
సాగర్ వద్ద మూడు రంగుల విద్యుత్ వెలుగుల్లో కృష్ణమ్మ పరవళ్లు
శ్రీశైలంలో 3 గేట్లు, సాగర్‌లో 26 గేట్ల ద్వారా నీటి విడుదల
అలుగుపోస్తున్న డిండి ప్రాజెక్టు
నాగార్జునసాగర్/దోమలపెంట/డిండి: ఎగువ నుంచి కృష్ణానది నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఎత్తి ఉంచిన 7 గేట్లలో 4 గేట్లను గురువారం మూసివేశారు. 3 గేట్ల ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 881.9 అడుగుల వద్ద 198.3623 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
⇒ సాగర్ ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. 26 క్రస్ట్‌గేట్లు 5 అడుగులు ఎత్తి దిగువకు స్పిల్‌వే మీదుగా 2,03,762 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 587.50 అడుగులు ఉంది.
⇒ నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రం సమీపంలోని డిండి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి గురువారం అలుగుపోస్తోంది. ఎగువన నాగర్‌కర్నూల్ జిల్లాలో కురిసిన వర్షాలకు దుందు వాగు పరవళ్లు తొక్కడంతో డిండి ప్రాజెకుకు వరద వచ్చింది. డిండి ప్రాజెక్టు అలుగు పోస్తుండగా, ఆ సుందర దృశ్యాన్ని దిగువన హైదరాబాద్–శ్రీశైలం హైవేపై వెళుతున్న వాహనదారులు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.