
అధిక ఆక్యుపెన్సీతో హైదరాబాద్ వందేభారత్ రైళ్లు
దేశంలోని టాప్ 10 సర్విసుల్లో చోటు
విశాఖపట్నంకు రెండు తిరుగుతున్నా 130 శాతం ఓఆర్
తిరుపతికి మరో సర్వీసు అవసరమని అధికారుల అంచనా
ఆక్యుపెన్సీలో నిరాశపరిచిన నాగ్‌పూర్ సర్వీసు
దీన్ని రద్దు చేసే యోచనలో రైల్వే బోర్డు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మీదుగా నడుస్తున్న వందేభారత్ రైళ్లు సూపర్ సక్సెస్ అయ్యాయ ని మరోసారి స్పష్టమైంది. ప్రయాణికుల ఆదరణ భారీగా ఉండటంతో ఇటీవలే వాటి కోచ్‌ల సంఖ్యను పెంచారు. అయినా, టాప్ ఆక్యుపెన్సీ రేషియోతో దూసుకుపోతున్నాయి. దీంతో విశాఖప ట్నం, తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలును నడిపేందుకు ఆస్కారం ఉందని అధికారులు తేల్చారు.
సాధారణ రైళ్లతో పోలిస్తే టికెట్ ధర చాలా ఎక్కువ కావటంతో దేశంలోని కొన్ని మార్గాల్లో వందేభారత్ రైళ్ల ఆదరణ స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ నుంచి నడుస్తున్న వందేభారత్ రైళ్లకు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రద్దీ నేపథ్యంలో కోచ్‌ల సంఖ్య పెంచగా, ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పెరిగింది.
దేశంలోనే టాప్ సర్విసులలో స్థానం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 136 వందేభారత్ సర్వీసులు నడుస్తున్నాయి. రాష్ట్రాల నుంచి డిమాండ్ల నేపథ్యంలో వాటి సంఖ్య పెంచేందుకు రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. దేశంలోని అన్ని రూట్లలో రైళ్లు 130 కి.మీ. వేగంతో దూసుకుపోయేలా ట్రాక్‌ల సామర్థ్యం పెంచుతున్నారు. కొన్ని కీలక రూట్లలో 160 కి.మీ. వేగానికి పెంచుతున్నారు. ఈ ట్రాక్ అప్‌గ్రెడేషన్ పనుల కారణంగా కొన్ని రూట్లలో వందేభారత్ రైళ్ల సగటు వేగం గంటకు 78 కి.మీ.కు తగ్గింది. దీంతో కొన్ని రూట్లలో ప్రయాణికుల ఆదరణ కూడా స్వల్పంగా తగ్గింది.
సాధారణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే వీటి టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం కూడా జనంలో కొంత ఆదరణ తగ్గేందుకు కారణమైంది. కానీ, హైదరాబాద్ నుంచి నడుస్తున్న నాలుగు వందేభారత్ రైళ్లు మాత్రం క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెంచుకుంటూ దేశంలోనే అత్యధిక ఆదరణ ఉన్న టాప్ 10 సర్విసుల్లో స్థానం పొందాయి. దక్షిణ మధ్య రైల్వే తొలి వందేభారత్ సర్వీసుగా 2023 జనవరి 15న సికింద్రాబాద్–విశాఖపట్నం వందేభారత్ రైలు మొదలైంది. 16 కోచ్‌లతో ప్రారంభమైన ఈ సర్వీసు ఆది నుంచి 140 శాతానికి మించిన ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తూ వచ్చింది. దీంతో 2024 మార్చిలో ఈ రెండు నగరాల మధ్య రెండో వందేభారత్ రైలును 8 కోచ్‌లతో ప్రారంభించారు.
రెండోది కూడా 135 శాతాన్ని మించిన ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తూ వచ్చింది. అప్పట్లో దేశంలో టాప్ 5 సర్వీసుల్లో ఒకటిగా ఇవి నిలిచాయి. దీంతో 2025 జనవరిలో తొలి సర్విసు కోచ్‌ల సంఖ్యను 20కి, రెండో సర్వీసు కోచ్‌ల సంఖ్యను 16కు పెంచారు. కోచ్‌లను భారీగా పెంచినా వీటి ఓఆర్ 130 శాతంగా నమోడవుతుండటం విశేషం. సికింద్రాబాద్–తిరుపతి మధ్య 2023 ఏప్రిల్ 8న ప్రారంభమైన సర్విసుకు 8 కోచ్‌లే ఉండటంతో ఆక్యుపెన్సీ రేషియో 133 శాతంగా ఉంటూ వచ్చింది.
కోచ్‌ల సంఖ్యను 2024 మేలో 16కు పెంచినా ఓఆర్ 120 శాతానికి మించి నమోదవుతోంది. దీంతో ఈ మార్గంలో మరో వందేభారత్ సర్విసు నడపాలన్న యోచనలో రైల్వే బోర్డు ఉంది. కాచిగూడ–బెంగళూరు(యశ్వంత్‌పూర్) మధ్య 2023 సెపె్టంబర్‌లో 8 కోచ్‌లతో ప్రారంభమైన వందేభారతసర్విసుకు 110 శాతాన్ని మించిన ఓఆర్ నమోదవుతూ వచ్చింది. దీంతో ఈ నెల 10న కోచ్‌ల సంఖ్యను 16కు పెంచారు. ఇప్పుడు దీని ఓఆర్ 80 శాతంగా ఉంది.
నాగ్ ‘పూర్’సర్వీసు..
సికింద్రాబాద్– పుణె మధ్య గతేడాదే వందేభారత్ రైలు మంజూరైంది. కానీ, అది పట్టాలెక్కకుండానే అనూహ్యంగా సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య సర్విసు ప్రారంభించారు. ప్రయాణికుల డిమాండ్‌తో సంబంధం లేకుండా రాజకీయ నేతల ఒత్తిడితో దీన్ని ప్రారంభించారు. దేశంలో 20 కోచ్‌లతో నడిచే రెండో సర్వీసుగా దీన్ని తిప్పటం ప్రారంభించారు. కానీ, ప్రయాణికుల ఆదరణ లేక ఆక్యుపెన్సీ రేషియో 30 శాతం మాత్రమే నమోదవుతూ వచ్చింది. దీంతో గత ఫిబ్రవరి 19 నుంచి ఒకేసారి కోచ్‌ల సంఖ్యను మూడోవంతుకు కు దించి 8 కోచ్‌లతో మాత్రమే నడుపుతున్నారు. మొత్తం ప్రయాణికులు ఆ 8 కోచ్‌లలోనే సర్దుకుంటుండటంతో ఆక్యుపెన్సీ రేషియో 70 శాతంగా నమోదవుతోంది.