breaking news
nagarjauna sagar
-
పొంగుతున్న కృష్ణా, గోదావరి
సాక్షి నెట్వర్క్: ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తోపాటు తెలంగాణ, ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల ఉధృతి ఆదివారం మరింత పెరిగింది. కాళేశ్వరం వద్ద పుష్కర ఘాట్లను తాకుతూ 9.980 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. అన్నారం (సరస్వతి) బరాజ్ వద్ద ఇన్‌ఫ్లో 80 వేల క్యూసెక్కులకు చేరింది. బరాజ్‌లోని మొత్తం 66 గేట్లు ఎత్తి వరద మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బరాజ్‌కి 5.66 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతీ బరాజ్‌కి 1,84,330 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అదేస్థాయిలో ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 12.98 మీటర్లకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. సోమవారం నాటికి మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. కొండాయి వద్ద జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు పడవల ద్వారా మల్యాల, కొండాయి, ఐలాపురం, గోవిందరాజు కాలనీ ప్రజలను తరలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, తహసీల్దార్ జగదీశ్, ఎంపీడీఓ శ్రీనివాస్, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ తెలిపారు. సాగర్‌కు నిలకడగా వరదకృష్ణానదిలో కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం ఆనకట్ట వద్ద ఆదివారం మూడు గేట్లు ఒక్కొక్కటి పది అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో క్రస్ట్ గేట్ల ద్వారా 77,946, విద్యుదుత్పత్తి చేస్తూ 38,818, సుంకేసుల నుంచి 49,632 మొత్తం 1,66,396 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వస్తోంది. దీంతో మూడు గేట్ల ద్వారా 79,269 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ మరో 65,807 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదిలారు.ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 881.4 అడుగుల వద్ద 195.6605 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ నుంచి మొత్తం 1,99,781 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590.00 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.60 అడుగులకు చేరింది. -
కృష్ణా ఎగువన వరద తగ్గుముఖం
నాగార్జునసాగర్/దోమలపెంట/డిండి: ఎగువ నుంచి కృష్ణానది నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఎత్తి ఉంచిన 7 గేట్లలో 4 గేట్లను గురువారం మూసివేశారు. 3 గేట్ల ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 881.9 అడుగుల వద్ద 198.3623 టీఎంసీల నీటి నిల్వ ఉంది.⇒ సాగర్ ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. 26 క్రస్ట్‌గేట్లు 5 అడుగులు ఎత్తి దిగువకు స్పిల్‌వే మీదుగా 2,03,762 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 587.50 అడుగులు ఉంది. ⇒ నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రం సమీపంలోని డిండి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి గురువారం అలుగుపోస్తోంది. ఎగువన నాగర్‌కర్నూల్ జిల్లాలో కురిసిన వర్షాలకు దుందు వాగు పరవళ్లు తొక్కడంతో డిండి ప్రాజెకుకు వరద వచ్చింది. డిండి ప్రాజెక్టు అలుగు పోస్తుండగా, ఆ సుందర దృశ్యాన్ని దిగువన హైదరాబాద్–శ్రీశైలం హైవేపై వెళుతున్న వాహనదారులు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తత.. రేవంత్, బండి రియాక్షన్
సాక్షి, కరీంనగర్/కొడంగల్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాగర్ డ్యామ్‌పైకి ఏపీ పోలీసులను, ఏపీ ఇరిగేషన్ అధికారులను వెళ్లకుండా తెలంగాణ పోలీసులు గేటు వేసి అడ్డుకున్నారు. గేటు తీయమని శాంతియుతంగా ఎంత చెప్పినా తెలంగాణ పోలీసులు వినలేదు. ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న గేటుకు సంబంధించిన సెన్సార్‌ను తెలంగాణ పోలీసులు పగలగొట్టారు. ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు వారికి సెక్యూరిటీ కల్పించారు. పోలీసుల సహకారంతో సాగర్ డ్యామ్‌పై ఏపీ సరిహద్దుల్లో తమ పరిధిలో ఇరిగేషన్ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. నాగార్జునసాగర్ ఘటనపై రేవంత్ స్పందిస్తూ.. ‘ఎన్నికలు వచ్చినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారు. ఏం ఆశించి ఇలా చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నది. ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం కేసీఆర్‌కు అలవాటే. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుందని, నీళ్లు ఎక్కడికీ పోవు. సామరస్యపూర్వకంగా ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎన్నికలపై ఇలాంటి కుట్రలు పని చేయవు. దేశాలే నీటి సమస్యలను పరిష్కరించుకుంటున్నప్పుడు.. రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకోలేమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు సమయస్పూర్తి ఉన్నవాళ్లని, సమస్యను అర్థం చేసుకోగలిగే వాళ్లని అన్నారు. పోలింగ్‌కు ముందురోజు సెంటిమెంట్‌ను రగిల్చేందుకు యత్నించారు’ అని విమర్శించారు. ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం బండి సంజయ్ నాగార్జున సాగర్ ఘటనపై స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసి ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఏంది?. తెలంగాణ, ఆంధ్ర ఫీలింగ్ తీసుకొచ్చే కేసీఆర్ అండ్ టీం రెచ్చగొట్టే యత్నం చేస్తోంది. నాగార్జునసాగర్ ఇష్యూ ఇప్పుడే ఎందుకు తెరపైకి వచ్చింది.? తెర వెనుక ఎవరున్నారు?. కేసీఆర్‌వి ఫాల్స్ రాజకీయాలు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
ఆ ఊరంతా దురదే !
తిరుమలగిరి(నాగార్జునసాగర్): టెయిల్‌పాండ్ నీటిని తాగిన ఆ ఊరి జనమంతా దురదబారిన పడ్డారు. ఊరు ఊరంతా ఒళ్లు దద్దుర్లు, వాంతులు, విరేచనాలు, జ్వరాలతో బాధపడుతోంది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకునితండా గ్రామస్తులు టెయిల్‌పాండ్ నీటిని తాగడం ద్వారా గిరిజనులు దురద, వాంతులు, తలనొప్పితో ఇబ్బందులు పడుతున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లో విద్యుత్ ఉత్పత్తి అయిన నీటిని రివర్స్ పంపింగ్ చేయడంతో ఆ నీళ్లు టెయిల్‌పాండ్‌లోకి వచ్చి నిల్వ ఉండడంతో ఆ నీటిని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు శుద్ధి చేయకుండా నేరుగా మండలంలోని చింతలపాలెం, నాయకునితండాల్లో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌కు పంపిస్తున్నారు. దీంతో ఆనీరు తాగిన వారికి ఒళ్లంతా ఎర్రని మచ్చలు ఏర్పడుతున్నాయి. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కావడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యాధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని తండావాసులు కోరుతున్నారు. -
నాగార్జున సాగర్.. ఒక అరుదైన ముచ్చట
నాగార్జున సాగర్.. ఇది ఒక ఆధునిక దేవాలయం. దాదాపు పన్నేండేళ్ల శ్రమకు నిదర్శనం. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చాలా భాగం హరితవనంగా మారడానికి ఈ ఆనకట్టే కారణం. నల్గొండ జిల్లా, గుంటూరు జిల్లాల మధ్య కృష్ణా నదిపై నాగార్జున సాగర్ నిర్మించారు. ఇది దేశంలోనే అతి పెద్ద రాతికట్టడం. 1955-1967కాలంలో దీన్ని నిర్మించారు. దాదాపు 11,472 మిలియన్ ఘనపు అడుగుల నీటిని నిలువ చేయగల సామర్థ్యం ఉన్న ఈ జలాశయం 490 అడుగుల ఎత్తు కలిగి 1.6 కిలోమీటర్ల పొడవుతో 26 గేట్లతో ఉంది. ప్రతి గేటు 42 అడుగుల వెడల్పు కలిగి 45 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇంత పెద్ద రాతి ఆనకట్ట నిర్మాణంలో యంత్రాలకంటే మనుషులే అమితంగా సేవలు అందించారు. పెద్దపెద్ద బండరాళ్లను, ఇనుప సామాన్లను కావిడ్లు వేసుకొని తమ భుజాలపై అంత ఎత్తుకు ఎక్కారు. ఒక చేత్తో కర్ర పొడుచుకుంటూ మరో చేత్తో భుజాలపై త్రాసులాగా తగిలించిన కావిడ్లపై పెద్ద పెద్ద బండరాళ్ల వేసుకొని ఆన కట్ట నిర్మాణానికి అందించారు. పదుల అంతస్తుల్లో నిర్మించిన పరంజీలు ఎక్కి మరీ ఈ సాహసం చేశారు. మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే చిన్నచిన్న పిల్లలు కూడా ఈ ఆనకట్ట నిర్మాణంలో భాగస్వాములయ్యారు. తమ నెత్తిన సిమెంటు ఇసుకను, బండరాళ్లను కాళ్లకు చెప్పులు కూడా ధరించకుండా మిక్కిలి సంతోషంతో అందించారు. ఆనాటి పరిస్థితుల ప్రకారం తమ పొట్ట నింపుకునేందుకు అంతపెద్ద కష్టం చేసి ఉంటారేమోకానీ, వాస్తవానికి తాము చేస్తోంది ఒక చరిత్రోపకారం అనే విషయం ఆ అమాయక చిన్నారులకు తెలియకపోయి ఉండొచ్చు. ఆ వయసులోనే అంతపెద్ద బరువులు మోసిన వారితో పోలిస్తే నేటి చిన్నారుల బలం బలాదురూ అవుతుందేమో..!