breaking news
Indo Uk Institute of Health
-
మూసీలో ‘డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా’పై పరిశోధన
సాక్షి, హైదరాబాద్: మూసీ నదిలోని ‘డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా’పై పరిశోధన సాగనుంది. మందుల ఉత్పత్తి తర్వాత ఆయా కంపెనీల నుంచి విడుదలైన ‘యాంటీ బయోటిక్స్’వ్యర్థాల గాఢత మూసీలో అత్యధికస్థాయిలో ఉన్నట్టు ఇప్పటికే బయటపడింది. ఈ నేపథ్యంలో వీటిస్థాయి అధికస్థాయిలో ఉన్న మూసీతోపాటు తక్కువస్థాయిలో ఉన్న చెన్నైలోని అడయార్ నదిపైనా ఈ పరిశోధన జరగనుంది. ఇండో–యూకే ప్రాజెక్ట్‌లో భాగంగా బ్రిటన్ బర్మింగ్హమ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ అధ్యయనంలో ఐఐటీ–హైదరాబాద్ కూడా భాగస్వామి కానుంది. ఈ కొత్త పరిశోధక ప్రాజెక్ట్ కోసం ఇండియా, యూకే కలిసి 1.2 మిలియన్ పౌండ్ స్టెర్లింగ్‌లు కేటాయించాయి. బ్రిటన్–ఇండియా ప్రభుత్వాల సహకారంతో 8 మిలియన్ల పౌండ్ స్టెర్లింగ్‌ల ఖర్చులో నిర్వహిస్తున్న యాంటీ–మైక్రోబియల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) సైంటిఫిక్ రీసెర్చ్‌లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను కూడా చేపడుతున్నారు. తల్లుల నుంచి సోకే ‘సూపర్ బగ్ ఇన్ఫెక్షన్ల’తో భారత్‌లో ప్రతిఏటా 58 వేల చిన్నారులు మృత్యువాత పడుతున్నట్టు, యూరప్ యూనియన్‌లో ప్రతి ఏడాది 28–38 వేల మధ్యలో ‘డ్రగ్ రెసిస్టెన్స్ పాథోజెన్ల’తో మరణాలు సంభవిస్తున్నట్టు అంచనా. నదుల్లోకి ప్రవేశించాక... ‘పర్యావరణంలో యాంటీ బయోటిక్స్ ఎంత త్వరగా క్షిణిస్తాయనేది మనకు తెలియదు. పెద్ద నదుల్లోకి ప్రవేశించాక, వర్షాలతో అవి ఏ మేరకు బలహీనమవుతాయన్న విషయమూ తెలియదు. ఏఎంఆర్ ఫ్లోస్ ప్రాజెక్ట్ ద్వారా యాంటీ బయోటిక్స్ ఎలా ఉత్పత్తి అవుతాయి, అవి తట్టుకునే బ్యాక్టీరియాను ఎలా ఎంపిక చేసుకుని నదుల నెట్‌వర్క్‌ల ద్వారా ఎలా వ్యాపిస్తాయి, నదుల్లో ఎంత దూరం ప్రయాణిస్తాయి, వరదల సందర్భంగా ఎక్కడి నుంచి అవి పంటపొలాల్లోకి, జనసమూహాల్లోకి వ్యాప్తి చెందుతాయి... అనే అంశాలను పరిశీలిస్తారు. నీటివనరుల్లో యాంటీ బయోటిక్స్ ఏ మేరకు కేంద్రీకృతమైతే నష్టం జరగదన్న దాని ప్రాతిపదికన పర్యావరణ ప్రమాణాలను రూపొందించే అవకాశం ఉంది’అని యూకే ప్రాజెక్ట్ లీడ్ హెడ్ డాక్టర్ జాన్ క్రెఫ్ట్ తెలిపారు. పర్యావరణంలో ఎలా వ్యవహరిస్తుందో... ‘మూసీ నది సూపర్‌బగ్‌లకు కేంద్రంగా ఉన్నట్టు గతంలోని పరిశోధనలతోనే మనకు తెలుసు. యాంటీ బయోటిక్స్‌ను తట్టుకునే బ్యాక్టీరియా పర్యావరణంలో ఎలా వ్యవహరిస్తుంది, దాని భవితవ్యం ఏమిటీ అన్నది తెలుసుకునేందుకు నీటి ప్రవాహాల నమూనాలను అంచనా వేయడం కీలకం. ఇతర దేశాలతో పాటు ఇతర నదులకు సరిపోయే నమూనాలను రూపొందించే లక్ష్యంతో మేం పనిచేస్తున్నాం’అని ఇండియన్ ప్రాజెక్ట్ లీడ్ ప్రొఫెసర్, ఐఐటీ–హైదరాబాద్ ప్రొఫెసర్ శశిధర్ తాటికొండ వెల్లడించారు. -
హైదరాబాద్‌లో ఇండో యూకే ఆస్పత్రి
-వెయ్యి పడకలతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి -పూర్తిగా విదేశీ పెట్టుబడితో ఏర్పాటుకు నిర్ణయం - సీఎం కేసీఆర్‌ను కలిసిన ప్రతినిధి బృందం -సహకరించేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి హైదరాబాద్: హైదరాబాద్‌లో వెయ్యి పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ముందుకొచ్చింది. ఆసుపత్రి ఏర్పాటుకు కావాల్సిన సహకారం అందించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంగీకరించారు. హాస్పిటల్‌కు కావాల్సిన స్థలం సమకూర్చడంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు అందిస్తామని చెప్పారు. ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఛైర్మన్ ప్రొఫెసర్ మైక్ పార్కర్, గ్రూప్ సీఈవో డాక్టర్ అజయ్ రంజన్ గుప్తా, భారత్‌లో బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ మైక్ నితావ్రికాన్సిస్, భారత ప్రభుత్వ ఇన్వెస్ట్ ఇండియా గ్రూప్ మేనేజర్ ఉదయ్ మంజుల్ తదితరులు సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని హంగులతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నెలకొల్పుతామని వెల్లడించారు. పూర్తిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో నిర్మించే ఆసుపత్రికి కావాల్సిన స్థలం ఇవ్వాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. నగర శివార్లలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో స్థలం ఇవ్వడానికి సీఎం అంగీకరించారు. స్థలం ఎంపిక తర్వాత ఎంవోయూ కుదుర్చుకోవడానికి నిర్ణయం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు డాక్టర్ లక్ష్మారెడ్డి, టి.హరీష్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి తివారి, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.