‘గుట్టలు గుల్ల’కు ఇక చెల్లు 

High Court to stop Battapur Gutta  - Sakshi

బట్టాపూర్‌ గుట్ట స్వాహాను అడ్డుకోవాలన్న హైకోర్టు 

‘గుట్టలు గుల్ల’కథనంతో క్వారీ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ 

 7 మండలాల్లో ‘సాక్షి’ కథనాలతో ఫ్లెక్సీలు కట్టిన స్థానికులు, బీజేపీ శ్రేణులు 

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలోని ఏర్గట్ల మండలం బట్టాపూర్‌ వద్ద నిబంధనలు అతిక్రమించి గుట్టను తవ్వడాన్ని అడ్డుకోవాలని రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో స్థానికులు, బీజేపీ శ్రేణుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేకుండా బట్టాపూర్‌లో గుట్టలను తొలిచేయడంపై గతేడాది ’సాక్షి’ప్రదాన సంచికలో ‘గుట్టలు గుల్ల’శీర్షికన కథనం ప్రచురితమైంది.

ఈ కథనం ఆధారంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి హైకోర్టులో ‘పిల్‌’దాఖలు చేశారు. దీనిపై గత నెల 16న ‘బట్టాపూర్‌ గుట్ట మింగివేతపై పిల్‌’అనే కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన మైన్స్‌ అండ్‌ జియాలజీ విభాగానికి చెందిన బృందం ‘ఈటీఎస్‌’(ఎల్రక్టానిక్‌ టోటల్‌ సర్వే) గుట్టలను పరిశీలించి నివేదిక ఇచ్చింది.

ఈ క్రమంలో క్వారీ, క్రషర్‌ను సీజ్‌ చేయాలని చెప్పిన హైకోర్టు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా మొత్తం 13 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాటికి కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.

హైకోర్టు తీర్పుపై బీజేపీ నేతలు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల, మోర్తాడ్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, వేల్పూర్, భీంగల్‌ మండలాల్లో ఫ్లెక్సీలు కట్టారు. గతంలో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలను వాటిపై ముద్రించారు. మరోపక్క గురువారం బట్టాపూర్‌ గుట్ట వద్ద బీజేపీ శ్రేణులు టపాకాయలు కాల్చి కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశాయి. కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top