Hyderabad: మాకొద్దు సారూ ఈ తిండి..! చారు నీళ్లలాగా.. కూరలు చారులాగా, గుడ్ల సంగతి సరేసరి..

Hyderabad: Worse Mid Day Meal Scheme In Schools - Sakshi

సగానికిపైగా విద్యార్థులు దూరం

సరఫరా ఏజెన్సీలతో హెచ్‌ఎంల కుమ్మక్కు

సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనం అమలు తీరు ఇదీ  

నగరంలోని మేకలమండి ప్రభుత్వ పాఠశాలకు బుధవారం మధ్యాహ్న భోజనంలో భాగంగా, పప్పు చారు, ఉడకబెట్టిన కోడి గుడ్లు సరఫరా అయ్యాయి. విద్యార్థులు గుడ్డు పొరను తొలగించగా లోపల కుళ్లిపోయి తినడానికి పనికి రాకుండా ఉన్నాయి. దీంతో విద్యార్థులు హెచ్‌ఎంకు ఫిర్యాదు చేశారు. ఆయన సంబంధిత ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లగా .. మరుసటి రోజు తాజా గుడ్లు పంపిస్తామని తాపీగా సమాధానం ఇవ్వడం విస్మయానికి గురిచేసింది.  

సాక్షి, హైదరాబాద్‌: ముద్ద అన్నం... నీళ్ల పప్పుచారు.. కుళ్లిన కోడి గుడ్లు... అకలితో తినడానికి ప్రయత్నించినా.. గొంతు నుంచి ముద్ద దిగని వైనం. ఇదీ నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా అవుతున్న మధ్యాహ్న భోజనం పరిస్థితి. నగరంలో మ«ధ్యాహ్న భోజనం  అధ్వానంగా తయారైంది. వాటిని సరఫరా చేసే ఏజెన్సీల తీరుతో విద్యార్థుల ఆకలి తీరకపోగా అనారోగ్యం పాలవుతున్నాయి. ప్రతిస్థాయిలోనూ అవినీతి తాండవిస్తోంది. తాజాగా కుళ్లిన కోడిగుడ్లను సరఫరా వెలుగు చూడడం ఆందోళన కలిగించింది.

పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడటం  మానవ హక్కుల ఉల్లంఘనే కాక పిల్లల ప్రాథమిక హక్కుల ఉల్లంఘించడమేనని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించి పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా అమలు కావాల్సిన మధ్యాహ్నా భోజన పథకం వారికి మరింత హానికరంగా  తయారైంది.
చదవండి: టీఆర్‌ఎస్‌ మహాధర్నా: స్టేజి కింద కూర్చున్న కేటీఆర్‌.. నాగలితో ఎమ్మె‍ల్యే 

నాసిరకంగా మెనూ 
మధ్యాహ్నా భోజనం నాసిరకంగా తయారైంది.  దొడ్డు బియ్యంతో వండిన అన్నం ముద్ద ముద్దగా ఉండటం. అందులోనూ రాళ్లు వస్తున్నాయి. చిన్న గుడ్డు, నాసిరకం పప్పు , చారు నీళ్లను తలపిస్తుండగా, కూరలు చారును మరిపిస్తున్నాయి. ఉడకని కూరగాయలు, రుచిపచీలేని వాటితో విద్యార్థులు తినలేకపోతున్నారు. సగం విద్యార్థులు దూరం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను లంచ్‌ టైమ్‌లో ఇళ్లకు రప్పించుకోవడమో...లేదంటే క్యారేజీలు కట్టివ్వడమో చేస్తున్నారు. మరోవైపు సరఫరా అవుతున్న భోజనం కూడా విద్యార్థులకు సరిపోని పరిస్థితి. 
చదవండి: విద్యార్థినుల హాస్టల్‌.. నీడలాగ ఒక ముఖం.. వింత శబ్దాలు..

హాజరు శాతం తక్కువ పేరుతో కనీసం 25 శాతం కూడా సరఫరా జరగడం లేదని స్పష్ట మవుతోంది. దీంతో  ఉదయమే పాఠశాలకు వస్తుండడం వల్ల టిఫిన్‌న్‌ తినలేని పిల్లలు మధ్యాహ్నం ఆకలితో తిందామన్నా అది సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. వారానికి మూడు గుడ్లు ఇవ్వాలని నిబంధన ఉన్నా... సరఫరా మాత్రం మొక్కుబడిగా తయారైంది. వారానికి ఒక్క గడ్డు పెట్టి చేతులు దులుపుకుంటున్నట్లు తెలుస్తోంది. 

లక్షకు పైగా విద్యార్థులు 
హైదారాబాద్‌ జిల్లాలో సుమారు 690 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో 1,06,676 మంది విద్య అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం హాజరుశాతం మాత్రం సగం మించనట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో మధ్యాహ్న భోజనం సరఫరా అవుతోంది. ఒక  ఫౌండేషన్‌కు సంబంధించిన ఏజెన్సీ నగరంలోని ప్రభుత్వ పాఠశాలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తోంది. అయితే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో కమ్మక్కై సరఫరాలో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.  

మధ్యాహ్న భోజనం ఖర్చు రోజుకు ఇలా.. 
► ప్రాథమిక పాఠశాల విద్యార్థికి: రూ.4.97 పైసలు 
► ఉన్నత పాఠశాల విద్యార్థికి రూ. 7.45 పైసలు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top