మానవత్వమా.. నీవెక్కడ..?

House Owners Not Allowed COVID 19 Dead Bodies in Adilabad - Sakshi

మృతదేహాలను అనుమతించని ఇంటి యజమానులు

పుట్టెడు దుఃఖంలో కఠినంగా వ్యవహరిస్తున్న వైనం

కష్టకాలంలో రోడ్డుమీదకు అద్దెకుంటున్న కుటుంబాలు

కలవరపరుస్తున్న పలు సంఘటనలు

చెన్నూర్‌: ‘మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్న వాడు, మచ్చుకైన లేడు చూడు.. మానవత్వం ఉన్న వాడు..’ అని ఓ సినీగేయ రచయిత మంటగలుస్తున్న 
మానవత్వం గురించి పాట రాశాడు. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే రచయిత చెప్పింది అక్షరాల నిజమనిపించక మానదు. సాటి మనిషి చనిపోతే సహాయం చేయాల్సిన సమయంలో కొందరు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిని అక్కున చేర్చుకోవాల్సింది పోయి చీదరించుకుంటున్నారు. అద్దె ఇళ్లలో ఉన్న కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే మృతదేహాలను ఇంటికి తీసుకురావడానికి కూడా నిరాకరిస్తున్నారు. దీంతో కష్టకాలంలో మృతుల కుటుంబాలు రోడ్డు మీదకు చేరుతున్నాయి.

ఇంటి ఆవరణలోకి కూడా అనుమతి లేదు
మండలంలోని జజ్జరెల్లి గ్రామానికి చెందిన దొంతల సత్యం చెన్నూర్‌ పట్టణానికి బతుకు దెరువు కోసం వలస వచ్చాడు. చెన్నూర్‌లో కూలీ పని చేసుకుంటూ అద్దె ఇంటిలో జీవనం సాగిస్తున్నాడు. సత్యం కుమారుడు దొంతల వినోద్‌ (22) అనారోగ్యానికి గురికాగా వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. వినోద్‌ మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి ఇంటి యాజమాని నిరాకరించాడు. దీంతో గోదావరి నది వద్దే కుటుంబసభ్యులు వానలో తడుస్తూ దహన సంస్కారాలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు సత్యం కుటంబానికి ఆసరాగా నిలిచారు. దశదిన కర్మ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. ఇలాంటి ఘటనలు జిల్లా వ్యాప్తంగా ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. 

మానవత్వంతో ఆలోచించాలి...
జిల్లాలో సుమారు 40శాతం మంది అద్దె ఇళ్లలోనే జీవనం సాగిస్తున్నారు. కొందరు పేదరికంతో ఇళ్లు కట్టుకోలేక, మరికొందరు బతుకు దెరువు కోసం వచ్చి అద్దె ఇళ్లలో ఉంటున్నారు. శుభకార్యాలకు చేయూతనందిస్తున్న ఇంటి యజమానులు ఆçపదకాలంలో మాత్రం మానవత్వాన్ని మరిచిపోతున్నారు. వివిధ ఆచారాల పేర్లు చెబుతూ మృతదేహాలను ఇళ్లకు రానివ్వడం లేదు. పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను రోడ్ల మీద పడేస్తున్నారు. కష్టకాలంలో ఉన్నవారిని అక్కున చేర్చుకొని ఆదరిస్తే రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.

గతంలో జరిగిన     కొన్ని సంఘటనలు 
2018లో చెన్నూర్‌ పట్టణానికి చెందిన బొంతల పెంటయ్య భార్య బొంతల బానక్క (45) జ్వరంతో ఆదివారం రాత్రి మృతి చెందింది. వారి కుటుంబం బట్టిగూడెం ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటుంది. భార్య మృతదేహాన్ని అద్దె ఉంటున్న ఇంటికి తీసుకెళ్లగా ఇంటి యాజమాని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో బానక్క మృతదేహాన్ని పట్టణంలోని పెద్ద చెరువు కట్ట ప్రాంతంలోగల కోటపల్లి బస్‌షెల్టర్‌కు తీసుకెళ్లాడు. ఇద్దరు పిల్లలతో కలిసి జోరు వానలో మృతదేహాంతో మరుసటి రోజువరకు అక్కడే ఉన్నారు.

2017 సెప్టెంబర్‌ 4న గాంధీచౌక్‌ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉండే నేమిక్‌చంద్‌ ఖండెల్‌ శర్మ అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంటి యాజమాని మృతదేహంతో పాటు బంధువులను సైతం ఇంటి ఆవరణలోకి కూడా రానివ్వలేదు. దీంతో మృతదేహాన్ని రోడ్డు మీదనే ఉంచి, బంధువులు వచ్చాక దహన సంస్కారాలకు గోదావరినది తీరానికి తరలించారు. 

పట్టణంలోని గోదావరి రోడ్డులో అద్దె ఇంట్లో నివాసం ఉండే దొంతల శ్రీ మతి రెండేళ్ల క్రితం మృతి చెందింది. ఇంటి యాజమాని మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వలేదు. 

ఏడేళ్ల క్రితం పట్టణంలోని కొత్తగూడెం కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న పాలబోయిన శ్రీనివాస్‌ (25) అనే యువకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. సదరు ఇంటి యాజమా ని మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వక పోవడంతో రోడ్డు పక్కనే శవాన్ని ఉంచాల్సిన దుస్థితి నెలకొంది. 

యజమానులు ఆదరించాలి
పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక తప్పదు. అద్దె ఇంట్లో ఉంటున్న వారి మృతదేహాలను ఇళ్లలోకి రానివ్వకపోవడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అద్దె ఇంటి యజమానులు మానవత్వంతో ఆలోచించి వారిని ఆదరించాలి. ప్రభుత్వం ప్రత్యేక గదులు నిర్మించాలి.– సుద్దపల్లి సుశీల్‌కుమార్, బీజేపీ నాయకులు, చెన్నూర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top