ఆర్థిక లావాదేవీలకు సంబంధించి థర్డ్ పార్టీ నుంచి ప్రతి సమాచారం సేకరిస్తాం
ఏఐ ఇతర సాంకేతికత వినియోగంతో అద్భుత ఫలితాలు
రెండు మూడేళ్లలో అందరి ఆదాయం తెలుసుకునే స్థాయికి వెళ్తాం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ (ఏపీ, తెలంగాణ) సురేశ్ బత్తిని
సాక్షి, హైదరాబాద్: ఆదాయపన్ను ఎగవేతదారులు ఎక్కువకాలం తమ నుంచి తప్పించుకోలేరని.. ప్రతి ఒక్కరి ఆర్థిక లావాదేవీలపైనా తమ దృష్టి ఉంటుందని ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ (ఏపీ, తెలంగాణ) సురేశ్ బత్తిని తెలిపారు. ఏఐ సాయంతో అందరి వివరాలను క్రోడీకరిస్తున్నట్లు చెప్పారు. పాత చట్టంతో పోలిస్తే నూతన ఐటీ చట్టం–2025లో పన్ను చెల్లింపుదారులకు సులువుగా అన్ని అంశాలు గుర్తించేలా సరళీకరించామన్నారు. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు పక్కా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నూతన ఆదాయపన్ను చట్టంపై విస్తృత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ‘సాక్షి’కి శుక్రవారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై సురేశ్‌బత్తిని మాట్లాడారు.
పన్ను ఎగవేతదారులను దారికి తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యలేంటి?
పన్ను ఎగవేత మున్ముందు కష్టమే. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లు, కార్ల విక్రయాలు, ఎల్‌ఐసీ చెల్లింపులు, ట్రావెల్ ఆఫీసులు, హోటళ్లు ఇలా అనేక మార్గాల ద్వారా మేం సమాచారం సేకరిస్తాం. ఆ సమాచారాన్ని ఏఐ ఉపయోగించి విశ్లేషిస్తాం. వాటి ఆధారంగా అసెసీ (పన్ను చెల్లించాల్సిన వ్యక్తి)కి ఆర్థిక లావాదేవీల వివరాలు పంపుతాం. ఈ లావాదేవీలన్నీ మీరే చేసినట్లయితే అందుకు అనుగుణంగా పన్ను చెల్లించాలని సూచిస్తాం. ఇది కేవలం ర్యాండమ్‌గా కాకుండా ఇలా అందరి వివరాలను పరిశీలిస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు ఎక్కడ ఖర్చు పెట్టినా వెంటనే వారి ఆదాయానికి సంబంధించిన సమాచారం మాకు తెలిసిపోతుంది. రెండు మూడేళ్లలో ప్రతి ఒక్కరి ఆదాయం మాకు తెలిసిపోయే స్థితికి వస్తాం.
పాన్ లింకేజీ, డిజిటల్ లావాదేవీల ట్రాకింగ్‌తో ఎగవేతలు ఏ మేరకు తగ్గుతాయి?
ప్రస్తుతానికి ఎంత మొత్తంలో పన్ను ఎగవేతలు ఉన్నాయో చెప్పలేకపోవచ్చు. కానీ పాన్ కార్డు లింకేజీ, డిజిటల్ లావాదేవీల ట్రాకింగ్‌తో రెండు మూడేళ్లలోనే మేం 95 శాతం వరకు పన్ను ఎగవేతలను నిర్మూలించే స్థాయికి వెళ్తాం. ఎందుకంటే.. లెక్కల్లో చూపని ఆదాయాన్ని ఎవరూ నగదు రూపంలో ఎంతోకాలం దాయలేరు. ఎక్కడో ఒకచోట తప్పకుండా వాటిని ఖర్చు చేయాల్సిందే. అలా ఖర్చు చేస్తే తప్పకుండా మా దృష్టికి వస్తారు.
ఫేక్ జీఎస్టీలు, బోగస్ బిల్లులపై దృష్టి పెడతారా?
జీఎస్టీ అధికారులు ఫేక్ జీఎస్టీలు, బోగస్ బిల్లులకు సంబంధించి పరిశీలిస్తారు. అందులో ఏమైనా తేడాలున్నట్టు గ్రహిస్తే మాకు సమాచారం ఇస్తారు. దాని ఆధారంగా మేం చర్యలు తీసుకుంటాం.
నగదు లావాదేవీలు అత్యధికంగా జరిగిన రియల్ ఎస్టేట్ లాంటి రంగాల్లో పన్ను ఎగవేతలను ఎలా అరికడతారు?
రూ. 2 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేస్తే ఎంతో మార్పు వస్తుంది. అలాగే నగదు లావాదేవీలను వీలైనంత వరకు తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా తీసుకొచ్చిందే నోట్ల రద్దు. భవిష్యత్తులో నగదు లావాదేవీలు వీలైనంత వరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి పన్ను ఎగవేతలకు అవకాశాలు తగ్గుతాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏయే రంగాల నుంచి ఎక్కువగా ఆదాయపన్ను చెల్లింపులు ఉంటున్నాయి?
ప్రధానంగా ఫార్మా, రియల్ ఎస్టేల్, సాఫ్ట్‌వేర్ రంగాల నుంచి ఎక్కువ మొత్తంలో పన్ను చెల్లింపులు ఉంటున్నాయి.
ఆదాయ పన్ను చెల్లించని వారికి మీ సందేశం ఏంటి?
ఆదాయం ఆర్జించే వారంతా చట్ట ప్రకారం పన్నులు చెల్లించాలని కోరుతున్నాం. ఒకవేళ పన్నులు చెల్లించకపోతే చట్ట ప్రకారం వ్యవహరిస్తాం. గతంతో పోలిస్తే పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతోంది. గత ఐదేళ్ల గణాంకాలు చూస్తే రూ. కోటికిపైగా పన్ను చెల్లించే వారి సంఖ్య మూడింతలు పెరిగింది. కొత్త చట్టం అమలుతో ఐటీ చెల్లింపు విధానం మరింత సరళతరం అవుతుంది కాబట్టి పన్ను చెల్లింపులు మరింత పెరుగుతాయని భావిస్తున్నాం.
కొత్త ఐటీ యాక్ట్–2025కు పాత ఐటీ యాక్ట్–1961 మధ్య ప్రధాన తేడాలేంటి?
పాత చట్టంతో పోలిస్తే కొత్త చట్టాన్ని ఎంతో సరళీకరించాం. పాత చట్టంతో పోలిస్తే కొత్త చట్టంలో దాదాపు 50 శాతం మేర సెక్షన్లు, నిబంధనలు తగ్గించాం. అలాగే పాత చట్టంలో ప్రీవియస్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్ అని ఉండేవి. ఆ సందిగ్ధత తొలగించేందుకు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒకేదాన్ని ట్యాక్స్ ఇయర్ అని తీసుకొచ్చాం. పన్ను చెల్లింపుదారుల ప్రశ్నలు, అనుమానాలకు సమాధానం ఇచ్చేలా ఏఐ చాట్‌బోట్‌ను ఏర్పాటు చేశాం.


