సీఎస్సార్‌ నిధులతో ఖైథలాపూర్‌లో ప్లాంట్‌

Hyderabad: GHMC to Set up 20 Ton Biogas Plant at Kukatpally - Sakshi

రూ.4 కోట్లు ఇచ్చేందుకు హెచ్‌ఏఎల్‌ అంగీకారం

స్వచ్ఛ ఆటోలకు ఉచితంగా సరఫరా  

సాక్షి, హైదరాబాద్‌: వ్యర్థం నుంచి అర్థం సృష్టించే చర్యల్లో మరో ముందడుగు పడనుంది. ఇప్పటికే  చెత్త నుంచి విద్యుత్‌తో పాటు వాహనాల ఇంధనంగా వినియోగించే కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) ఉత్పత్తి చేస్తున్న హైదరాబాద్‌ మహానగరంలో సీఎన్‌జీ ఉత్పత్తికి మరో ప్లాంట్‌ ఏర్పాటు కానుంది. ఇందుకు అవసరమైన నిధుల్ని కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్‌) కింద బాలానగర్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) అందజేయనుంది. బయోవేస్ట్‌ నుంచి కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ ఉత్పత్తి చేసేందుకు ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ వి.మమత చేసిన విజ్ఞప్తికి హెచ్‌ఏఎల్‌ సానుకూలంగా స్పందించింది. 

ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన రూ. 3 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో, పనుల పురోగతిని బట్టి మరో  కోటి రూపాయలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో అందజేసేందుకు కంపెనీ మేనేజ్‌మెంట్‌ సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి జీహెచ్‌ఎంసీకి పంపిన ముసాయిదా ఎంఓయూలో ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తయ్యే సీఎన్‌జీని నగరంలో ఇంటింటి నుంచి చెత్తను సమీపంలోని చెత్త రవాణా కేంద్రాలకు రవాణా చేస్తున్న స్వచ్ఛ ఆటోలకు  ఉచితంగా పంపిణీ చేయాలని సూచించింది. సీఎన్‌జీ ఉత్పత్తి ప్రక్రియలో చివరకు మిగిలే ఎరువును జీచ్‌ఎంసీ నర్సరీల్లో వినియోగించడంతో పాటు కోరుకునే ప్రజలకు, రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలని కోరింది.  

బల్దియాకు తగ్గనున్న నిర్వహణ భారం 
కూకట్‌పల్లి జోన్‌లోని ఖైథలాపూర్‌ చెత్త రవాణా కేంద్రంలో బయోగ్యాస్‌ నుంచి సీఎన్‌జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. 20 టన్నుల బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను అక్కడ ఏర్పాటు చేయనున్నారు. రవాణా కేంద్రానికి వచ్చే చెత్త నుంచి వేరు చేసే 200– 300 మెట్రిక్‌ టన్నుల మేర  బయోవేస్ట్‌ను సీఎన్జీ  ఉత్పత్తికి వినియోగించనున్నారు. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌కమిటీ ఆమోదం లభించగానే ప్లాంట్‌ ఏర్పాటుకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. 

ఇప్పటికే.. 
జవహర్‌నగర్‌లోని సైంటిఫిక్‌ ల్యాండ్‌ఫిల్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తితోపాటు, సీఎన్‌జీ ఉత్పత్తి కూడా ప్రారంభించడం తెలిసిందే. సిలిండర్‌లలో నింపిన సీఎన్‌జీని వాహన ఇంధనంగా వినియోగిస్తున్నారు. (క్లిక్‌: పెట్రోల్, డీజిల్‌ ‘కట్‌’కట)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top