మొదటి సెషన్ ఎంట్రన్స్ షెడ్యూల్ విడుదల చేసిన ఎన్‌టీఏ
ఈ నెల 27 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం
ఫిబ్రవరి 12న ఫలితాల విడుదలకు ప్రాథమిక తేదీ ఖరారు
సాక్షి, హైదరాబాద్: కేంద్రీయ విద్యాసంస్థల్లోని యూజీ కోర్సుల్లో 2026–27 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ (మెయిన్–2026 షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శనివారం విడుదల చేసింది. మొదటి సెషన్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 మధ్య నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు జేఈఈ మెయిన్‌లో సాధించే పర్సంటైల్ కీలకం. విద్యార్థుల సౌకర్యార్థం జేఈఈ మెయిన్‌ను ఏటా రెండు సేషన్లలో నిర్వహిస్తున్నారు.
ఈ పరీక్షలకు హాజరు కావాలనుకున్న విద్యార్థులు ఈ నెల 27న రాత్రి 9 గంటలకల్లా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని అదేరోజు రాత్రి 11:50 గంటల్లోగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని పేర్కొంది. ఏయే నగరాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించేదీ జనవరి మొదటి వారంలో ప్రకటిస్తామని ఎన్‌టీఏ తెలిపింది. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ వివరాలను వెబ్‌సైట్ ద్వారా తెలియజేయనుంది. మొదటి సెషన్ జేఈఈ మెయిన్ ఫలితాలను ఫిబ్రవరి 12న విడుదల చేస్తామని ఎన్‌టీఏ ప్రాథమిక తేదీని ఖరారు చేసింది.
13 భాషల్లో పరీక్ష...: జేఈఈ మెయిన్ పరీక్షలను 13 భాషల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఆంగ్లంతోపాటు హిందీ, తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతి, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ భాషల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. మొదటి సెషన్‌లో పరీక్షలు రాసిన విద్యార్థులు రెండో సెషన్ పరీక్షలు కూడా రాసే అవకాశం ఉంటుంది. తొలి సెషన్ దరఖాస్తు ఆధారంగా ఫీజు చెల్లించి రెండో సెషన్ పరీక్షలు కూడా రాయొచ్చు. రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. జేఈఈ మెయిన్ సిలబస్‌ను ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.


