Hyderabad: After 50 Years Tukaram Gate Railway Under Bridge Completed, Came Into Force - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: ఫలించిన యాభై ఏళ్ల కల! 

Mar 14 2022 3:00 PM | Updated on Mar 15 2022 2:19 PM

Hyderabad: Railway Under Bridge At Tukaram Gate Came Into Force - Sakshi

వాహనదారులకు అందుబాటులోకి వచ్చిన తుకారాంగేట్‌ రైల్వే వంతెన 

సాక్షి, సికింద్రాబాద్‌: ‘తుకరాంగేట్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద నిర్మించిన ఆర్‌యూబీ అమలులోకి వచ్చింది. యాభై సంవత్సరాలుగా ప్రతిపాదనలకే పరిమితం అయిన వంతెన కొద్ది రోజుల క్రితం అందుబాటులోకి వచ్చింది. 2018 జూలై నుంచి అందుబాటులోకి వచ్చిన ట్రాఫిక్‌ ఆంక్షలు తొలగిపోయాయి.  

► కరోనా తదితర సాంకేతిక సమస్యల కారణంగా జాప్యం జరిగి ఐదేళ్ల కాలంలో నిర్మాణం పనులు పూర్తయ్యాయి. కొద్ది రోజుల క్రితమే నిర్మాణం పూర్తయిన వంతెనను రాష్ట్ర మంత్రి కేటీ రామారావు, డిప్యూటీ స్పీకర్‌ టీ.పద్మారావుగౌడ్‌ వాహనాల రాకపోకలకు పచ్చజెండా ఊపారు. 

► ఐదు దశాబ్దాలుగా ఎన్నికల నినాదంగా మారిన వంతెన నిర్మాణం పనులు పూర్తయి అందుబాటులోకి రావడంతో తుకారాంగేట్‌ పరిసర ప్రాంతాల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. రైల్వే వంతెన అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలకు సమూలంగా పరిష్కారం లభించినట్టయింది.  
చదవండి: ఇటుక అండగా.. ఇల్లు చల్లన! కూల్‌ బ్రిక్స్‌ తయారీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

26 సార్లు గేట్‌ పడేది...  
► సికింద్రాబాద్‌ నుంచి లాలాపేట్, మల్కాజిగిరి ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు తుకారాంగేట్‌ రహదారి ఒక్కటే పెద్దదిక్కుగా ఉంది. నిత్యం లక్ష వాహనాల రాకపోకలు ఈ దారిగుండా ఉంటున్నట్టు ట్రాఫిక్‌ పోలీసులు అంచనా వేస్తున్నారు. 

► తుకారాంగేట్‌ రైల్వే క్రాసింగ్‌ మీదుగా నిత్యం వంద వరకు రైళ్ల రాకపోకలు ఉంటున్నాయి. ప్రతీ 40 నిమిషాలకు ఒకమారు లెవల్‌ క్రాసింగ్‌ వద్ద గేటు వేసేవారు. మొత్తంగా రోజుకు 20 నుంచి 26 సార్లు గేటు పడుతుండడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయేవి.  

► రూ.20.10 కోట్ల వ్యయంతో తుకారాంగేట్‌ ఆర్‌యూబీ నిర్మాణం పనులు పూర్తి చేశారు. జీహెచ్‌ఎంసీ, దక్షిణ మధ్యరైల్వేలు సంయుక్తంగా వంతెనను నిర్మించారు. జీహెచ్‌ఎంసీ రూ.15.14కోట్లు, రైల్వేశాఖ రూ. 13.95 కోట్లు విడుదల చేయడం ద్వారా నిర్మాణం పనులు పూర్తి చేశారు.
చదవండి: వినూత్న ‘పెండ్లిపత్రిక’.. పారేయకండి.. మట్టిలో పాతిపెడితే.. 

ట్రాఫిక్‌ మళ్లింపులకు తెర  
► వంతెన నిర్మాణం పనులు ప్రారంభం అయిన కొద్ది రోజుల ముందు నుంచి తుకారాంగేట్‌ రహదారి మీదుగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. సికింద్రాబాద్‌ నుంచి తుకారాంగేట్‌ రైల్వేగేట్‌ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనాలను ఇతర మార్గాల మీదుగా మళ్లించారు.

► నాలుగు సంత్సరాల అనంతరం తుకారాంగేట్‌ రైల్వే వంతెన మీదుగా వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. మల్కాజిగిరి, మౌలాలి, నేరెడ్‌మెట్‌ తదితర ప్రాంతాల వాహనదారులకు ట్రాఫిక్‌ సమస్యలు తప్పాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement