బనకచర్ల–నల్లమల సాగర్ ఫెయిలవడంతో గోదావరి నదీజలాలకు ఎసరు
అడ్డుకోవాల్సిన సీఎం రేవంత్ ద్రోహానికి పాల్పడుతున్నాడు
చంద్రబాబు లేఖ రాయడంతోనే నవంబర్ 3న ఎన్‌డబ్ల్యూడీఏ భేటీ
ఇచ్చంపల్లి–కావేరి లింకులో 50 శాతం నీళ్లు ఇస్తే అనుసంధానానికి ఓకే: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదీజలాల అనుసంధానం పేరిట తెలంగాణపై పెద్ద కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. అడ్డుకోవాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ కుట్రకు మద్దతు పలుకుతున్నాడని మండిపడ్డారు. గోదావరి– కావేరి లింకు ప్రాజెక్టును పోలవరం నుంచి చేపట్టాలని కోరుతూ ఈ ఏడాది అక్టోబర్ 7న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల నవంబర్ 3న ఢిల్లీలో జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ ఎన్‌డబ్యూడీఏ భేటీ జరుగుతుందన్నారు.
తెలంగాణ భవన్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచే ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి జలాల దోపిడీ మొదలుపెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు కోవర్టుగా మారిన రేవంత్ తెలంగాణ నీటి హక్కులను నిండా ముంచుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జల దోపిడీకి చంద్రబాబు వేసే కొత్త ఎత్తులను బీఆర్ఎస్ చిత్తూ చేస్తూ వస్తోందన్నారు.
‘గోదావరి నుంచి 200 టీఎంసీలు తీసుకెళ్లేందుకు తొలుత పోలవరం–బనకచర్లను తెరమీదకు తెచ్చి ఆ తర్వాత నల్లమలసాగర్గా పేరు మార్చారు. అయినా పాచిక పారకపోవడంతో కొత్తగా గోదావరి– కావేరి అనుసంధానం పేరిట మూడో ప్రతిపాదన తెరమీదకు తెచ్చి పోలవరం నుంచి బొల్లపల్లి, నాగార్జునసాగర్, సోమశిల ద్వారా కావేరికి నీళ్లు తరలించేలా చంద్రబాబు ప్రణాళిక చేశాడు. అడ్డుకోవాల్సిన సీఎం రేవంత్ పూర్తిగా దాసోహం అంటూ గోదావరిలో తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి తాకట్టు పెడుతున్నాడు’అని హరీశ్ విమర్శించారు.
ఇచ్చంపల్లి నుంచి చేపట్టాలి
‘గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి లేదా సమ్మక్కసాగర్ నుంచి చేపట్టేలా గతంలో ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. తెలంగాణ మీదుగా నదీజలాల తరలింపునకు మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి కూడా ఒప్పుకున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం తెలంగాణను పక్కన పెట్టి నాగార్జునసాగర్ మీదుగా బొల్లపల్లి రిజర్వాయర్‌లో 150 టీఎంసీలు నింపుకునేందుకు కుట్రలు పన్నుతున్నాడు.
ఇచ్చంపల్లి నుంచి కావేరి అనుసంధానం చేపట్టి గోదావరి నదీజలాలపై 968 టీఎంసీల ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడంతోపాటు తరలించే నీటిలో 50 శాతం వాటా తెలంగాణకు ఇస్తే ఒప్పుకుంటాం. ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ మీదుగా కావేరి అనుసంధానం జరిగితే తెలంగాణలో 2,38,236 ఎకరాలకు నీళ్లు అందుతాయి. కానీ పోలవరం–కావేరి అనుసంధానం కోసం చంద్రబాబు లేఖ రాసి పది రోజులు అవుతున్నా రేవంత్‌కు సోయి రావడం లేదు’అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘పోలవరం నుంచి గోదావరి కావేరి లింకు పరస్పర ప్రయోజనం అంటున్న చంద్రబాబు.. తమిళనాడు సీఎం విజయ్‌తో భేటీ కావడంతోపాటు ఆల్మట్టిలో కర్ణాటక 16 టీఎంసీలు వాడుకోవచ్చని ఆఫర్ ఇస్తున్నాడు. తెలంగాణకు నష్టం చేసే ఈ ప్రతిపాదన ఎలా పరస్పర ప్రయోజనం అవుతుందో కేంద్రం, చంద్రబాబు, రేవంత్ చెప్పాలి. రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తుంటే, బీజేపీ, కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించడం లేదు’అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఏపీ, తమిళనాడుపై తమకు ద్వేషం లేదని, కానీ తెలంగాణకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.


