టమాటాలో పులుపు తగ్గింది! | Impact of a chemical sprayed on one crop on the produce of another crop | Sakshi
Sakshi News home page

టమాటాలో పులుపు తగ్గింది!

Jun 19 2026 4:11 AM | Updated on Jun 19 2026 4:11 AM

Impact of a chemical sprayed on one crop on the produce of another crop

క్యాప్సికంలో విటమిన్‌–సీ కోత 

తొందరపాటు సాగు..మోతాదుకు మించిన మందులు 

రుచి, విటమిన్లు కనుమరుగు.. ఆరోగ్యంపై దుష్ప్రభావం 

ఐకార్‌ అధ్యయనం, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2025 సర్వేలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: పళ్లెంలో ముద్ద నోట్లోకి వెళ్లేవరకు అంతా బాగానే ఉంది. నమిలాకే తెలుస్తోంది.. రుచి లేదు, వాసన లేదు, పైగా కడుపులో మంట. హైదరాబాద్‌ మా ర్కెట్లకు ప్రతిరోజూ 2,800 టన్నుల కూరగాయలు దిగుమతవుతున్నా, పోషకాలు మాత్రం ఉండట్లేదు. తొందరపాటు సాగు కోసం మోతాదుకు మించి విష రసాయనాలు వాడటమే దీనికి ప్రధాన కారణమవుతోంది.  

తిండి తిన్నా బలమేదీ? 
పంట త్వరగా చేతికందడానికి విచ్చలవిడిగా రసాయన ఎరువులు,కాలుష్య కారకాలు ఎక్కువగా ఉండే మందులు పిచికారీ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) తన అధ్యయనంలో తేల్చింది. మడిలో వేర్వేరు కూరగాయల తోటలను సాగుచేస్తుండటం కూడా ఒకింత ప్రమాదకరమని చెప్పింది. ఒక పంటకు పిచికారీ చేసే రసాయనం ఇంకో పంట ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని గుర్తించింది. 

నగరానికి వచ్చే టమాటాలో పులుపు (లైకోపీన్‌) 35 శాతం, క్యాప్సికంలో విటమిన్‌–సీ 28 శాతం తగ్గినట్లు తేల్చింది. ఆహార భద్రత, ప్రమాణాలు (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)–2025 సర్వేలో హైదరాబాద్‌ మార్కెట్‌ నమూనాల్లో 31 శాతం కూరగాయల్లో గరిష్ట అవశేష పరిమితికి మించి పురుగుమందు అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. కృత్రిమంగా మగ్గబెట్టిన టమాటాలో లైకోపీన్‌ 38 శాతం, క్యాప్సికంలో విటమిన్‌–సీ 30 శాతం తగ్గినట్లు ఐకార్‌ అధ్యయనంలో తేలింది. ఫలితంగా తిండి తిన్నా బలం రావడం లేదు. 

ఏ మందు ఎంత మోతాదులో... 
టమాటా త్వరగా పక్వానికి రావడానికి ఎథిఫాన్‌ ద్రావణం పిచి కారీ చేస్తున్నారు. సొరకాయ, బీరకాయ లావుగా, పొడవుగా పెరగడానికి నిషేధిత ఆక్సిటోసిన్‌ సూదులు గుచ్చు తున్నారు. ఇది తిన్న పిల్లల్లో హార్మోన్‌ సమస్యలు, అకాల యుక్తవయస్సు వస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పురుగుల నివారణకు వాడే క్లోర్‌పైరిఫాస్, మాలాథియాన్‌ మందులు నరాలను దెబ్బ తీస్తున్నాయి.  

శంషాబాద్‌లో గత మార్చిలో బీరకాయ నమూనాలో ఆక్సిటోసిన్‌ పరిమితికి ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అది తిన్న ఇద్దరు చిన్నారులు వాంతులతో ఆసుపత్రి పాలయ్యారు. మేడ్చల్‌లో కాలీఫ్లవర్‌పై నిషేధిత ప్రొఫెనోఫాస్‌ వాడకం బయటపడింది. నిమ్స్‌ వైద్యుల లెక్కల ప్రకారం కలుషిత ఆహారం వల్ల గ్యా్రస్టిక్, కాలేయ జబ్బులు గత ఏడాది 22 శాతం పెరిగాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement