
కుటుంబ కలహాలతో భర్తను చంపిన భార్య
వరంగల్ జిల్లాలో ఘటన
వర్ధన్నపేట: కుటుంబ కలహాల కారణంగా ఓ భార్య కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి భర్తకు ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. వర్ధన్నపేట ఎస్సై చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం భవానికుంట తండాకు చెందిన జాటోతు బాలాజీ (44) ఈనెల 8న తండాలోని తన నివాసంలో దాటుడు పండుగ జరుపుకున్నాడు. పండుగ సందర్భంగా సాయంత్రం ఏడు గంటల సమయంలో బాలాజీ తాను మద్యం సేవించేందుకు బయటికి వెళ్తున్నానని భార్య కాంతికి చెప్పాడు.
బయటికి వెళ్లొద్దని, ఇంట్లోనే మద్యం ఉందని చెప్పిన భార్య, వంటింట్లోకి వెళ్లి ఒక గ్లాసులో కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి బాలాజీకి ఇచ్చింది. ఇది తాగిన కొద్దిసేపటికే బాలాజీ గొంతులో నొప్పిగా ఉందని చెప్పడంతో కాంతి అతన్ని వదిలిపెట్టి అదే తండాలో ఉండే తన బావ అయిన వాంకుడోతు దశరు ఇంటికి వెళ్లింది. బాలాజీ పరిస్థితిని గమనించిన తండావాసులు వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యుల సూచనల మేరకు వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
ఎంజీఎంనుంచి ఈనెల 13న హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించినట్లు ఎస్‌ఐ తెలిపారు. భర్తతో గొడవను మనసులో పెట్టుకున్న కాంతి తన బావ దశరు ప్రోత్సాహంతో గడ్డి మందును ఉద్దేశ పూర్వకంగానే బాలాజీకి తాగించినట్లు చెప్పారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.