
సిరిసిల్ల విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ శిక్షణ
ఆధునిక సాంకేతిక కోర్సుల్లో బోధన
ఆగస్టు నుంచి ఆన్‌లైన్ విధానంలో తరగతులు
సిరిసిల్ల కల్చరల్: డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తున్న అధునాతన సాంకేతిక కోర్సులు సర్కార్ బడి విద్యార్థులకు కూడా చేరువ కానున్నాయి. దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఐఐటీ మద్రాస్ తన సాంకేతిక కోర్సుల విస్తరణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పాఠాలు చెప్పనుంది. స్థానిక గీతానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అత్యాధునిక సాంకేతిక కోర్సుల్లోని మౌలిక అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచి్చంది.
ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు నుంచి రెండు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఐఐటీ మద్రాస్ లేఖ రాసింది. స్కూల్ కనెక్ట్‌లో భాగంగా ఐఐటీ మద్రాస్ సిరిసిల్లలోని రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో భాగస్వామ్యమైంది. ఈ–మెయిల్ ద్వారా ఈ మేరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు లేఖలు పంపింది. ఐఐటీ మద్రాస్, సెంటర్ ఫర్ ఔట్‌రీచ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్ (కోడ్) ద్వారా స్కూల్ కనెక్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా శివనగర్, గీతానగర్ ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకుంది.
ఇవీ కోర్సులు..
డేటా సైన్స్ అండ్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏరోస్పేస్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, ఇంజినీరింగ్, బయోలాజికల్ సిస్టమ్స్, మేథ్స్ అన్‌ప్లగ్‌డ్ గేమ్స్ అండ్ పజిల్స్, పర్యావరణం, ఫన్ విత్ మేథ్స్ అండ్ కంప్యూటింగ్, లా, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, హ్యుమానిటీస్ వంటి పది కోర్సులను రెండు నెలలపాటు బోధిస్తారు. ముందుగానే చిత్రీకరించిన వీడియోలను ప్రతి సోమవారం పోర్టల్‌లో ఉంచుతారు. ఐఐటీ ప్రొఫెసర్లతో ప్రతి శనివారం ప్రత్యక్ష సంభాషణకు అవకాశం కల్పిస్తారు. విద్యార్థుల సందేహాలను వారు నివృత్తి చేస్తారు. ఫలితంగా ఆయా కోర్సుల్లో విద్యార్థులు తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటారు.
విద్యార్థులకు విస్తృత ప్రయోజనాలు
ఐఐటీ మద్రాస్‌తో అనుసంధానానికి ఎంపికవడం వ్యక్తిగతంగా సంతోషంగా ఉంది. ఇది మా పాఠశాల విద్యార్థుల భవిష్యత్ నిర్మాణానికి ఎంతో దోహదం చేస్తుంది. అత్యాధునిక కోర్సుల మౌలికాంశాలపై శిక్షణ పిల్లల కెరీర్ నిర్మాణానికి ఉపకరిస్తుంది. డేటా సైన్స్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్తతరం సాంకేతికతల్లో సర్కార్ బడి పిల్లలు సత్తా చాటుతారు. – చకినాల శ్రీనివాస్, శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
పేద బిడ్డలకు టెక్నాలజీ చేరువవుతుంది
ప్రభుత్వ బడిలో చదివే పేద విద్యార్థులకు టెక్నాలజీని చేరువ చేసేందుకు ఈ స్కూల్ కనెక్ట్ ఉపయోగపడుతుంది. ఐఐటీ మద్రాస్ తరగతులతోపాటు అక్కడి ప్రొఫెసర్లతో నేరుగా సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం కల్పించడం విద్యార్థులకు వరంగా భావించాలి. ఇంజినీరింగ్ కోర్సుల్లో మాత్రమే లభ్యమయ్యే అంశాలను పాఠశాల స్థాయిలోనే నేర్చుకునే అరుదైన అవకాశం ఇది. – లోకిని శారద, హెచ్‌ఎం, గీతానగర్ జెడ్పీ హైస్కూల్