HYD: మాజీ ఐఏఎస్‌ భన్వర్‌లాల్‌ ఇంటిని ఖాళీ చేసిన ఐపీఎస్‌ నవీన్‌ కుమార్‌ | IPS Officer Naveen Kumar Vacated EX Ias Bhanwar Lal House HYD | Sakshi
Sakshi News home page

HYD: మాజీ ఐఏఎస్‌ భన్వర్‌లాల్‌ ఇంటిని ఖాళీ చేసిన ఐపీఎస్‌ నవీన్‌ కుమార్‌

Dec 29 2023 7:18 PM | Updated on Dec 30 2023 7:15 AM

IPS Officer Naveen Kumar Vacated EX Ias Bhanwar Lal House HYD - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ఐఏఎస్‌ అధికారి భన్వర్‌లాల్‌ ఇంటిని ప్రస్తుతం ఐపీఎస్‌ అధికారి నవీన్‌ కుమార్‌ ఖాళీ చేయించారు. తన ఇల్లుని ఆక్రమించేందుకు నకిలీ పత్రాలు సృష్టించారని, ఐపీఎస్‌ అధికారి నవీన్‌పై భన్వర్‌లాల్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

భన్వర్‌లాల్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు చేపట్టారు. ఐపీఎస్‌ అధికారి నవీన్‌ కుమార్‌ను సెంట్రల్‌ క్రైం స్టేషన్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీసీఎస్‌ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. దీంతో వివాదాస్పదంగా మారిన ఇంటిని నవీన్‌  ఖాళీ చేసి వెళ్లిపోయారు.

చదవండి: హైదరాబాద్‌: రిటైర్డ్‌ IASకు ప్రజెంట్‌ IPS టోకరా!

కేసు వివరాలు ఏంటంటే.?
IAS అధికారిగా సుదీర్ఘ కాలం రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేసిన భన్వర్‌లాల్‌ 2017లో రిటైరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఆయన సుపరిచితుడు. జూబ్లీహిల్స్‌లో భన్వర్‌లాల్‌కు ఓ భవంతి ఉంది. 2014లో ఈ ఇంటికి సంబంధించి ఓర్సు సాంబశివరావు అనే వ్యక్తితో అద్దె ఒప్పందం చేసుకున్నారు. దీని కాల పరిధి అయిదు సంవత్సరాలు. ఈ రెంటల్‌ అగ్రిమెంట్‌ ప్రకారం భన్వర్‌లాల్‌ జూబ్లిహిల్స్‌‌లోని తన నివాసాన్ని సాంబశివరావుకు ఐదేళ్ల కోసం అద్దెకు ఇచ్చారు. 2019లో ఈ ఒప్పందం ముగిసినా.. ఇంటిని తనకు తిరిగి ఇవ్వలేదన్నది భన్వర్‌ లాల్‌ ఆరోపణ.

భన్వర్‌ లాల్‌ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారు?
2019 తర్వాత ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. 2019లో సాంబశివరావు స్థానంలో ఇంట్లోకి IPS అధికారి నవీన్‌కుమార్‌ దిగారు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్లు తెరమీదికి వచ్చాయి. ఈ డాక్యుమెంట్లు తమ ఆస్తులకు సంబంధించి ఒరిజినల్‌ తరహాలో రూపొందించిన నకిలీ పత్రాలని భన్వర్‌లాల్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పత్రాలను ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్‌ కలిసి తయారు చేశారని, వీటికి IPS అధికారి నవీన్‌కుమార్‌ సహకరించారన్నది భన్వర్‌ లాల్‌ ఆరోపణ.

పోలీసులు ఏం చేశారు?
భన్వర్‌లాల్‌ ఆరోపణలతో రంగంలోకి దిగిన సీసీఎస్‌ పోలీసులు.. డాక్యుమెంట్లను విచారించి అవి ఫేక్‌ అని తేల్చారు. డిసెంబర్‌ 22న ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్‌ ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు. విషయం తెలిసిన ఐపీఎస్‌ అధికారి నవీన్‌కుమార్‌  ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భన్వర్ లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు జరిగిన కుట్రలో భాగంగానే నవీన్ కుమార్ సహకారంతో నకిలీ డాక్యుమెంట్లను రూపొందించి భన్వర్‌లాల్‌ సంతకాన్ని ఫోర్జరీ చేశారని అనుమానిస్తున్నారు.

IPS అధికారి నవీన్‌కుమార్‌ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ అకాడమీలో గత ఆరేళ్లుగా తన సేవలను కొనసాగిస్తున్న నవీన్ కుమార్.. గతంలో వికారాబాద్‌లో ఎస్పీగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డీసీపీగా విధులు నిర్వహించారు. ఆయన ఆచూకీని తెలుసుకున్న పోలీసులు ఇవ్వాళ అదుపులోకి తీసుకున్నారు.గత నెల 17 న భన్వర్ లాల్ భార్య మనీలాల్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అరెస్టులు ఈ నెలలో జరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement