హైదరాబాద్‌లో వెలుగులోకి ‘దొంగ–పోలీసు–దోస్తీ’  వ్యవహారాలు 

Hyderabad: CV Anand Focus On Police Who Cooperating To Criminals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమ ముఠా కోల్పోయిన సొమ్ము, సొత్తు కోసం పరిధులు సృష్టించి మరీ కేసు నమోదు చేసిన అధికారి ఒకరైతే... కానిస్టేబుల్‌ పైరవీ చేయడంతో ఓ పిక్‌ పాకెటర్‌ను విడిచిపెట్టిన అధికారి మరొకరు... నల్లగొండలో జైలుకు వెళ్లిన కానిస్టేబుల్‌ ఈశ్వర్‌ వ్యవహారంతో నగర పోలీసు విభాగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో దొంగలతో మిలాఖత్‌ అయిన, వారికి సహకరిస్తున్న పోలీసుల వ్యవహారాలను వెలికితీస్తోంది. ఇప్పటికే కొందరు అధికారులు, సిబ్బంది చేసిన దందాలను గుర్తించారు. వీటిని తీవ్రంగా పరిగణిస్తున్న కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.  

తక్షణం మారిపోయిన సీన్‌.. 
చట్ట ప్రకారం నేరం ఎక్కడ జరిగితే కేసు ఆ పరిధిలోకి వచ్చే ఠాణాలోనే నమోదు చేయడమో, జీరో ఎఫ్‌ఐఆర్‌ కట్టి అక్కడికి బదిలీ చేయడమో జరగాలి. సామాన్యులు తీవ్రంగా నష్టపోయిన అంశాల్లోనూ పోలీసులు ఇదే చేస్తుంటారు. ఈ ‘బాధిత ముఠా’ కోసం సదరు అధికారి ఆ నిబంధనను తుంగలో తొక్కారు. ఈ గ్యాంగ్‌కు చెందిన ఓ వ్యక్తి వెస్ట్‌ జోన్‌ పరిధిలో ఉండగా గుట్ట వరకు ఎత్తుకుపోయారు అనే మెలిక పెట్టారు.

దీంతో కేసు పరిధి పశ్చిమ మండలంలోని ఠాణాకు మారిపోయింది. ఈ కేసు ‘దర్యాప్తు’ చేసిన సదరు అధికారి అవతలి ముఠాను పట్టుకుని రూ.20 లక్షల వరకు ‘రికవరీ’ చేసి ‘బాధితులకు’ అందించాడు. తన వాటాగానూ పెద్ద మొత్తమే తీసుకున్నాడు. ఇది ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. 

గుట్ట వ్యవహారం వెస్ట్‌కు వచ్చింది..  
2019లో యాదగిరిగుట్టలో జరిగిన ఓ వివాదానికి సంబం«ధించిన కేసు నగరంలోని వెస్ట్‌జోన్‌ పరిధిలో ఉన్న ఓ ఠాణాలో నమోదైంది. ఈ కేసును ‘పరిష్కరించిన’ సదరు అధికారి రూ.10 లక్షలకు పైగా ‘రికవరీ’ చేసి తమ ముఠాకు అప్పగించాడు. 2018–19ల్లో రెండు పిక్‌ పాకెటింగ్‌ గ్యాంగ్స్‌ యాదగిరిగుట్ట పరిధిలో విరుచుకుపడ్డాయి. డబ్బు పంపకాలకు సంబంధించి వీటి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.

దీంతో ఓ గ్యాంగ్‌పై దాడి చేసిన మరో గ్యాంగ్‌ మొత్తం సొమ్ము కాజేసింది. ఈ ‘బాధిత గ్యాంగ్‌’తో అప్పట్లో పశి్చమ మండల పరిధిలోని ఓ ఠాణాలో పని చేసిన ఇన్‌స్పెక్టర్‌కు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. వాళ్లు వచ్చి జరిగిన విషయం ఈయనకు చెప్పడంతో వీళ్లకు రావాల్సిన డబ్బు రికవరీ కోసం భారీ స్కెచ్‌ వేశాడు. 

పిక్‌ పాకెటర్‌ నుంచి రూ.3 లక్షలు వసూలు.. 
ఈ అధికారి వ్యవహారం ఇలా ఉండగా.. మరో అధికారి ఏకంగా తన కార్యాలయంలోనే సెటిల్‌మెంట్‌ చేశారు. పక్షం రోజుల క్రితం ఈ ఉదంతం చోటుచేసుకుంది. నందనవనం ప్రాంతానికి చెందిన ఓ పిక్‌ పాకెటర్‌ను నగర పోలీసు కమిషనరేట్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ నాగోల్‌ వద్ద పట్టుకున్నారు. ఇతగాడిని తమ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారించడానికి సిద్ధమయ్యారు.

ఈలోపు విషయం తెలుసుకున్న ఓ ‘పోలీసు దొంగ’ రంగంలోకి దిగాడు. ఆ పిక్‌ పాకెటర్‌ను విడిచిపెట్టడానికి రూ.2 లక్షలు అధికారికి ఇచ్చేలా, వేరే ఇద్దరు నేరగాళ్లకు పట్టిచ్చేలా సెటిల్‌మెంట్‌ చేశాడు. ఇది తెలుసుకున్న కానిస్టేబుల్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సెటిల్‌మెంట్‌లో ఇవ్వాల్సిన మొత్తం రూ.3 లక్షలకు పెరిగి ముగ్గురికీ గిట్టుబాటైంది. 

కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్న కొత్వాల్‌..  
నగరంలో ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ప్రస్తుతం లేవు. నగర పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇవి పూర్తిగా మారిపోయాయి. సంస్కరణలకు పెద్దపీట వేస్తున్న ఆయన వీలున్నంత వరకు సిబ్బందికి ఏ లోటు లేకుండా చేస్తున్నారు. అదే సమయంలో క్రమశిక్షణారాహిత్యం, పోలీసు విభాగానికి మచ్చ తెచ్చే పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించట్లేదు. ఈ నేపథ్యంలోనే గడచిన ఏడాది కాలంలో పదులు సంఖ్యలో అధికారులు, సిబ్బందిపై వేటు పడింది. ఈ పోలీసు దొంగల దోస్తీ వ్యవహారాన్నీ ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. లోతైన విచారణ చేయిస్తుండటంతో ఈశ్వర్‌తో పాటు ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, అయిదుగురు కానిస్టేబుళ్ల వ్యవహారాలు బయటపడినట్లు తెలిసింది. వీరిలో కొందరు కీలక విభాగంలోనూ పని చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వారిపై నివేదికల ఆధారంగా ఉద్వాసన చెప్పాలని కూడా కొత్వాల్‌ ఆనంద్‌ నిర్ణయించినట్లు సమాచారం.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top