కళ్లు తెరవకుండానే కడుపు లో కవలల మృతి చికిత్స పొందుతూ చనిపోయిన భార్య తట్టుకోలేక తనువు చాలించిన భర్త శంషాబా ద్‌లో విషాదకర ఘటన. మరికొద్ది రోజుల్లో ఓ అందమైన కుటుంబం ఆ తల్లి దండ్రుల ముందున్న కల.. కడుపులో ఉన్న కవ లలు మరికొద్ది రోజుల్లో తమ కుటుంబానికి కళ తీసుకొస్తారని ఆశించారు. అయితే వారి కల అంతా కొన్ని గంటల్లోనే చెదిరిపోయింది. కడుపులో ఉన్నకవలలు కళ్లు తెరవ కుండానే చనిపోయారు... ఆపై చికిత్స పొందుతూ భార్య మృతిచెందడంతో.. మన స్తాపంతో భర్త కూడా ఆత్మహత్యతో తనువు చాలించడంతో ఆ కల పీడకలగా ముగిసింది.
శంషాబాద్: కడప జిల్లా రైల్వేకోడూరికి చెందిన ముత్యాల విజయ్ (40) శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తూ భార్య శ్రావ్యతో కలిసి పట్టణంలోని సామ ఎనక్లేవ్‌లోని ఓ గదిలో ఏడాదిన్నరగా నివాసముంటున్నాడు. ఏడేళ్ల కిందటే వివాహం జరిగినా పిల్లలు కలగకపోవడంతో ఐవీఎఫ్ ద్వారా సంతాన భాగ్యానికి బాటలు వేసుకున్నారు. ఆదివారం రాత్రి 8 నెలల కడుపుతో ఉన్న శ్రావ్యకు కడుపునొప్పి రావడంతో ఆమె తల్లితో కలిసి అత్తాపూర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కడుపులో ఉన్న కవలలు చనిపోయారని తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన విజయ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మరికొద్ది సమయం తర్వాత శ్రావ్యకు కూడా మెరుగైన చికిత్స చేయాల్సిందిగా సూచించడంతో గుడిమల్కాపూర్‌లోని మైత్రి ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు అత్త సరోజిని విజయ్‌కు ఫోన్ చేసింది. విజయ్ అక్కడికి వెళ్లిన కొద్ది సమయంలోనే చికిత్స పొందుతూ శ్రావ్య కూడా మృతిచెందడంతో తీవ్ర మనస్తాపంతో శంషాబాద్‌లోని తన ఇంటికి వచ్చేశాడు. సోమవారం ఉదయం భార్యను తీసుకెళ్లడానికి భర్త సంతకం కావాలని ఆస్పత్రి యాజమాన్యం కోరడంతో వారి బంధువులు విజయ్‌కు ఫోన్ చేశారు. స్పందించకపోవడంతో ఇంటికి వచ్చి గది తెరిచి చూసేసరికి విజయ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని విగత జీవిగా కనిపించాడు. మనస్తాపంతోనే తన తమ్ముడు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని విజయ్ సోదరుడు ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


