నష్టాల్లోంచి ఆర్టీసీ బయటకొస్తోంది!

TSRTC To Start Services From Nizamabad To Tirupati For Tirumala Devotees - Sakshi

టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌  

ఖలీల్‌వాడి: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు బస్‌ టికెట్‌తోపాటే తిరుమల శీఘ్ర దర్శన టోకెన్‌ అందిస్తున్నామని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. తెలంగాణ నుంచి తిరుమల తిరుపతికి వెళ్లే బస్సులను నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్‌ వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా బాజిరెడ్డి మాట్లాడుతూ...తెలంగాణ నుంచి తిరుపతికి ఆర్టీసీ రోజూ 30 బస్సులు నడపనున్నట్లు తెలిపారు.

ప్రయాణికులకు రోజుకు 1000 శ్రీఘ్ర దర్శన టోకెన్లను జారీ చేయనుందని, వీటిని టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ లేదా అధీకృత డీలర్‌ ద్వారా కనీసం 7 రోజుల ముందుగా పొందవచ్చని చెప్పారు. ప్రభుత్వం ఆర్టీసీకీ అండగా ఉంటుందని, సీఎం కేసీఆర్‌ సహకారంతో త్వరలోనే పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించనున్నట్లు తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి సీఎం కేసీఆర్‌ ఈ వార్షిక బడ్జెట్లో రూ.1500 కోట్లను కేటాయించారని, సంస్థ ఇప్పుడిప్పుడే నష్టాల్లోంచి బయటకు వస్తోందని వెల్లడించారు.

కారుణ్య నియామకాల ద్వారా ఆర్టీసీలో త్వరలోనే 1200 సిబ్బందిని విడతల వారీగా నియమిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న ఆర్టీసీ ఆసుపత్రిని కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ఆధునిక  వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అతి త్వరలోనే ఫార్మసీలను కూడా ప్రారంభిస్తామన్నారు. ప్రజలు ఆర్టీసీకి సహకారం అందించాలని బాజిరెడ్డి గోవర్ధన్‌ కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top