
సాగర్ వద్ద 22 క్రస్ట్ గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు
భారీ వర్షాలతో నిండుగా ప్రవహిస్తున్న నదులు
మేడిగడ్డ బరాజ్ వద్ద 5.66 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నాగార్జునసాగర్ 22 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి నెట్‌వర్క్: ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తోపాటు తెలంగాణ, ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల ఉధృతి ఆదివారం మరింత పెరిగింది. కాళేశ్వరం వద్ద పుష్కర ఘాట్లను తాకుతూ 9.980 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. అన్నారం (సరస్వతి) బరాజ్ వద్ద ఇన్‌ఫ్లో 80 వేల క్యూసెక్కులకు చేరింది.
బరాజ్‌లోని మొత్తం 66 గేట్లు ఎత్తి వరద మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బరాజ్‌కి 5.66 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతీ బరాజ్‌కి 1,84,330 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అదేస్థాయిలో ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 12.98 మీటర్లకు గోదావరి నీటి మట్టం చేరుకుంది.
సోమవారం నాటికి మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. కొండాయి వద్ద జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు పడవల ద్వారా మల్యాల, కొండాయి, ఐలాపురం, గోవిందరాజు కాలనీ ప్రజలను తరలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏఎస్పీ శివం ఉపాధ్యాయ,
తహసీల్దార్ జగదీశ్, ఎంపీడీఓ శ్రీనివాస్, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్ తెలిపారు.
సాగర్‌కు నిలకడగా వరద
కృష్ణానదిలో కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం ఆనకట్ట వద్ద ఆదివారం మూడు గేట్లు ఒక్కొక్కటి పది అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో క్రస్ట్ గేట్ల ద్వారా 77,946, విద్యుదుత్పత్తి చేస్తూ 38,818, సుంకేసుల నుంచి 49,632 మొత్తం 1,66,396 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వస్తోంది. దీంతో మూడు గేట్ల ద్వారా 79,269 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ మరో 65,807 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదిలారు.
ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 881.4 అడుగుల వద్ద 195.6605 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ నుంచి మొత్తం 1,99,781 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590.00 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.60 అడుగులకు చేరింది.