హైదరాబాద్ నగర పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా తీసుకుంటున్న చర్యలతో బీఆర్‌ఎస్, బీజేపీ వంటి పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్పటికీ మధ్యతరగతి ప్రజల నుంచి స్పందన మాత్రం సానుకూలంగానే ఉంది. ఇప్పటికే ఎన్నో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా.. ఇంకా కూల్చివేయాల్సిన అక్రమ నిర్మాణాలు మాత్రం ఇంకా ఉన్నట్లే తెలుస్తోంది. బడాబాబుల అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువలావస్తున్నాయి. సమస్యల పరిష్కారానికి హైడ్రా ప్రజావాణిలో 64 ఫిర్యాదులు రావడమే ఇందుకు నిదర్శనం.
బడాబాబుల ఆక్రమణలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులు హైడ్రా ప్రజావాణిని ఆశ్రయించారు. రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కబ్జా చేసుకుంటూ పోతుంటే గతంలో మాదిరి గమ్మున ఉండట్లేదు. దశాబ్దాల సమస్యలకు వెనువెంటనే హైడ్రా పరిష్కారం చూపడంతో.. ధైర్యాన్ని కూడగట్టుకొని వచ్చి ప్రజావానిలో ఫిర్యాదు చేస్తున్నారు. లే ఔట్లను చూపించి ఆక్రమణలు జరుగుతున్న తీరును వివరిస్తున్నారు. కాలనీలోంచి సాఫీగా సాగిపోయే వరద కాలువను.. బడా బిల్డర్స్ అడ్డుకుంటున్న వైనాన్ని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఇదే పరిస్థితి రహదారుల విషయంలోనూ జరుగుతోంది. లే ఔట్‌లోకి జరిగి మరీ రహదారులను కాజేసేస్తున్నారు. మూసాపేట ఆంజనేయనగర్‌లో కబ్జాలకు గురైన 2 వేల గజాల పార్కును హైడ్రా కాపాడిందని.. దీనిని పార్కుగా అభివృద్ధి చేసే బాధ్యతను కూడా హైడ్రా తీసుకోవాలని అక్కడి నివాసితులు కోరారు. ఈ మేరకు హైడ్రా ప్రజావాణిలో దరఖాస్తు అందజేశారు. ఇలా సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 64 ఫిర్యాదులందాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 వరకూ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్‌గారు పరిశీలించి సమస్య పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. ఫిర్యాదు దారుల ముందే గూగుల్ మ్యాప్స్, రెవెన్యూ, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ఆధారంగా అక్కడ పరిస్థితులు గతంలో ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా మారాయి వివరించి పరిష్కార మార్గాలు సూచించడంతో ఫిర్యాదుదారులు ఊరట చెందారు.
ఫిర్యాదులు ఇలా...
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, గాజుల రామారంలోని వోక్షిత్ హిల్ వ్యూ కాలనీ 7 ఎకరాల పరిధిలో ఉంది. దాదాపు 200ల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. పైన అటవీ ప్రాంతం నుంచి వచ్చిన వరద గతంలో సాఫీగా బంధం చెరువుకు వెళ్తుండేది. బంధం చెరువుకు.. వోక్షిత్ హిల్‌వ్యూ కాలనీకి మధ్య ఓ నిర్మాణ సంస్థ.. ఇప్పుడు అపార్టుమెంట్లు కట్టడంతో ఈ వరద కాలువ తమ భూమిలోంచి వెళ్లడానికి వీలు లేదని ఏకంగా మూసేశారని.. గతంలో మున్సిపాలిటీవాళ్లు వేసిన పైపులైన్లను ధ్వంసం చేశారంటూ వాపోయారు. దీంతో మురుగు, వరద నీరు నిలిచిపోయి తమ కాలనీవాళ్లం ఇబ్బంది పడుతున్నామని వోక్షిత్ హిల్ వ్యూ కాలనీ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
రంగారెడ్డి జిల్లా , హయత్‌నగర్ మండలం బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్‌లోని కాప్రాయి చెరువు అలుగులు మూసేయడంతో చెరువు నిండి ఎగువున ఉన్న తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని హరిహరపురం కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ చెరువు నిండి కిందన ఉన్న బాతుల చెరువుకు నీరు వెళ్లేదని.. ఇక్కడ అలుగు ముసేయడం, తూములు బంద్‌చేయడంతో చెరువు కింద ఉన్న కాలనీల వారు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా 20 కాలనీల వారు ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పశుమాముల విలేజ్ సర్వే నంబరు 454లో 9 ఎకరాల పరిధిలో దాదాపు 155 ప్లాట్లతో 1982లో లే ఔట్ వేశారు. దీనికి ఆనుకుని ఉన్న 455 సర్వే నంబరులో 1.06 ఎకరాల భూమి ఉన్న వ్యక్తి తమ లే ఔట్‌లోకి వచ్చి రహదారులు కబ్జాచేసేసి.. కొన్నిప్లాట్లను కూడా కలిపేసుకున్నారని ఆ లే ఔట్‌లోని ప్లాట్ ఓనర్ల సంఘం ప్రతినిధులు వచ్చి హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం వెంకటాపురం బ్యాంక్ కాలనీ లో 372 గజాల ఓపెన్ బావి ఉండేది. దీనిని మట్టితో నింపి ప్రజావసరాలకు కాలనీవాసులు వినియోగించుకునేవారు. అయితే ఇటీవల ఈ స్థలం మాది అంటూ తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకుని కొట్టేయాలని ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నారని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ స్థలానికి జీహెచ్ ఎంసీ వాళ్లు వేసిన ఫెన్సింగ్‌ను కూడా తొలగించి ఆక్రమణలకు పాల్పడ్డారంటూ వాపోయారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్టుగేజ్‌లో ఉందంటూ బోర్డు పెట్టారని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం సర్వే నంబరు 124/1 లో 200ల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉందని.. పలు కంపెనీలకు గతంలో ఇచ్చిన ల్యాండ్‌ను వారు వినియోగించుకోకపోవడంతో వెనక్కి తీసుకున్నారు. కాని అక్కడి కంపెనీలు వేర్వేరుపేర్లతో ఆ భూమిని కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారని.. అక్కడ గతంలో భూములు కోల్పోయిన వారు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మదీనాగూడ విలేజ్ సర్వే నంబరు 48లో 18 ఎకరాల పరిధిలో హృదయ కోఆపరేటివ్ సొసైటీ పేరిట హుడా లేఔట్ ఉండగా.. హెచ్ ఎండీఏకు తప్పుడు పత్రాలు సమర్పించి తమ లే ఔట్‌లోకి ఎకరాన్నర వరకూ జరిగి రహదారులను, ప్లాట్లను కబ్జా చేశారని.. ఇరు లే ఔట్‌లను పరిశీలించి న్యాయం చేయాలని హైడ్రాను ఆశ్రయించారు సొసైటీ ప్రతినిధులు. అలాగే కొండాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీలో పాఠశాల భవనానికి, వాహనాల పార్కింగ్‌కు కేటాయించిన స్థలాలు కొంతమేర ఇప్పటికే కబ్జా కాగా.. మిగిలిన వెయ్యి గజాలను కాపాడాలని హైడ్రా ప్రజావాణిలో అక్కడి నివాసితులు ఫిర్యాదు చేశారు.


