అలనాటి వైభవానికి ఆటంకాలెన్నో.. డబుల్‌ డెక్కర్లేవి?

Hyderabad: Double Decker Bus Roaming On City Roads Delay - Sakshi

పర్యాటక ప్రాంతాలపై పూర్తికాని సర్వే  

ఆ మూడు బస్సులతోనే సరి

ఇంకా అందుబాటులోకి రాని మరో మూడు బస్సులు  

సాక్షి, హైదరాబాద్‌: నిజాం కాలం నాటి డబుల్‌ డెక్కర్‌  బస్సుల వైభవాన్ని తలపించేలా హెచ్‌ఎండీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్‌ డెక్కర్‌ ఎలక్ట్రిక్‌ బస్సులు నగరవాసులకు, పర్యాటకులకు ఇంకా దూరంగానే ఉన్నాయి. నగరంలోని పర్యాటక ప్రదేశాలు, చారిత్రక ప్రాంతాలను సందర్శించేందుకు అనుగుణంగా ఈ బస్సులను నడపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 6 బస్సులతో డబుల్‌ డెక్కర్‌ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఫార్ములా– ఈ సందర్భంగా 3 బస్సులను మాత్రం పరిచయం చేశారు. ఇంకా మరో 3 బస్సులు అందుబాటులోకి రావాల్సి ఉంది. మరోవైపు ఈ బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా దశలవారీగా 30 డబుల్‌ డెక్కర్‌ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు  మంత్రి కేటీఆర్‌  తెలిపారు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న మూడు బస్సులు మాత్రం పీపుల్స్‌ ప్లాజాకే పరిమితమయ్యాయి. అప్పుడప్పుడు  ట్యాంక్‌బండ్‌పై మాత్రం వీటిని  ప్రదర్శిస్తున్నారు.  


కొరవడిన స్పష్టత.. 

నాలుగు వందల ఏళ్ల నాటి హైదరాబాద్‌ చారిత్రక కట్టడాలను సందర్శించే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకొనే విధంగా చార్మినార్, గోల్కొండ కోట, గోల్కొండ టూంబ్స్, చౌమొహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా వంటి ప్రాంతాలతో పాటు ట్యాంక్‌బండ్, బొటానికల్‌ గార్డెన్, కేబుల్‌బ్రిడ్జి, నెక్లెస్‌ రోడ్డు, లుంబిని పార్కు, పీపుల్స్‌ప్లాజా, గండిపేట్, జూపార్కు తదితర ప్రదేశాలను సందర్శించేందుకు అనుగుణంగా ఈ బస్సులను నడపాలని హెచ్‌ఎండీఏ భావించింది. కానీ.. వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించేందుకు ఇప్పటివరకు ఎలాంటి రూట్‌ సర్వేలు  నిర్వహించకపోవడం గమనార్హం.

బస్సులను ఏ రూట్‌ నుంచి ఏ రూట్‌లో, ఏయే ప్రదేశాలకు నడపవచ్చనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు పలు మార్గాల్లో బస్సులను నడిపేందుకు కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని మున్సిపల్‌ శాఖ అధికారి ఒకరు తెలిపారు. మార్చి మొదటి వారం నుంచే ఈ బస్సులను ప్రయాణికులకు, పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని  భావించారు. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. వేసవి సెలవుల దృష్ట్యా ఈ బస్సులు పిల్లలు, పెద్దలను విశేషంగా ఆకట్టుకొనే అవకాశం ఉంది.  

బస్సులు నడిపేదెవరు... 
మరోవైపు ఈ డబుల్‌ డెక్కర్‌ ఎలక్ట్రిక్‌  బస్సులను హెచ్‌ఎండీఏ సొంతంగా నిర్వహిస్తుందా లేక ఆర్టీసీ, టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వంటి సంస్థలకు  నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తుందా అనే అంశంలోనూ  ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు తయారు చేసిన ఈ బస్సులను ఒకొక్కటి రూ.2.16 కోట్ల చొప్పున  హెచ్‌ఎండీఏ కొనుగోలు చేసింది. మొదటి దశలో వచ్చిన మూడింటితో పాటు మరో మూడు బస్సులు ఈ నెలలోనే వస్తాయని అధికారులు చెబుతున్నారు. రూ.కోట్లు వచ్చించి బస్సులను కొనుగోలు చేసినప్పటికీ  వినియోగంలోకి  రాకపోవడం గమనార్హం. వీకెండ్స్‌లో మాత్రం  అప్పుడప్పుడు ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ఈ బస్సులు కనువిందు చేస్తున్నాయంతే.

      

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top