Lockdown: సిటీలో ‘పరిధి’ దాటొద్దు!

Hyderabad Police Focus On Lockdown And Restrictions For City People - Sakshi

నిత్యావసర వస్తువుల కోసమే బయటకు రండి 

సిటీలో ప్రతి మూడు కి.మీ.కి బారికేడ్లు, చెక్‌పోస్టులు 

నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలు సీజ్‌ 

పాసుల కోసం ఠాణాలు, కమిషనరేట్లకు రావద్దు 

స్పష్టం చేసిన మూడు కమిషనరేట్ల అధికారులు 

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మూడు కమిషనరేట్లకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలకు చెందిన శాంతిభద్రతల విభాగం అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు సమన్వయంతో పని చేయనున్నారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్, ప్రధాన రహదారులతో కలిపి మొత్తమ్మీద 346 చెక్‌ పోస్టులు, మరికొన్ని చోట్ల బారికేడ్లు ఉండనున్నాయి. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉంది. అయితే ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ తాము నివసిస్తున్న పోలీసుస్టేషన్‌ పరిధి దాటి వెళ్లద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ప్రతి మూడు కిలోమీటర్లకు ఉండే చెక్‌ పోస్టులు, గస్తీ బృందాలు ఇలా వెళ్లేవారిని గుర్తించి చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. నిర్ణీత సమయాన్ని మించి రోడ్లపైకి వస్తే వాహనాలను స్వాధీనం చేసుకుంటారు. వాహనచోదకులపై కేసులు నమోదు చేయనున్నారు. అత్యవసర సేవల ఉద్యోగులు, అనుమతి ఉన్న పనులపై వెళ్తున్న వారిని మాత్రమే ముందుకు పంపిస్తారు. ద్విచక్ర వాహనాలు, తేలికపాటి వాహనాల్లో ప్రయాణిస్తున్నవారు ఖతంగా మాస్క్‌లు ధరించాలని స్పష్టం చేస్తున్నారు.

మూడు కమిషనరేట్లలో కరోనా నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల్ని వివరిస్తూ, లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించాలని నిర్ణయించారు.  పోలీసులకు సెలవులు రద్దు చేశారు. బుధవారం నుంచి కేవలం 5 శాతం మంది పోలీసులు మాత్రమే ఠాణాల్లో ఉండనున్నారు. మిగిలిన వాళ్లు రహదారులపైకి వచ్చి పహారా కాయనున్నారు. లాక్‌డౌన్‌ ప్రకటనకు ముందే బయలుదేరిన అనేక బస్సులు, రైళ్లు బుధ, గురు వారాల్లో సిటీకి చేరుకోనున్నాయి.

ఇలా ఇతర ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు వచ్చిన వారికి సహకరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా అత్యవసరమైన, అనుమతి ఉన్న అంశాలకు సంబంధించిన వ్యక్తులు, వాహనాలకు ప్రత్యేక పాస్‌లు జారీ చేయాలని భావిస్తున్నారు. దీనికోసం ఎక్కడికక్కడ హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. 

లాక్‌ డౌన్‌ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు 
నగరంలో లాక్‌ డౌన్‌ అమలు పర్యవేక్షణకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను జోన్ల వారీగా నియామిస్తూ కొత్వాల్‌ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అధికారులు ఆయా మండలాలకు నేతృత్వం వహించనున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా వీరు ఎప్పటకప్పుడు చర్యలు చేపడతారు. పరిస్థితులను పర్యవేక్షిస్తారు. 

  •  షిఖా గోయల్‌ (అదనపు సీపీ): తూర్పు మండలం 
  • అనిల్‌ కుమార్‌ (అదనపు సీపీ): మధ్య– పశ్చిమ మండలాలు 
  • డీ ఎస్‌ చౌహాన్‌ (అదనపు సీపీ): దక్షిణ మండలం 
  •  అవినాష్‌ మహంతి (సంయుక్త సీపీ) : ఉత్తర మండలం 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top