Tarun Kappala: అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. ఇక్కడ అంబులెన్స్‌ డ్రైవర్‌గా..

Hyd: Nri Software Employ Turned Ambulance Driver Covid 19 Pandemic - Sakshi

అంబులెన్స్‌ డ్రైవర్‌గా ఎన్నారై.. 

సేవలందిస్తున్న యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తరుణ్‌ కప్పల 

ఆపన్నులకు అండగా ఆహారం, నిత్యావసర వస్తువులు  

సాక్షి, హైదరాబాద్‌: అవును అతడు రెక్కలు కట్టుకొని వచ్చాడు. తన వాళ్ల కోసమే కాదు. తన తల్లి లాంటి ఎంతో మంది తల్లుల కోసం. మరెందరో తన చెల్లెల్లాంటి తోబుట్టువుల కోసం అమెరికా నుంచి వచ్చేశాడు. డెల్లాయిట్‌కు చెందిన ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ నిపుణుడిగా, ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్న తరుణ్‌ కప్పల ఇప్పుడు ఒక అంబులెన్స్‌ డ్రైవర్‌ కూడా. కోవిడ్‌ మహమ్మారిపైన అలుపెరుగని యుద్ధం చేస్తున్న వందలాది మంది సైనికుల్లో అతడు సైతం ఒక సైనికుడిగా నిలిచాడు.

కోవిడ్‌ బాధితులు ఎక్కడుంటే అక్కడ ఠకీమని వాలిపోతాడు. స్వయంగా అంబులెన్సులో తీసుకెళ్లి ఆస్పత్రుల్లో చేర్పిస్తాడు. కోవిడ్‌ పేషెంట్‌లు వార్డుల్లో ఉన్నా. ఐసీయూల్లో ఉన్నా వెళ్లి పలకరిస్తాడు. ‘నేనున్నానంటూ భరోసానిస్తాడు. మీకేం కాదంటూ ’మాటలతో ధైర్యాన్ని నూరిపోస్తాడు. తరుణ్‌ అంబులెన్స్‌ రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉంటుంది. హైదరాబాద్‌లో ఏ మారుమూల ప్రాంతంలో కోవిడ్‌ బాధితులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిసినా వెంటనే వెళ్లిపోతాడు. ‘సకాలంలో ఆస్పత్రికి చేర్చినప్పుడు, పేషెంట్‌లు కోలుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నప్పడు గొప్ప సంతృప్తి కలుగుతుంది. ఈ జీవితానికి అది చాలు అనిపిస్తుంది.’ అంటూ వినయంగా చెబుతాడు తరుణ్‌. 
 
సేవే దైవంగా... 
శ్రీనగర్‌ కాలనీకి చెందిన తరుణ్‌ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. టెక్సాస్‌ వర్సిటీలో చదువుకున్నాడు. డెల్లాయిట్‌లో ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో చేరాడు. గతేడాది కోవిడ్‌ మహమ్మారి బారిన పడిన ప్రపంచం చిగురుటాకులా వణుకుతున్న సమయంలో అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో ఇండియాకు వచ్చే విద్యార్ధులకు అండగా నిలిచాడు. సొంత ఊళ్లకు వెళ్లేందుకు అన్ని విధాలుగా సహకరించాడు. ‘ఆ సమయంలోనే మా అమ్మ హైదరాబాద్‌లో ఇంట్లో జారిపడింది. వెన్నెముక దెబ్బతిన్నది. సర్జరీ చేయవలసి వచ్చింది. ఇక నేను హైదరాబాద్‌కు వచ్చాను. మధ్యలో అమ్మకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

కొద్ది రోజుల్లో అమెరికాకు తిరిగి వెళ్లిపోవచ్చుననుకుంటున్న సమయంలో సెకెండ్‌ వేవ్‌ ఉధృతి మొదలైంది. చాలా భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పరిస్థితులే నా బాధ్యతను కూడా గుర్తు చేశాయి’ అంటారు తరుణ్‌. ‘ఆస్పత్రులన్నీ కోవిడ్‌ పేషెంట్‌లతో నిండిపోతున్నాయి. అంబులెన్సులు నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. అమెరికాలోనే ఉంటున్న తన స్నేహితుడి చెల్లెల్ని గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రూ.15 వేలు ఖర్చు చేయవలసి వచ్చింది. ఇలాంటి సంఘటనలు చాలా బాధ కలిగించాయి. ఆ సమయంలోనే అమెరికాలో ఉన్న నా స్నేహితుల సహాయంతో సేవా కార్యక్రమాలు ప్రారంభించాను. ఎథ్నె అనే ఓ స్వచ్చంద సహకారంతో మారుతీ ఓమ్ని వ్యాన్‌ కొనుగోలు చేసి ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న అంబులెన్సుగా మార్చాను. ఇప్పటి వరకు 4 వేల కిలోమీటర్‌లకు పైగా తిరిగాను. వందలాది మందిని ఆస్పత్రుల్లో చేర్చాను. దురదృష్టవశాత్తు చనిపోయిన వారి మృతదేహాలను శ్మశానాలకు తీసుకెళ్లాను’ అని చెప్పారు. 

చదవండి: ‘డాడీ.. లేడాడీ.. నాతో మాట్లాడు... ఏమైంది అంకుల్‌ నాన్నకు..’

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top