Hyderabad: కుండపోత.. సిటీలో రోజంతా వర్షం.. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు

Hyderabad: Heavy Rains Day Roads Filled Water - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఎడతెరిపి లేని వాన కురిసింది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి తలెత్తింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మలక్‌పేట, ఎల్బీనగర్, కొత్తపేట, చార్మినార్, రాజేంద్రనగర్, నాగోల్‌ వంటి ప్రాంతాలలో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. పలు చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఒకవైపు జోరు వాన, మరోవైపు చీకటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శిథిలావస్థలో ఉన్న భవనాల చుట్టు ప్రక్కల స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

నగరంలోని చాలా ప్రాంతాలలో ఫైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మాణ పనులు జరుగుతుండటంతో రహదారులను తవ్వారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆయా గుంతలన్నీ వరద నీటితో మునిగిపోయాయి. ఎక్కడ రోడ్డు ఉందో.. ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు భయం భయంగా ప్రయాణించారు. వరద నీరు రోడ్లపైకి భారీగా చేరడంతో చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో మునిగిపోయాయి. నాలాలు పొంగిపొర్లాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.  

కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జాం.. 
వారాంతం కావటంతో సొంతూర్లకు ప్రయాణమయ్యేందుకు బయలుదేరిన నగరవాసులకు వర్షం అడ్డుపడింది. దీంతో రోడ్లపై వాహనాలతో ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. వరంగల్, విజయవాడ జాతీయ రహదారులపై వాహనాలు కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. చాలా ప్రాంతాలలో పోలీసులు ముందు జాగ్రత్తగా రహదారులను మూసివేసి వాహనదారులను అప్రమత్తం చేశారు.  

అప్రమత్తంగా ఉండండి: మేయర్‌ 
నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సూచించారు. శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుందని, మరో రెండు రోజులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైన పక్షంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయక కేంద్ర నంబర్‌ 040–21111111 ను సంప్రదించాలని ప్రజలను కోరారు.

చదవండి: నష్టాల్లోంచి ఆర్టీసీ బయటకొస్తోంది! 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top