హైస్పీడ్‌ రైల్‌తో హైదరాబాద్‌ కనెక్టివిటీకి బూస్ట్‌ | Hi-speed rail hub gets land at Shamshabad | Sakshi
Sakshi News home page

హైస్పీడ్‌ రైల్‌తో హైదరాబాద్‌ కనెక్టివిటీకి బూస్ట్‌

Apr 11 2026 10:41 AM | Updated on Apr 11 2026 12:59 PM

Hi-speed rail hub gets land at Shamshabad

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ను దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానించే హై–స్పీడ్‌ రైల్‌ హబ్‌కు ముందడుగు పడింది. భారతీయ రైల్వేను అత్యాధునికంగా రూపొందించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ ఏడాది ఫ్రిబవరిలో బడ్జెట్‌లో హైదరాబాద్‌ కేంద్రంగా మూడు హైస్పీడ్‌ రైల్వే కారిడార్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–చెన్నై, హైదరాబాద్‌–పుణె కారిడార్లలో పరుగులు పెట్టనుంది. ఈ మేరకు శంషాబాద్‌ మండలం బహదూర్‌గూడలోని సర్వే నంబర్లు 28, 62లలో 650 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు.  

ప్రయాణ, రవాణా, పారిశ్రామిక, ఆర్థిక వృద్ధి.. 
భాగ్యనగరానికి దక్షిణ ద్వారంగా పిలిచే శంషాబాద్‌.. హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌తో ఇకముందు దేశానికే ఏరో ట్రోపోలిస్‌ హబ్‌గా నిలవనుంది. దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్‌ సిటీలను కలిపే ఏకైక హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌ నగరంగా శంషాబాద్‌ అభివృద్ధి చెందనుంది. హై– స్పీడ్‌ రైల్‌ కారిడార్లతో ప్రయాణికులకు వేగవంతమైన ప్రయాణం వీలుండటంతో పాటు ప్రాంతీయ రవాణా, పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాల వృద్ధి విస్తరణకు వీలవుతుంది. దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారుతుందని నిపుణుల అంచనా. దేశంలోని ప్రధాన ఐటీ హబ్‌లైన బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్‌ నగరాలను హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ను అనుసంధానిస్తుండటంతో ఉద్యోగులు ఒకే పని దినంలో ఒక నగరం నుంచి మరో నగరానికి సులువుగా రాకపోకలు సాగించే వీలుంటుంది. దీంతో విద్య, వైద్యం, పర్యాటక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశముంది.  

తొలుత ఇవి..  
బెంగళూరు, చెన్నై, పుణె మూడు నగరాలతో అనుసంధానం కానున్న హైదరాబాద్‌ రైల్‌ కారిడార్‌లో.. తొలుత హైదరాబాద్‌–చెన్నై, హైదరాబాద్‌–బెంగళూరు కారిడార్లకు సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) రూపొందించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ రెండు కారిడార్ల డీపీఆర్‌లు పూర్తవుతాయని, ఆ తర్వాత 2027–28 ఆర్దిక సంవత్సరంలో హైదరాబాద్‌–పుణె కారిడార్‌ డీపీఆర్‌ ఉంటుందని సమాచారం. హైస్పీడ్‌ రైళ్లతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌– బెంగళూరు, హైదరాబాద్‌–చెన్నై మార్గంలో ప్రయాణానికి 8– 10 గంటలు, హైదరాబాద్‌– పుణె మార్గంలో 10– 11 గంటల సమయం పడుతోంది. హైస్పీడ్‌ రైల్‌తో ప్రతి కారిడార్‌లో సుమారు ఏడు గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది.  

 

Advertisement
 
Advertisement
Advertisement