
రానున్న రెండురోజులు అధిక ఉష్ణోగ్రతలకు చాన్స్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉక్కపోత
అక్కడక్కడా తేలికపాటి వర్షాలకు సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు తీవ్రం కానున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. రానున్న రెండు రోజులు సాధారణం, అంతకంటే కాస్త ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. వాస్తవానికి గత ఐదు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాధారణం కంటే 1 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ తక్కువగా నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కారణంగా వచ్చే రెండు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదైనప్పటికీ ఉక్కపోత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

పెరిగిన ఉష్ణోగ్రతలు
ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే..ఖమ్మంలో అత్యధికంగా 41.4 డిగ్రీ సెల్సీయస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 24.4 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్‌నగర్ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. శనివారం నాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే మాత్రం దాదాపు అంతటా గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించింది.
దక్షిణాది జిల్లాలకు వర్ష సూచన
ప్రస్తుతం మరత్వాడ నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.