సాక్షి,హైదరాబాద్:పలు రాష్ట్రాలకు చెందిన సినీ ఇండస్ట్రీకి తలనొప్పిగా మారిన ప్రముఖ సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ,బప్పం టీవీలకు సంబంధించిన కీలక నిందితుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇమ్మడి రవి అరెస్ట్ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇమ్మడి రవి అరెస్ట్‌కు ప్రధాన కారణం కాసుల కక్కుర్తే అని తెలుస్తోంది.
ఇమ్మడి రవి అరెస్టు ఇలా
విదేశాల్లో ఉన్న ఇమ్మడి రవి భార్య నుంచి విడాకులు తీసుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ సమయంలో రవి గురించి సమాచారం అందుకున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో ఇమ్మడి రవి తీగ లాగితే డొంకంతా కదిలింది. ఇమ్మడి రవి విడుదలైన కొత్త సినిమాను పైరసీ చేయడం వాటిని ఐబొమ్మ, బప్పం టీవీ సైట్లలో అప్‌లోడ్ చేస్తుండేవాడు. తద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదని కొత్త మార్గాల్ని ఎంచుకున్నాడు. అందుకు టెలిగ్రామ్‌ను వేదిక చేసుకున్నాడు. టెలిగ్రామ్‌లో యూజర్లు సినిమా లింక్స్ క్లిక్ చేస్తే బెట్టింగ్ యాప్స్,గేమింగ్ యాప్స్ యాడ్స్ వచ్చేవి.వాటి ద్వారా భారీ ఆదాయాన్ని గడించాడు.
పోలీసుల దర్యాప్తు ఇలా
అదే సమయంలో తెలంగాణ సీఐడీ పోలీసులు బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌పై సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆ దర్యాప్తులో ఉండగా పోలీసులకు ఇమ్మడి రవి సైతం బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న విషయాన్ని గుర్తించారు. ఐబొమ్మ,బప్పం టీవీలో పైరసీ సినిమా చూసే సమయంలో అనైతిక గేమింగ్, బెట్టింగ్ యాప్స్‌కు సంబంధిత యాడ్స్‌ను ప్రసారం చేసేవాడు. పైరసీ సినిమాను ఓపెన్ చేయాలన్నా, డౌన్‌లోడ్ చేయాలన్నా, ఇంటర్వెల్ తర్వాత సినిమా చూడాలన్నా, సినిమా చూసే సమయంలో పాజ్ క్లిక్ మళ్లీ చూడాలన్నా ఆ యాడ్స్‌ను క్లిక్ చేసేలా వ్యవస్థను తయారు చేశాడు.
ఇమ్మడి రవి అనుచరులు అరెస్టు
అలా పోలీసులు బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు చేస్తుండగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పైరసీ కంటెంట్‌కు సంబంధించి ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. వారిలో శివాజీ,ప్రశాంత్ ఉన్నారు. వారిద్దరూ ఇమ్మడి రవికి ప్రధాన అనుచరులుగా పోలీసులు భావిస్తున్నారు. వాళ్లిద్దరూ అరెస్ట్ అనంతరం కూకట్‌పల్లి నుంచి తప్పించుకుని నెలకొకసారి దేశాలు మారుతూ వచ్చాడు. కూకట్ పల్లి నుంచి నెదర్లాండ్, ఫ్రాన్స్, కరేబీయన్ దీవుల్ని అడ్డగా చేసుకొని పైరసీ సైట్లను నిర్వహించాడు. ఐబొమ్మ రవి ప్రస్తుతం భార్యతో విడాకుల కేసులో హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరవుతున్నాడు. అదే క్రమంలో తదుపరి విచారణ కోసం అతడు ఫ్రాన్స్ నుంచి కూకట్ పల్లికి రాగా.. రవిని పోలీసులు అరెస్టు చేశారు. రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన విషయం అతడి దగ్గరి వ్యక్తుల నుంచి పోలీసులకు లీకైందని కూడా ఒక గుసగుస వినిపిస్తోంది.
70కి పైగా పైరసీ సైట్లు
కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో అతనిని అరెస్టు చేసే సమయంలో వందల సంఖ్యలో హార్డ్ డిస్క్‌లు, ఐబొమ్మ, బప్పం టీవీలో విడుదల చేసేందుకు అప్‌లోడ్ చేసిన కొత్తగా విడుదలైన సినిమాలు, సర్వర్లను మెయింటైన్ చేసేందుకు వినియోగించిన సాఫ్ట్‌వేర్లు కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లను సీజ్ చేశారు. 2018 నుంచి నివాసం ఉంటున్న ఫ్లాట్‌ను కేంద్రంగా చేసుకున్న ఇమ్మడి రవి ఐబొమ్మ,బప్పంటీవీలలో సినిమాలను అప్‌లోడ్ చేసేవారని,కరేబియన్ దీవుల్లో సైతం కార్యకలాపాలు కొనసాగించినట్లు తేలింది. ఐబొమ్మ, బప్పంటీవీలను ప్రధానంగా ఉంచుకొని.. అదనంగా మరో 70కి పైగా ఆపరేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాటి ఆధారాల్ని సేకరించారు.
దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అన్నాడని
అనంతరం, తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ, బప్పం టీవీని నిలిపివేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే ఈ వెబ్‌సైట్లను క్లోజ్ చేయించారు. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అంటూ ఇమ్మడి రవి విసిరిన సవాలను స్వీకరించి అతడితోనే ఐబొమ్మ, బప్పం టీవీలను నిలిపివేయించారు. ఇమ్మడి రవి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డిస్క్‌లను, బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.
పోలీసుల కస్టడీ పిటిషన్‌లో
బెట్టింగ్ యాప్,గేమింగ్ యాప్ సంస్థలతో ఇమ్మడికి రవికి సంత్సంబంధాలు ఉన్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఇమ్మడి రవికి ఎవరైనా సహకరిస్తున్నారా?. డిసస్టట్రిబ్యూటర్లు సినిమా కాపీనీ పలు డిజిటల్ ఛానెళ్లకు ఇస్తుంటారు. ఆ సర్వర్‌లలోకి వెళ్లిమరీ హ్యాక్ చేశాడు. ఎంతో పకడ్బందీగా ఉండే సర్వర్‌లలో ఎలా ఎంటర్ అయ్యాడు? సినిమాని ఎలా కాపీ చేశాడు? ఆ సినీమాని ఎలా పైరసీ చేశారనే విషయాలు వెలుగులోకి రావాలల్సి ఉంది. ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు సేకరించాలని భావిస్తున్న పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
కాగా, అరెస్టు అనంతరం ఇమ్మడి రవిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు.


