ఆలస్యం కానున్న ‘జేఈఈ’.. కారణం అదేనా!

Jee Entrance Exam May Be Delay Due To Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ–2022 షెడ్యూల్‌ ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్‌లో మార్పులు చేయాలని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. దీనికి తోడు కరోనా కేసులు పెరుగుతుండటాన్ని కూడా పరిగణలోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌¯ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష.. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

సాధారణంగా ఈ సమయానికే షెడ్యూల్‌ ప్రకటించి, ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్స్‌ తొలి దశ పరీక్ష నిర్వహించాలి. కానీ, ఇప్పటికీ షెడ్యూల్‌ ప్రకటించకపోవడంతో జేఈఈ ప్రక్రియ పూర్తవడానికి వచ్చే ఏడాది చివరి వరకూ పట్టొచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జేఈఈ మెయిన్‌–22ను ఎప్పుడు నిర్వహిస్తారు? ఎన్ని దశల్లో పరీక్షలుంటాయి? పరీక్ష విధానంలో మార్పులేమైనా ఉంటాయా? అనే సందేహాలు విద్యార్థుల్లో తలెత్తుతున్నాయి.

రెండేళ్లుగా ఆలస్యం...
  ►2019 జేఈఈ షెడ్యూల్‌ను 2018, జూలై 7న ప్రకటించారు. 2019 జనవరి, ఏప్రిల్‌లో రెండు దశల్లో పరీక్ష నిర్వహించారు. 
  ►  2020 పరీక్షల షెడ్యూల్‌ను 2019, ఆగస్టు 28న ప్రకటించారు. 2020, జనవరిలో మొదటి విడత జరిగింది. ఏప్రిల్‌లో జరగాల్సిన రెండో విడత పరీక్ష కరోనా కారణంగా సెప్టెంబర్‌లో నిర్వహించారు. 
 ►  2021 జేఈఈ షెడ్యూల్‌ను 2020, డిసెంబర్‌ 16న ప్రకటించారు. 2020లో కరోనా కారణంగా ఇంటర్‌ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం పూర్తి కాకపోవడంతో పలువురు అభ్యర్థులు జేఈఈ మెయిన్‌కు హాజరు కాలేకపోయారు. దీంతో 2021 జేఈఈ మెయిన్స్‌ను నాలుగు విడతల్లో.. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించేలా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) షెడ్యూల్‌ ఇచ్చింది. ఫిబ్రవరి, మార్చి    సెషన్ల పరీక్షలు యథాతథంగా జరిగినా కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఏప్రిల్, మే సెషన్ల పరీక్షలు ఆలస్యమయ్యాయి. ఈ పరీక్షలు సెప్టెంబర్‌ 2కి గాని పూర్తికాలేదు. 
► మూడేళ్లూ పరీక్షల షెడ్యూల్‌ను డిసెంబర్‌ నాటికే ప్రకటించారు. జేఈఈ మెయిన్స్‌–2022 షెడ్యూల్‌ మాత్రం ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. 

జేఈఈ ఆధారంగానే రాష్ట్ర ఎంసెట్‌...
ఇంత వరకూ జేఈఈ నిర్వహణపై స్పష్టత రాలేదు. కరోనా కారణంగా మరింత ఆలస్యం చేస్తారా? ఎన్ని దఫాలుగా పరీక్ష నిర్వహిస్తారు? ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ ఉంటుందా? అనే సందేహాలకు స్పష్టత రావాల్సి ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా జేఈఈ ర్యాంకుల తర్వాతే రాష్ట్రంలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. జేఈఈ ర్యాంకులు వచ్చిన వాళ్లు కేంద్ర సంస్థలకు వెళ్తున్నారు. అలా ఖాళీ అయిన ఇంజనీరింగ్‌ సీట్ల కోసం రాష్ట్రంలో మళ్లీ భర్తీ చేపట్టాల్సి ఉంటుంది. దీంతో జేఈఈ షెడ్యూల్‌ రాష్ట్ర ఎంసెట్‌పైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top