బ్లాక్‌మార్కెట్‌పై సీఎం సీరియస్‌: హోంమంత్రి మహమూద్‌ అలీ 

Home Minister Mahmood Ali Review Meeting With The DGP - Sakshi

ఆక్సిజన్, రెమిడెసివిర్‌ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం 

డీజీపీతో సమీక్షా సమావేశంలో హోంమంత్రి మహమూద్‌ అలీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించాలా.. వద్దా అనే విషయంపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో కరోనా సెకండ్‌ వేవ్, నైట్‌ కర్ఫ్యూ, ఔషధాల బ్లాక్‌మార్కెట్, రంజాన్‌ ప్రార్థనలు తదితర విషయాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా మొదటివేవ్‌లో పోలీసుశాఖ సమర్థంగా పనిచేసిందని, ప్రస్తుతం సెకండ్‌వేవ్‌లోనూ మరింత మెరుగ్గా పనిచేస్తోందని కితాబిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు, వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదని, రెమిడెసివిర్‌ తదితర ఇంజెక్షన్లతో సహా ఇతర అత్యవసర మందులన్నీ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టంచేశారు.

కొందరు ప్రజలు భయంతోనో లేదా ముందుజాగ్రత్తతోనే ఆక్సిజన్‌ సిలిండర్లు కొని ఇంట్లో పెట్టుకుంటున్నారని.. దీంతో సిలిండర్ల కొరత ఏర్పడే ప్రమాదముందని, అనవసరంగా కొన్న మందులు కూడా పాడైపోతాయని చెప్పారు. అదే సమయంలో కొందరు ఆక్సిజన్, రెమిడెసివిర్, ఇతర అత్యవసర మందులను నల్ల బజారులో విక్రయిస్తున్నారని, వారిని ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసులను ఆదేశించారు. ప్రాణాలు కాపాడే ఔషధాలను నల్లబజారులో విక్రయిస్తుండటంపై సీఎం సీరియస్‌గా ఉన్నారని మహమూద్‌ అలీ చెప్పారు. ప్రజలంతా తప్పకుండా భౌతికదూరం పాటించాలని, మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, హైదరాబాద్‌ కమిషనర్‌ అంజనీ కుమార్, సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్, రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భాగవత్‌ పాల్గొన్నారు.

కాగా, సమీక్ష సమావేశం అనంతరం హోంమంత్రి మహమూద్‌ అలీ ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు. ఈనెల 30వ తేదీతో నైట్‌ కర్ఫ్యూ ముగుస్తుంది కదా? లాక్‌డౌన్‌ పెడతారా? అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. రాష్ట్రంలోని పరిస్థితులపై త్వరలో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. వాస్తవానికి సీఎంకు లాక్‌డౌన్‌ పెట్టడం ఇష్టం లేదని చెప్పారు. కాగా, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు ఇలాగే జాగ్రత్తలు పాటిస్తే మరో 3–4 వారాల్లో వైరస్‌ అదుపులోకి వస్తుందని.. అలాంటప్పుడు లాక్‌డౌన్‌ పెట్టాలనే ఆలోచనే ఉండదని పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top