళ్లలో మోసాలు పెరిగిపోయాయి. దీంతో పాత సంబంధాల సమాచారం దాచిపెట్టడం వంటివి తెచ్చిపెట్టే సమస్యల పరిష్కారంగా డిటెక్టివ్ సేవలు బాగా అవసరం అవుతున్నాయి. కొన్ని మ్యాట్రిమోని సంస్థలు సైతం దీని కోసం డిటెక్టివ్స్‌ను ఆశ్రయిస్తున్నాయి.
పెళ్లి తర్వాత భార్యాభర్తలు పరస్పరం అనుమానాలతో ఈ సంస్థల సేవల్ని కోరుకుంటున్నారు. నగరంలో ఇటీవలి కాలంలో విడాకుల సంఖ్య విపరీతంగా పెరగడానికి ఇలాంటి స్వతంత్ర విచారణలు కూడా ఓ కారణమేనని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సదరు సంస్థలు చేసిన విచారణలో లోపం కారణంగా అందిన నివేదికలతో అనేకమంది విడిపోతున్నారని చెబుతున్నాయి అధ్యయనాలు.
ప్రేమలు, లివిన్‌లలోనూ..
ఇక ప్రేమికులు కూడా ఈ విషయంలో తక్కువ తినలేదు. ‘పారీ్టలు, పిక్నిక్‌లు, కొలీగ్స్‌తో చనువుగా ఉండడం వంటి వన్నీ ప్రస్తుతం తప్పని అవసరం. అయితే ఇవే అనుమానాలకూ దోహదం చేస్తున్నాయి. తమ లవర్స్ మీద అనుమానాలతో మమ్మల్ని నెలకు కనీసం 25 మందైనా సంప్రదిస్తుంటారు’ అంటూ నగరంలో పేరున్న ఓ డిటెక్టివ్ సంస్థ ప్రతినిధి చెప్పారు. ప్రేమికులు కేవలం కబుర్లు, షికార్లతో కాలక్షేపం చేసే కాలం పోయి ఏకంగా లివిన్ రిలేషన్ షిప్స్‌లో ఉండడం సర్వసాధారణం అయ్యింది. ఇలాంటి ట్రెండ్ ఈ పరిస్థితికి దారి తీస్తోందని ఫ్యామిలీ కౌన్సిలర్ సుజాత అంటున్నారు.
డివోర్స్‌కు ఫోర్స్..
‘వివాహేతర సంబంధం కారణంగా విడాకులు ఇవ్వాలంటే మమ్మల్ని కలవాలి. ఆ తర్వాత విడాకులు ఇచి్చన మహిళకు ఆదాయం ఉందని భరణం ఇవ్వనక్కర్లేదని నిరూపించాల్సినప్పుడు కూడా మమ్మల్నే కలవాలి’ అంటూ చెప్పారు నగరంలోని లక్డీకాపూల్‌లో డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్న ఓ మహిళ. గతంలో ఈ తరహాలో తమ భార్య/భర్తల నేరాన్వేషణ సంపన్న కుటుంబాల్లోనే ఎక్కువ ఉండేదని, అయితే ప్రస్తుతం దాదాపుగా అన్ని రకాల ఆదాయవర్గాల్లోనూ కనిపిస్తోందని అన్నారామె.
కార్పొరేట్ వెరిఫికేషన్ కోసం..
కార్పొరేట్ రంగంలో అవినీతి కార్యకలాపాలను గుర్తించేందుకు కూడా డిటెక్టివ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఉద్యోగుల నియామకాల కోసం చేసే బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్ నుంచి ఉద్యోగుల వర్గీకరణ, ఇంటర్నల్ లీకులు, మేనేజ్‌మెంట్ లెవెల్ మోసాల నిర్ధారణకు సంస్థలు ఈ సేవలను వినియోగిస్తున్నాయి.
ఎస్సెట్ ట్రేసింగ్, ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ వంటివి వీరు చేస్తున్నారు. అంతే కాకుండా లోన్ రికవరీ/విత్‌హోల్డింగ్ కేసుల్లో ఆస్తుల వివరాల కోసం పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా జై డిటెక్టివ్ అంటున్నారు.
ఈజీ..టెక్నాలజీ..
ప్రస్తుతం డిటెక్టివ్ సేవల్లో టెక్నాలజీ కీలక భూమిక పోషిస్తోంది. వాహనాల పర్యవేక్షణ, వ్యక్తుల స్థల నిర్ధారణకు ఆధునిక పరికరాల సహాయంతో ట్రాకింగ్ సులభంగా మారింది. అలాగే సర్వైలెన్స్, డేటా అనాలసిస్ మరింత ప్రభావవంతంగా మారాయి.
సోషల్ మీడియా మానిటరింగ్, డిజిటల్ ట్రెయిల్స్ ఆధారంగా వివరాల సేకరణ, ప్రత్యక్ష సాక్ష్యాల కోసం సీక్రెట్ కెమెరాలు, ఆడియో రికార్డర్లు ఉపకరిస్తున్నాయి. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, బ్యాంక్ లావాదేవీలను విశ్లేషించేందుకు డేటా అనలిటిక్స్, అనుమతి మేరకు హ్యాకింగ్, బగ్ డిటెక్షన్, మొబైల్ ట్రాకింగ్ వంటివీ చేస్తున్నారు.
వ్యవస్థాపకులు వీరే..
చాలా వరకూ ఈ తరహా ఏజెన్సీల స్థాపకులు మాజీ భద్రతా విభాగాలకు చెందినవారే కావడం గమనార్హం. రిటైర్డ్ పోలీస్ అధికారులు, సైనిక లేదా నిఘా విభాగాల మాజీ ఉద్యోగులు, లాయర్లు, క్రిమినాలాజీ విద్యార్థులు ఈ సంస్థల స్థాపన, నిర్వహణల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు.
వీరికి న్యాయపరమైన అవగాహన, విచారణ పద్ధతులపై ట్రైనింగ్ ఉండటం కలిసొచ్చే అంశం. ప్రస్తుతం నగరంలో షార్ప్ డిటెక్టివ్, హైదరాబాద్ డిటెక్టివ్ ప్రై లిమిటెడ్, డీడీఎస్ డిటెక్టివ్, థర్డ్ ఐ ఇన్వెస్టిగేషన్స్, పారామౌంట్, లింక్స్, యారో, రియల్ ఐ, తదితర ఏజెన్సీలు పనిచేస్తున్నాయి.
తస్మాత్ జాగ్రత్త..
ఇలాంటి డిటెక్టివ్ ఏజెన్సీల సంస్థల్ని సేవల కోసం ఆశ్రయించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కార్పొరేట్ సంస్థలు, న్యాయవాదులు, బ్యాంకులు వంటి ఆర్గనైజ్డ్ వ్యవస్థలకు ఫర్వాలేదు కానీ.. వ్యక్తిగత అవసరాలకు సంప్రదించేటప్పుడు ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత రహస్యాలను సేకరించిన అనంతరం బ్లాక్‌మెయిల్ చేసిన సందర్భాలూ నగరంలో లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.