ఏ ఆస్పత్రిని చూసినా ఏమున్నది గర్వకారణం.. రోగుల అవస్థలే సర్వం అన్నట్లుగా నగరంలోని సర్కారు దవాఖానాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. రోగులకు వసతుల కల్పనలో విఫలమవుతున్నాయి. సరైన వైద్య సేవలు అందించడంలో వెనకడుగు వేస్తున్నాయి. పలు ఆస్పత్రుల గేటు నుంచే రోగుల సహనానికి పరీక్ష మొదలవుతోంది. ఓపీ చీటీ కోసం గంటల తరబడి క్యూ లైన్‌లో నిల్చోవాల్సిన పరిస్థితి. కూర్చునేందుకు కుర్చీ ఉండదు. నిలబడేందుకు స్థలం దొరకదు. ఓపీ తీసుకున్నాక వైద్యుల రాక కోసం ఎదురు చూడాలి. ఒకవేళ ఉన్నా రోగి మాట వినే పరిస్థితి లేదు. కష్టం పూర్తిగా వినకుండానే సెకన్ల వ్యవధిలో నెక్ట్స్ అంటున్నారు. పరీక్షలు, వాటి రిపోర్టుల కోసం దాదాపు రెండు రోజులు తిరగాలి. ఆస్పత్రిలో చేరాలంటే బెడ్ కోసం పైరవీ చేయాలి. సిబ్బంది చీదరింపులు సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారంతా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారు కావడంతో మిన్నకుండిపోతున్నారు.
నిత్యం 18 వేలకుపైగా ఓపీ..
నగరంలో 10 సూపర్‌స్పెషాలిటీ, 2 అటానమస్, అలాగే జిల్లా, ప్రాంతీయ, అర్బన్ సీహెచ్‌సీ, పీహెచ్‌సీలు ఉన్నాయి. రోజుకు సుమారు 16 వేల నుంచి 18 వేల వరకు రోగులు (ఓపీ) వస్తున్నారు. అన్ని ఆస్పత్రుల్లో కలిపి సుమారు 9,400 బెడ్ల సామర్థ్యం ఉంది. సోమవారం నిమ్స్‌లో ఓపీ 4 వేలు దాటుతుండగా, గాం«దీ, ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రుల్లో 2,500 ఓపీ దాడుతోంది. రోగులు, వారి సహాయకులతో ఆస్పత్రి ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి.
50 శాతం ఖాళీ..
ప్రధాన ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది. మంజూరైన పోస్టుల్లో 50 శాతం వరకు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మెడికల్ కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో పీజీ విద్యార్థులతో నెట్టుకొస్తున్నారు. వైద్యులు, సహాయక సిబ్బంది కొరత వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఆస్పత్రులకు వెళ్లాలంటే ప్రాణాలపై ఆశలు వదులుకున్నట్లే అనే దుస్థితి కనిపిస్తోంది.
గాందీలో ఘోరం..
గాంధీ ఆస్పత్రిలో వెయ్యి బెడ్ల నుంచి రెండు వేల బెడ్లకు విస్తరించారు. వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఎక్స్‌రే ఫిలిం సరఫరా ఏడాదిగా నిలిచిపోయింది. రోగులు ఫోన్‌తో కంప్యూటర్‌లో ఫొటో తీసుకోమంటున్నారు. ఎమ్మారై స్కాన్ చేయించుకోవాలంటే కనీసం 15 రోజులు ఆగాలి. సీటీ స్కాన్‌కు 5 రోజులు, ల్యాబ్ రిపోర్టులకు రెండు రోజులు ఎదురుచూడాలి. వైద్యులను కలవడానికి మరో రోజు. ఒక రోగి కనీసం మూడు నుంచి నాలుగు రోజులు ఆస్పత్రి చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ప్రధానంగా నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. రోజుకు కేవలం 4 నుంచి ఐదు గంటలు మాత్రమే నీళ్లు వస్తున్నాయి. రోగులు, సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. నీటి కొరతతో శస్త్రచికిత్సలను వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.
సరోజినిలో ఏజెంట్లదే రాజ్యం..
మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ప్రతి విభాగంలోనూ ఏజెంట్లు, అవినీతి, అక్రమ కలెక్షన్లు రాజ్యమేలుతున్నాయి. అక్కడ ఏజెంట్లు ఆడిందే ఆట, పాడిందే పాట. రోగులు తెల్లవారుజాము నుంచే ఆస్పత్రిలో బారులుతీరుతున్నారు. రోజు 1000కిపైగా ఓపీ నమోదవుతోంది.
ఓపీ తీసుకుని సిబ్బందికి రూ.200 నుంచి రూ.300 ఇస్తే మనకు కావాల్సిన కౌంటర్ దగ్గరకు తీసుకెళతారు. క్యాటరాక్ట్ ఆపరేషన్ కావాలంటే రూ.500 ఇవ్వాలి. వార్డు నుంచి నేరుగా ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లిపోతారు. అక్కడ లైను, నెంబర్లతో సంబంధం లేకుండా చికిత్స అందుతుంది. ఆస్పత్రిలో ఇచి్చన కళ్ల జోళ్లు పని చేయవని, ఫలానా దుకాణంలో కొనుగోలు చేయాలని రోగులకు చెబుతున్నారు. దీనికిగాను దుకాణాల నుంచి కÐషన్లు తీసుకుంటున్నారు.
ఎంఎన్‌జేలో నేలపైనే ..
నిత్యం ఓపీ కోసం వచి్చన వారికి కూర్చునేందుకు స్థలం లేదు. మెట్లు, ఆరుబయట కూర్చోవడం, ఓపిక లేనివారు అక్కడే పడకేస్తున్నారు. రోజూ సుమారు 800 వరకు ఓపీ నమోదవుతోంది. ఒక్కో రోగి కేన్సర్ స్కీన్రింగ్, సన్నద్దత, శస్త్ర చికిత్స కోసం సమాయత్తం పేరుతో మళ్లీమళ్లీ తిప్పుకొంటున్నారు. శానిటేషన్ సమస్య ఉంది.
నిలోఫర్‌లో బెడ్ల కొరత
నిలోఫర్‌లో బెడ్ల కొరత వేధిస్తోంది. ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు పిల్లలకు వైద్యం అందిస్తున్నారు. రెండు వేల బెడ్లకు అప్‌గ్రేడ్ చేస్తామని ఏళ్లు గడుస్తున్నా ఆచరణకు నోచుకోవడంలేదు. రోజు 1500 వరకు ఓపీ నమోదవుతోంది. లిఫ్టులు పనిచేయవు, వెయిటింగ్ హాల్ మూడేళ్లుగా ప్రారంభానికి నోచుకోవడంలేదు. ఇక్కడ ప్రధానంగా పేషెంట్లకు ఇచ్చే ఆహారం నాణ్యతపై నిత్యం ఫిర్యాదులు అందుతున్నాయి. పేషెంట్ల సహాయకుల పట్ల నర్సింగ్ స్టాఫ్ దురుసుగా ప్రవర్తించడం, నోరు పారేసుకోవడం సర్వసాధారణమైంది.
ఉస్మానియా.. ఆశలు వదులుకోవాల్సిందే!
ఉస్మానియాలో రోజు 2 వేలకుపైగా ఓపీ నమోదవుతోంది. ఇన్ పేషెంట్‌గా చేర్చుకోవాలంటే బెడ్ కోసం కూడా రికమండేషన్ చేసుకోవాలి. ఇక్కడ డెత్ రేటు ఎక్కువగా నమోదవుతోంది. ఉస్మానియాకు రిఫర్ అనగానే ఆశలు వదులుకోవాల్సిందేనంటున్నారు. శిథిలమైన భవనాల్లో భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు. మార్చురీ నిర్వహణ అధ్వానంగా ఉంటోంది. ఇలా.. నగరంలోని పలు ప్రభుత్వాస్పత్రులు రోగులకు వైద్య సేవలను అందించడంలో నిర్లక్ష్య వైఖరి కనబరుస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


