‘డాడీ.. లేడాడీ.. నాతో మాట్లాడు... ఏమైంది అంకుల్‌ నాన్నకు..’

Nalgonda: Private School Principal Deceased Coronavirus Nakrekal - Sakshi

సాక్షి, నల్గొండ( నకిరేకల్‌ ) : ‘డాడీ.. లేడాడీ.. నాతో మాట్లాడు డాడీ... మా డాడీకి ఏమైంది అంకుల్‌..’ అంటూ పదేళ్ల చిన్నారి అవంతిక తన తండ్రి మృతదేహాన్ని చూపిస్తూ రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. కరోనా మహమ్మారి కాటుకు ఓ ప్రైవేట్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ మరణించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. తాటికల్‌ గ్రామానికి చెందిన చెనగాని రమేశ్‌ (43) చండూరులోని కృష్ణవేణి స్కూల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు.

కరోనాతో ఏడాదిగా స్కూల్‌ బంద్‌ కావడంతో స్వగ్రామమైన తాటికల్‌లోనే కుటుంబీకులతో ఉంటున్నారు. నెల రోజుల క్రితం రమేశ్‌ కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స కోసం కుటుంబీకులు రూ.11 లక్షలు ఖర్చు చేశారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం తెల్లవారుజామున రమేశ్‌ మృతిచెందారు. మృతదేహాన్ని అంబులెన్‌‍లో తాటికల్‌కు తీసుకొచ్చారు.

బంధువులెవరూ రాలేని పరిస్థితి ఉండటంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతోపాటు మరికొందరు స్నేహితులు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు జరిపారు. లండన్‌లో ఉంటున్న రమేశ్‌ తమ్ముడు భారత్‌కు విమానాల రాకపోకలు లేకపోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అన్న అంత్యక్రియలను ఆయన వీడియో కాల్‌ ద్వారా చూస్తూ కన్నీరుమున్నీరుగా విలపించారు.  

చదవండి: కీసరలో విషాదం: అవమానం భరించలేక కుటుంబం ఆత్మహత్య

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top