సా..గుతున్న కేసులు.. సవాలక్ష కారణాలు!

Increasing Pending Cases In Supreme Court And High Courts - Sakshi

కోర్టులపై పెరుగుతున్న ‘పెండింగ్‌’భారం 

ఏటా 6 శాతం చొప్పున పెరుగుదల 

పిటిషన్ల నమోదు, తీర్పుల సంఖ్యలో భారీ వ్యత్యాసం 

సుప్రీంకోర్టులో 70 వేల కేసులు.. ఏటా వెయ్యి మాత్రమే తీర్పులు! 

జూలై 1 నాటికి దేశవ్యాప్తంగా 5 కోట్లు దాటిన అపరిష్కృత కేసులు 

జడ్జిలు, సిబ్బంది, మౌలిక సదుపాయాల లేమితో ఇబ్బందులు

తెలంగాణలోని ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌ పరిధిలోకి వస్తాయని తెలంగాణ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. దీనికిముందు దాదాపు 7 దశాబ్దాలుగా ఈ వివాదం కొనసాగింది. ఎట్టకేలకు ఆదివాసీలకు అనుకూలంగా తీర్పు వెలువడింది.  

పంట నాశనం చేశాడన్న ఆరోపణలతో 1996లో నాగోసింగ్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదైంది. దీంతో కొంతకాలం పాటు విచారణ ఖైదీలుగా జైలు జీవితం గడిపారు. బెయిల్‌ రావడంతో బయటకు వచ్చినా మొత్తం మీద 26 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. చివరకు 2022లో కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఆ సంతోషంలో నాగోసింగ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బిహార్‌ బంకా జిల్లాలో ఇది జరిగింది. 

ఒకటికాదు..రెండు కాదు.. లక్షల కేసులు ఏళ్ల తరబడి కోర్టుల్లో మగ్గుతున్నాయి. దాఖలవుతున్న పిటిషన్లకు అనుగుణంగా కేసులు పరిష్కారం కావడం లేదు. 30 ఏళ్లకు పైగా ‘సాగుతున్న’కేసులు ఎన్నో ఉన్నాయి. ‘ఏళ్లకు ఏళ్లు విచారణ సాగిన తర్వాత బాధితుడికి అనుకూలంగా తీర్పు వచ్చినా అది న్యాయం అందినట్లు కాదు’, ‘సత్వర న్యాయం అందనంత కాలం బాధితులకు న్యాయం జరగనట్టే’.. ప్రభుత్వాధినేతలు, న్యాయనిపుణులు పదే పదే చెప్తున్న మాటలివి. అయినప్పటికీ కేసుల పరిష్కారంలో సంవత్సరాల జాప్యం జరుగుతోంది. పెండింగ్‌ కేసులు కోర్టులకు గుదిబండలా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా పెండింగ్‌ కేసుల సంఖ్య (కిందికోర్టు, హైకోర్టులు కలిపి) ఈ జూలై 1 నాటికి 5 కోట్లు దాటిందని కేంద్ర న్యాయ మంత్రి గతవారం రాజ్యసభలో ప్రకటించడం గమనార్హం.     
– సాక్షి, హైదరాబాద్‌

కోర్టుల్లో పెండింగ్‌ కేసులు మూడేళ్లలో 18 శాతం, అంటే ఏటా 6 శాతం చొప్పున పెరిగాయి. ప్రస్తుతం 34 మంది న్యాయమూర్తులున్న సుప్రీంకోర్టు 70 వేల పెండింగ్‌ కేసుల భారం మోస్తూ ఏడాదికి సుమారు వెయ్యి తీర్పులిస్తోంది. 2018 నవంబర్‌ నాటికి సుప్రీంకోర్టులో ఉన్న కేసుల్లో 40 శాతం అయిదేళ్ల కంటే ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. 8 శాతం కేసులు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. 2004తో పోల్చినప్పుడు అయిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 7 శాతం పెరిగింది. ట్రయల్‌ కోర్టులో మొదలై సుప్రీంకోర్టులో తీర్పు రావడానికి ఒక్కో కేసుకు సగటున 13 సంవత్సరాల 6 నెలల కాలం పడుతోంది. ఇందులో మూడో వంతు కాలం ప్రొసీడింగ్స్‌ సుప్రీంకోర్టులోనే ఉంటోంది.  

పెండింగ్‌కు ముఖ్య కారణాలివే.. 
► జడ్జిలు సహా కోర్టు సిబ్బంది లేమి 
► న్యాయ వ్యవస్థకు అరకొర నిధుల కేటాయింపు 
► కోర్టులు, ఇతర చోట్ల మౌలిక సదుపాయాల కొరత 
► చట్టపరమైన ప్రక్రియ దుర్వినియోగం, చట్టంలో లోటుపాట్లు  (వాయిదా వేస్తూ వెళ్లడం)  
► న్యాయస్థానాల్లో అంతంత మాత్రంగా సాంకేతికత 
► చట్టాలపై ప్రజలకు అవగాహన పెరగడం 
► ఆర్‌టీఐ, ఆర్‌టీఈ లాంటి కొత్త చట్టాలు వస్తుండటం 
► జనాభా మేరకు కోర్టుల సంఖ్య లేకపోవడం 
► ప్రభుత్వం నుంచి కూడా లిటిగేషన్లు పెరగడం 
► పలు చట్టాల్లో ఇంకా అస్పష్టత ఉండటం 

 అవగాహన.. సాంకేతికత అభివృద్ధితో ప్రయోజనం 
► ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా కోర్టులకు వచ్చే కేసులను కొంతవరకు తగ్గించవచ్చు.  
► కోర్టుల్లో మౌలిక వసతులు కల్పించాలి. ముఖ్యంగా సాంకేతికతను అభివృద్ధి పరచడంతో పాటు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తే కేసుల సత్వర పరిష్కారం సాధ్యమవుతుంది. అన్ని కోర్టుల్లో వర్చువల్‌ విచారణ చేపట్టాలి. సాక్షులు, అధికారులు, కక్షిదారులు కోర్టుకు రాకున్నా ఆన్‌లైన్‌ ద్వారా వారి వాంగ్మూలాలను స్వీకరించవచ్చు. తద్వారా వాయిదాలను కొంతవరకు తగ్గించొచ్చు. 
► టెక్నాలజీతో ఒకే రకమైన కేసులను ఒక్క దగ్గరే విచారణ చేపట్టవచ్చు. 
► మోటార్‌ వెహికిల్‌ కేసుల్లో చాలా కేసులు హైకోర్టులకే వస్తున్నాయి. వీటిని జిల్లా కోర్టుల్లోనే పరిష్కరిస్తే ఉన్నత న్యాయస్థానాలపై భారం కొంత తగ్గుతుంది. హైకోర్టులో ఈ కేసులను చాలా వరకు సింగిల్‌ జడ్జికే పరిమితం చేయాలి.  
► చిన్న చిన్న కేసుల విచారణకు గడువు పెట్టుకోవాలి. ఆ గడువులోగా ఉత్తర్వులు ఇచ్చేయాలి.  
► పలు కారణాల రీత్యా ఒక్కోసారి వాద ప్రతివాదులు, కొన్ని సమయాల్లో న్యాయవాదులు కోర్టుకు హాజరుకాలేపోతుండటంతో కేసులు వాయిదా పడుతున్నాయి.  
► ఫ్యామిలీ కేసుల్లో ఎక్కడో ఉద్యోగం చేస్తున్న భర్త, భార్య ప్రతిసారీ కోర్టుకు హాజరు కావడం తీవ్ర ఇబ్బందికరంగా మారుతోంది.  
► ప్రభుత్వ లిటిగేషన్లు కూడా తగ్గాలి. అధికారులు హాజరుకాలేని పక్షంలో వారు ఆన్‌లైన్‌ ద్వారా వివరణ ఇచ్చే వెలుసుబాటు ఉండాలి. దీంతో హాజరు కోసం వాయిదా వేయాల్సి అవసరం ఉండదు. ప్రభుత్వం కూడా ఓ లిటిగేషన్‌ పాలసీని తీసుకొస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. 
–జస్టిస్‌ నవీన్‌రావు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి 

జడ్జిల రోస్టర్‌ వేర్వేరుగా ఉండాలి 
ప్రజలు, పనిచేస్తున్న జడ్జిల నిష్పత్తిలో చాలా తేడా ఉంది. కేటాయించిన సంఖ్యలోనూ పెద్ద ఎత్తున ఖాళీలుంటున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. ఇక చిన్న చిన్న కేసులను వాయిదాలు వేయకుండా నిర్ణీత గడువుతో సత్వరం పరిష్కరించాలి. జడ్జిల రోస్టర్‌ కూడా క్రిమినల్, సివిల్, రిట్‌.. ఇలా వేర్వేరుగా ఉండాలి. ఎవరికి ఎందులో నైపుణ్యం ఉందో ఆ సబ్జెక్టును కేటాయిస్తే వేగంగా పూర్తి చేయగలుగుతారు. 
– సీనియర్‌ న్యాయవాది, తెలంగాణ హైకోర్టు 

నేనిక కోర్టుకు రాలేను! 
మేడమ్‌.. మా బాబుకు ఐదేళ్లు ఉన్నప్పుడు విడాకుల కోసం కోర్టుకు వచ్చా. ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు. ఇంకా నేను కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నా. ఉద్యోగం చేసుకుంటూ నా పిల్లలను పోషించుకుంటున్నా. వాయిదాల కోసం సెలవులు పెట్టడానికి నానాయాతన పడాల్సి వస్తోంది. మీరు విడాకులు 
ఇవ్వకపోయినా పర్వాలేదు. నేను ఇకపై కోర్టుకు రాలేను 
–జడ్జితో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top