మూసీలో ‘డ్రగ్‌ రెసిస్టెన్స్‌ బ్యాక్టీరియా’పై పరిశోధన

Indo UK Project To Study Impact Of Drug Resistant Bacteria In Musi - Sakshi

మూసీ నదిలో ‘డ్రగ్‌ రెసిస్టెన్స్‌ బ్యాక్టీరియా’పై పరిశోధన!

భారత్‌లో మూసీతోపాటు చెన్నై అడయార్‌ నదిలోనూ అధ్యయనం

 ఇండో–యూకే ప్రాజెక్ట్‌లో బర్మింగ్‌హమ్‌ వర్సిటీతోపాటు ఐఐటీహెచ్‌కు భాగస్వామ్యం

 నదుల్లోకి యాంటీ బయోటిక్స్‌ విడుదలతో మందులు తట్టుకునే ఇన్ఫెక్షన్ల వ్యాప్తిపై ఆందోళన 

 దేశంలో ఏటా 58 వేల మంది చిన్నారులు సూపర్‌బగ్‌ ఇన్ఫెక్షన్లతో మృతి

సాక్షి, హైదరాబాద్‌: మూసీ నదిలోని ‘డ్రగ్‌ రెసిస్టెన్స్‌ బ్యాక్టీరియా’పై పరిశోధన సాగనుంది. మందుల ఉత్పత్తి తర్వాత ఆయా కంపెనీల నుంచి విడుదలైన ‘యాంటీ బయోటిక్స్‌’వ్యర్థాల గాఢత మూసీలో అత్యధికస్థాయిలో ఉన్నట్టు ఇప్పటికే బయటపడింది. ఈ నేపథ్యంలో వీటిస్థాయి అధికస్థాయిలో ఉన్న మూసీతోపాటు తక్కువస్థాయిలో ఉన్న చెన్నైలోని అడయార్‌ నదిపైనా ఈ పరిశోధన జరగనుంది. ఇండో–యూకే ప్రాజెక్ట్‌లో భాగంగా బ్రిటన్‌ బర్మింగ్‌హమ్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ అధ్యయనంలో ఐఐటీ–హైదరాబాద్‌ కూడా భాగస్వామి కానుంది. ఈ కొత్త పరిశోధక ప్రాజెక్ట్‌ కోసం ఇండియా, యూకే కలిసి 1.2 మిలియన్‌ పౌండ్‌ స్టెర్లింగ్‌లు కేటాయించాయి. బ్రిటన్‌–ఇండియా ప్రభుత్వాల సహకారంతో 8 మిలియన్ల పౌండ్‌ స్టెర్లింగ్‌ల ఖర్చులో నిర్వహిస్తున్న యాంటీ–మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌(ఏఎంఆర్‌) సైంటిఫిక్‌ రీసెర్చ్‌లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను కూడా చేపడుతున్నారు. తల్లుల నుంచి సోకే ‘సూపర్‌ బగ్‌ ఇన్ఫెక్షన్ల’తో భారత్‌లో ప్రతిఏటా 58 వేల చిన్నారులు మృత్యువాత పడుతున్నట్టు, యూరప్‌ యూనియన్‌లో ప్రతి ఏడాది 28–38 వేల మధ్యలో ‘డ్రగ్‌ రెసిస్టెన్స్‌ పాథోజెన్ల’తో మరణాలు సంభవిస్తున్నట్టు అంచనా. 

నదుల్లోకి ప్రవేశించాక...
‘పర్యావరణంలో యాంటీ బయోటిక్స్‌ ఎంత త్వరగా క్షిణిస్తాయనేది మనకు తెలియదు. పెద్ద నదుల్లోకి ప్రవేశించాక, వర్షాలతో అవి ఏ మేరకు బలహీనమవుతాయన్న విషయమూ తెలియదు. ఏఎంఆర్‌ ఫ్లోస్‌ ప్రాజెక్ట్‌ ద్వారా యాంటీ బయోటిక్స్‌ ఎలా ఉత్పత్తి అవుతాయి, అవి తట్టుకునే బ్యాక్టీరియాను ఎలా ఎంపిక చేసుకుని నదుల నెట్‌వర్క్‌ల ద్వారా ఎలా వ్యాపిస్తాయి, నదుల్లో ఎంత దూరం ప్రయాణిస్తాయి, వరదల సందర్భంగా ఎక్కడి నుంచి అవి పంటపొలాల్లోకి, జనసమూహాల్లోకి వ్యాప్తి చెందుతాయి... అనే అంశాలను పరిశీలిస్తారు. నీటివనరుల్లో యాంటీ బయోటిక్స్‌ ఏ మేరకు కేంద్రీకృతమైతే నష్టం జరగదన్న దాని ప్రాతిపదికన పర్యావరణ ప్రమాణాలను రూపొందించే అవకాశం ఉంది’అని యూకే ప్రాజెక్ట్‌ లీడ్‌ హెడ్‌ డాక్టర్‌ జాన్‌ క్రెఫ్ట్‌ తెలిపారు. 

పర్యావరణంలో ఎలా వ్యవహరిస్తుందో...
‘మూసీ నది సూపర్‌బగ్‌లకు కేంద్రంగా ఉన్నట్టు గతంలోని పరిశోధనలతోనే మనకు తెలుసు. యాంటీ బయోటిక్స్‌ను తట్టుకునే బ్యాక్టీరియా పర్యావరణంలో ఎలా వ్యవహరిస్తుంది, దాని భవితవ్యం ఏమిటీ అన్నది తెలుసుకునేందుకు నీటి ప్రవాహాల నమూనాలను అంచనా వేయడం కీలకం. ఇతర దేశాలతో పాటు ఇతర నదులకు సరిపోయే నమూనాలను రూపొందించే లక్ష్యంతో మేం పనిచేస్తున్నాం’అని ఇండియన్‌ ప్రాజెక్ట్‌ లీడ్‌ ప్రొఫెసర్, ఐఐటీ–హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ శశిధర్‌ తాటికొండ వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top