లైవ్‌ లొకేషన్‌ తరహాలో తపాలా డిజిపిన్‌ | India Post rolls out DigiPin to replace traditional Pin codes | Sakshi
Sakshi News home page

లైవ్‌ లొకేషన్‌ తరహాలో తపాలా డిజిపిన్‌

Jun 23 2025 12:42 AM | Updated on Jun 23 2025 12:42 AM

India Post rolls out DigiPin to replace traditional Pin codes

ప్రతి 16 చదరపు మీటర్లకు ప్రత్యేక డిజిటల్‌ పిన్‌ నంబర్‌ 

అత్యవసర సేవల్లో తక్షణ సాయం అందేందుకు దోహదం 

ప్రభుత్వ విభాగాల పోర్టళ్లతో అనుసంధానించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తపాలా శాఖ విజ్ఞప్తి 

ఇక ఇంటి చిరునామా స్థానంలో డిజిపిన్‌.. సులభంగా అడ్రస్‌ గుర్తించేందుకు వీలు

సాక్షి, హైదరాబాద్‌: డిజిటల్‌ పిన్‌ (డిజిపిన్‌) వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో అనుసంధానించేందుకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా తపాలాశాఖ ప్రతి 16 చదరపు మీటర్ల ప్రాంతానికి ప్రత్యేకంగా ఓ పిన్‌ నంబర్‌ను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఆ పిన్‌ నంబర్‌నే ఇప్పుడు రియల్‌టైమ్‌ లొకే షన్‌గా వాడుకునేలా తపాలాశాఖ గూగు ల్‌ మ్యాప్‌ ద్వారా అనుసంధానించింది. దీనిని వైద్యారోగ్య, పోలీసు, అగ్నిమాపక, రెవె న్యూ, మత్స్య తదితర శాఖలతో అనుసంధానిస్తారు. ఇది అత్యవసర సందర్భాల్లో ప్రజ లకు వీలైనంత తొందరలో సహాయం అందేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ మేరకు ఆయా శాఖలతో అనుసంధానించాలంటూ తాజాగా తెలంగాణ తపాలాశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 

ఏంటీ వ్యవస్థ? 
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తపాలాశాఖ ఆధ్వర్యంలో పిన్‌కోడ్‌ నంబర్లు ఉన్న విష యం తెలిసిందే. ఓ గ్రామానికో, పట్ట ణాలు/నగరాల్లోని కొంతభాగానికో ఒకటి చొప్పున ఈ పిన్‌కోడ్‌ నంబర్లు ఉన్నాయి. అది చాలా పెద్ద పరిధితో కూడిన ప్రాంతానికి ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా చిన్నచిన్న ప్రాంతానికి ఒక ప్రత్యేక పిన్‌ నంబర్‌ ఉండేవిధంగా తపాలాశాఖ డిజిపిన్‌ వ్యవస్థను రూపొందించిన విషయం తెలి సిందే. ఐఐటీ హైదరాబాద్, నేషనల్‌ రిమో ట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీల సంయుక్తాధ్వర్యంలో దీనిని రూపొందించారు.

దేశంలో ప్రతి 4 చదరపు మీటర్లు ఇంటూ 4 చదరపు మీటర్ల ప్రాంతానికి ప్రత్యేక డిజిటల్‌ పోస్టల్‌ ఇండెక్స్‌ నంబర్‌ను కేటాయించారు. దాన్ని అక్షాంశ రేఖాంశాల ఆధారంగా స్థిరీకరించి శాటిలైట్‌ ద్వారా అనుసంధానించారు. ఇప్పుడు గూగుల్‌తో దాన్ని అనుసంధానించారు. మనం ఎక్కడున్నా ఆ ప్రాంత డిజిపిన్‌ను గుర్తించొచ్చు. స్మార్ట్‌ ఫోన్‌లో గూగుల్‌ ఓపెన్‌ చేసి ‘నో మై డిజిపిన్‌’అని టైప్‌ చేయగానే డిజిపిన్‌ యూఆర్‌ఎల్‌ ఓపెన్‌ అవుతుంది. దాన్ని క్లిక్‌ చేయగానే గూగుల్‌ మ్యాప్‌లో ఆ ప్రాంత డిజిపిన్‌ కనిపిస్తుంది. దాన్ని కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం గూగుల్‌ మ్యాప్‌లో మన లొకోషన్‌ ఎలా కనిపిస్తుందో, అలాగే మనం ఉన్న ప్రాంత డిజిపిన్‌ కూడా కనిపిస్తుంది.  

దేశం మొత్తాన్ని 16 గ్రిడ్లుగా విభజించారు. మళ్లీ పత్రి గ్రిడ్‌ను 16 చిన్న గ్రిడ్లుగా విభజించారు. అలా పది లేయర్లుగా విభజిస్తూ చివరు 16 చదరపు మీ టర్ల ప్రాంతం వరకు విభజించారు. ప్రతి గ్రిడ్‌కు ఓ నంబరు కేటాయిస్తూ.. చివరకు 16 చదరపు మీటర్ల ప్రాంతానికి పది డిజిట్లతో కూడిన ఫైనల్‌ నంబరు కేటాయించారు. అదే తుది డిజిపిన్‌ నంబరు.  

ఇది ఇంచుమించు ప్రతి ఇంటికి కాస్త అటూ ఇటుగా ఓ పిన్‌ నంబరుగా ఉంటుంది. పెద్ద అపార్ట్‌మెంట్లు, విశాలమైన ప్రాంగణం ఉన్న వాటికి నాలుగైదు నంబర్లు ఉంటాయి. వాటిల్లో ఏ నంబరును వినియోగించినా... మన కచ్చితమైన చిరునామాను గుర్తించొచ్చు.  
ఇక పార్శల్స్, ఉత్తరాలను పోస్ట్‌/కొరియర్‌ చేసేప్పుడు నగరం, పట్టణం, కాలనీ, వీధి, ఇంటినంబరు... ఇలాంటివి ఏవీ లేకుండా వ్యక్తి పేరు, డిజిపిన్‌ రాస్తే ఎలాంటి వెతుకులాట లేకుండా కచ్చితంగా ఆ చిరునామాను గుర్తించొచ్చు. 

చిరునామాలో వ్యక్తిగత గోప్యత ఉండాలనుకునేవారు వారి వ్యక్తిగత చిరునామా ఇవ్వకుండా కేవలం డిజిపిన్‌ ద్వారా ఆ పార్శిల్‌ను ఇంటికి తెప్పించుకోవచ్చు.  
 మనం వేరే ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నామో.. అవతలి వారికి తెలిపేందుకు ఈ డిజిపిన్‌ను వాడుకోవచ్చు.  
భారీ వరదలు, అగ్ని, రోడ్డు ప్రమాదా లు, ఇతర ఉపద్రవాల్లో చిక్కుకున్నప్పుడు.. తాను ఉన్న ప్రాంతాన్ని అత్యవసర సేవలు అందించే వారికి ఈ డిజిపిన్‌ ద్వారా సులభంగా తెలపొచ్చు.  

ఈ–కామర్స్‌ కంపెనీలు, డిజిటల్‌ సర్వి సు ప్రొవైడర్లతో కూడా ఈ డిజిపిన్‌ వ్యవస్థను అనుసంధానించే కసరత్తు జరుగుతోంది. అప్పుడు క్యాబ్‌/ఆటో ప్రొవైడ ర్లు, ఆహార పదార్థాల సరఫరా సంస్థలు, కిరాణా, మందుల సరఫరా సంస్థలు కూడా వీటిని వినియోగించుకోవచ్చు.  
ఈ డిజిపిన్‌ ఏపీఐ, ఓపెన్‌ సోర్స్‌ రిపోజిటరీ జిట్‌హబ్‌లో అందుబాటులో ఉన్నా యని,  తమ పోర్టళ్లతో అనుసంధానించుకోవచ్చని తపాలాశాఖ పేర్కొంటోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement