
సాక్షి,హైదరాబాద్: బాధితులు ఫిర్యాదు చేసినా కేసులు ఎందుకు నమోదు చేయలేదని హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ ప్లాట్లను కబ్జా చేశారని పలువురు బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా కోహెడలో వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. భూమిలో మారణాయుధాలు చూసి ఆగ్రహానికి లోనయ్యారు.ఈ సందర్భంగా..బాధితులపై దాడి జరిగినా కేసు ఎందుకు నమోదు చేయలేదని హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సూచించారు. వారికి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి
హైదరాబాద్ హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. బాధితుల నుంచి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదులను స్వయంగా స్వీకరిస్తున్నారు. అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
అయితే,ప్రజా వాణిలో కోహెడలో తమ భూమి కబ్జాకు గురైందని, ఫిర్యాదు చేసినా హయత్ నగర్ సీఐ పట్టించుకోవడం లేదంటూ ఏవీ రంగనాథ్ ఎదుట ఏకరవు పెట్టుకున్నారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఏవీ రంగనాథ్ స్వయంగా వివాదాస్పద స్థలాన్ని సందర్శించారు. బాధితులతో మాట్లాడారు.