పిల్లలు కావాలా?.. సక్సెస్‌ రేటు కోసం సంతాన సాఫల్య కేంద్రాల అడ్డదారులు

Hyderabad: Fertility Centers Frauding For Success Rate - Sakshi

ఉన్నత చదువులు.. ఉపాధి  అవకాశాలు.. ఆలస్యపు పెళ్లిళ్లు.. ఆ తర్వాత భర్త నైట్‌ షిఫ్ట్‌లో పని చేస్తే.. భార్య పగలు విధులు నిర్వహించడం వెరసీ.. యువ దంపతుల్లో సంతానలేమి సమస్యకు కారణమవుతోంది. దీంతో పిల్లల కోసం సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. దంపతుల్లో ఉన్న ఈ బలహీనతను వైద్యులు సొమ్ము చేసుకుంటున్నారు. వీర్యకణాల సేకరణ.. అండాల అభివృద్ధి పేరుతో అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకు ఒంటరి పేద మహిళల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు.  గ్రేటర్‌ పరిధిలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. 

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ, అనుబంధ సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులకు గ్రేటర్‌ శివారు జిల్లాలు కేంద్ర బిందువుగా మారాయి. ముఖ్యంగా ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్స్‌ పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడ, హైటెక్‌ సిటీ, శేర్‌లింగంపల్లి, కోకాపేట్, నార్సింగి, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీలు గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ సహా కీలక ఐటీ అనుంబంధ సంస్థలన్నీ ఇక్కడి నుంచే కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. వీటిలో ప్రత్యక్షంగా ఏడు లక్షల మంది యువత.. పరోక్షంగా మరో పది లక్షల మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. వీరిలో మెజారిటీ ఉద్యోగులు 35 ఏళ్లలోపు వారే. వీరంతా ఉన్నత చదువులు, ఉపాధి వేటలో పడి వివాహాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. 

రేడియేషన్‌ ఎఫెక్ట్‌.. 
మూడు పదుల వయసు దాటిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. మారిన జీవన శైలికి తోడు ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యం, మాంసాహారాలను అధికంగా తీసుకోవడం, రాత్రి వేళల్లో ఎక్కువ సేపు మేల్కొని ఉండటం, శరీరానికి సరైన వ్యాయామం కూడా లేకపోవడంతో హార్మోన్ల సమతుల్యతలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాదు.. రోజంతా ఒడిలనే ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్‌లు పెట్టుకుని కూర్చొవడం వల్ల వాటి నుంచి వెలువడే రేడియేషన్‌తో యువతీ యువకుల్లో అండాలు, వీర్యకణాలు దెబ్బతింటున్నాయి.  

యుక్త వయస్కుల్లో ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా.. వాటి నాణ్యత అంతంతే. ఫలితంగా ఆయా దంపతుల్లో సంతానలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లల కోసం వీరంతా సమీపంలోని సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. గైనకాలజిస్టులు వీరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సరోగసీ విధానంపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఇన్‌ విట్రో ఫెర్టిలేజేషన్‌ (ఐవీఎ‹ఫ్‌) ఇంట్రా యుటిరైన్‌ ఇన్‌సెమినేషన్‌ (ఐయూఐ)వంటి పద్ధతులను సూచిస్తున్నారు.    

మహిళల ఆరోగ్యంతో చెలగాటం..  
గ్రేటర్‌ పరిధిలో సుమారు 200 ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నట్లు అంచనా. వీటిలో ఎక్కువగా కూకట్‌పల్లి, మియాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, సోమాజిగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, మాదాపూర్, శేర్‌లింగంపల్లి, మియాపూర్, నార్సింగి, గచ్చిబౌలి, శంషాబాద్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మణికొండ, కోకాపేట్, నార్సింగి, పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. వీటిలో పలు ఫెర్టిలిటీ సెంటర్లు సక్సెస్‌ రేటు కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి. పిల్లలు కావాలనే ఆశతో వచి్చన యువ దంపతుల్లో ఉన్న బలహీనతను వీరు క్యాష్‌ చేసుకుంటున్నాయి. ప్రభుత్వం సరోగసీ విధానంపై కఠినమైన ఆంక్షలు విధించడంతో ఐవీఎఫ్, ఐయూఐ పేరుతో కొత్త దందాకు తెరతీశాయి.  

చికిత్స చేసినా పిల్లలు పుట్టేందుకు అవకాశం లేని దంపతులకు ఎలాగైనా పిల్లలను కలిగించి, ఫెర్టిలిటీ సెంటర్‌కు, చికిత్స చేసిన వైద్యులకు మార్కెట్లో మంచి గుర్తింపు తీసుకురావాలని భావిస్తున్నారు. చాలా వరకు మందులతోనే మంచి రిజల్ట్‌ వస్తుంది. మందులు వాడినా ప్రయోజనం లేని దంపతులకు దాతల నుంచి సేకరించిన అండాలు, వీర్య కణాలను ఆశ చూపుతున్నారు. ఇందుకు ఏ తోడూ లేని ఒంటరి పేద మహిళలను ఎంచుకుని వారికి మాయమాటలు చెబుతున్నారు. వైద్య పరీక్షలు, అండాలు, వీర్యకణాల వృద్ధి పేరుతో మోతాదుకు మించి ఇంజక్షన్లు ఇచ్చి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. తీరా అనారోగ్య సమస్యలు తలెత్తిన తర్వాత గుట్టుగా అక్కడి నుంచి జారుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌ జిల్లా పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ఫెర్టిలిటీ సెంటర్‌లో వెలుగు చూసిన ఘటనే ఇందుకు నిదర్శనం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top